ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను అన్వేషించేందుకు సెయిల్ బృందం( స్టీల్‌ఆధారిటీఆఫ్ ఇండియా) బుధవారం ఇక్కడకు వచ్చింది. తొమ్మిది మందితో కూడిన ఈ బృందం జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌తో కలెక్టరేట్‌లో సమావేశం అయింది. స్టీల్ ప్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన భూములు, వనరులు, ఖనిజ నిక్షేపాలు, నీరు, విద్యుత్, రవాణా తదితర వసతులు, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను కూలంకషంగా చర్చించింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనుండటం గర్వకారణమని జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ వ్యాఖ్యానించారు. అధికారులందరూ ఈ బృందానికి అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని ఆదేశించారు.
మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
‘ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు 2,500 ఎకరాల స్థలం అవసరం. దీనికి బయ్యారం, కొత్తగూడెం మండలం కూనారం చుట్టుపక్కల భూములను పరిశీలించాం. బయ్యారం మండలం ధర్మాపురంలోని 452 సర్వేనంబర్‌లో నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో రెండువేల ఎకరాలు అసైన్డ్ భూమి. పాల్వంచ మండలం ఉల్వనూరులో 318 సర్వే నెంబర్లో 21,960 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఐదువేల ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలింది రిజర్వ్ ఫారెస్ట్ భూమి. కొత్తగూడెం మండలం కూనారంలో4,300 ఎకరాల ప్రభుత్వ భూమి 3/3 సర్వే నంబర్‌లో ఉంది.
పాల్వంచ మండలం కారేగట్టు అనే గ్రామంలో 38 సర్వేలో 9,111 ఎకరాలు,చంచులగూడెంలో 95/1 సర్వే నంబర్‌లో 9,680 ఎకరాల భూమి ఉంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అనువైన వాటిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇనుప ఖనిజం నిక్షేపాలు జిల్లాలో బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో అపారంగా ఉన్నాయి. ఈ ఇనుప ఖనిజాలు హెమటైట్ క్వార్ట్‌లైట్స్‌తో కలిసి ఉన్నాయి. ఈప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నాయి. బయ్యారానికి 20 కిలోమీటర్ల దూరంలోని మాధారంలో డోలమైట్ యూనిట్ ఉంది. 90 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ జిల్లాలో సున్నపురాయి అపారంగా ఉంది.’ అని జేసీ వివరించారు. బయ్యారంలో మండలంలో 230 హెక్టార్లలో ఒక చోట, 318 హెక్టార్లలో మరో చోట ఇనుప ఖనిజం ఉందని ఏపీఎండీసీ పీఓ శివకుమార్ పేర్కొన్నారు.
సెయిల్‌బృందం మాటల్లో...
ఉక్కు పరిశ్రమ నెలకొల్పుటకు ఇనుపఖనిజం, మాగ్నైట్, హెమటైట్ ఖనిజాలు అవసరమని సెయిల్ బృందం తెలిపింది. సున్నపురాయి వంటి ముడిసరుకు పక్కజిల్లాల నుంచి తెచ్చుకోవచ్చు అంది. ఇల్లెందు మండలం కాంచనపల్లిలో బొగ్గుగనులు పుష్కలంగా ఉన్నాయని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ జీవీ రెడ్డి తెలిపారు. ఉక్కుపరిశ్రమకు రోజుకు 49 క్యూసెక్కుల నీరు అవసరమని జేసీ తెలిపారు. ఈ నీటిని బయ్యారం పెదచెరువు, మున్నేరు, కిన్నెరసాని, గోదావరి నుంచి తరలించవచ్చన్నారు. 550 మెగావాట్ల విద్యుత్ అవసరమని, దీనికి 220 కేవీ సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయాలన్నారు.
కాలుష్య నియంత్రణబోర్డు పరిమితులకు లోబడి వ్యవహరించాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు ఎ. మేథీ, లే అవుట్ డెప్యూటీ జనరల్ మేనేజర్ బి.సర్కార్, డీఎం కుమార్, సీనియర్ మేనేజర్ కేఎస్ సవారి, అసిస్టెంట్ మేనేజర్ బెనర్జీ, డి.సాహూ, డీజీఎం సోమేశ్వర్‌సింగ్, ఏకే జా, డీజీఎం (ఐరన్) రాజన్‌కుమార్ సిన్హా, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ శ్రీనివాస్‌నాయక్, మైనింగ్ ఏడీ వెంకటరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ తిరుమలరావు పాల్గొన్నారు.
నేటి పర్యటన ఇలా....
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జిల్లాలో క్షేత్ర పర్యటన చేస్తారు. ఉదయం కిన్నెరసాని, పాల్వంచ, కొత్తగూడెం, బయ్యారం తదితర ప్రాంత్లాలో పర్యటించి వనరులు, పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తారు.
‘ఉక్కు’ సంకల్పంతో..
Published Thu, May 22 2014 2:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM
Advertisement