సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్‌రావుకు, అబద్ధాల ప్రసంగాలు చదివే గవర్నర్‌కు ఇవే చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులపై చర్యలు గర్హనీయమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘గడిచిన మూడున్నరేళ్లలో 5వేల మంది రైతులు చనిపోయారు. పంటలకు గిట్టుబాట ధరలు లేవు. రైతాంగం ఇంతటి దారుణ స్థితిలో ఉంటే గవర్నర్ ప్రసంగంలో మాటమాత్రమైనా చెప్పరా? సమస్యలపై ఆందోళనకు దిగితే మా సభ్యులపై వేటేస్తారా? నిరసన తెలిపే హక్కును కాదనడానికి మీరెవరు? గతంలో టీఆర్‌ఎస్ గవర్నర్‌పై దాడి చెసిన సంగతి గుర్తుకులేదా, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు నిరసనలు చేస్తున్న సంగతి మర్చిపోయారా?’’ అని రేవంత్ ప్రశ్నించారు.
బీసీలను వ్యతిరేకం చేయాలనే.. : శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై అసలు దాడి జరగనేలేదని, సీఎం డ్రామాలో భాగంగానే వార్తలు ప్రసారం చేశారని రేవంత్ మండిపడ్డారు. ‘‘స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలిందంటున్నారు. కానీ వీడియోను చూపెట్టట్లేదు. అఖిలపక్షాన్నైనా పిలిపించి వీడియోలు చూపిస్తే నిజం బయటపడుతుంది. హరీశ్‌రావు కనుసైగతో లోపలికొచ్చిన మార్షల్స్.. కాంగ్రెస్ సభ్యులను కొట్టారు. ఇదంతా బీసీలను కాంగ్రెస్‌కు వ్యతిరేకం చేయాలన్న కేసీఆర్ పన్నాగం. నల్లగొండలో కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నందుకే కోమటిరెడ్డిపై కక్ష పెంచుకున్నారు. సీఎం ఆదేశాల మేరకే ఆస్పత్రిలో చేరానని స్వయంగా స్వామిగౌడే చెప్పడం ఈ డ్రామాలో కీలక అంశం’’ అని రేవంత్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ గర్జన.. రేవంత్ ఎక్కడ? : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజునుంచే కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తూ, ఆందోళనలు నిర్వహించడం, రెండోరోజుకు సస్పెన్షన్‌కు గురికావడం, ఆ వెంటనే మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించడం తెలిసిందే. ‘ఇంత జరుగుతున్నా రేవంత్ ఎక్కడా కనిపించరేం?’ అని సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన సందర్భంలో రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామాచేశారు. అందుకే ఆయన బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. రాజీనామా ఇంకా ఆమోదం పొందనప్పటికీ సభకు రాకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment