ఖమ్మం వ్యవసాయ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు చెక్కుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా ఆన్‌లైన్ ఈ పేమెంట్ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు జేసీ సురేంద్రమోహన్ తెలిపారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ‘ఆన్‌లైన్ ఈ పేమెంట్’ ద్వారా సత్వరమే చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ విధానాన్ని ఖమ్మం లోని యాక్సిస్ బ్యాంకులో మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు రైతులకు రూ.12.66లక్షలను వారి ఖాతాల్లో జమ చేశారు. అనంతరం సంబంధిత బ్యాంకు మేనేజర్లు, రైతులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి నగదు జమ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చర్లకు చెందిన ఎం.రామరాజుకు డీసీసీబీలోని అతని ఖాతాకు రూ.3,82,976లను, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పి.చిట్టివెంకటరాజుకు అతని ఎస్‌బీహెచ్ ఖాతాకు రూ.2.72 లక్షలను, అదే గ్రామానికి చెందిన డి.వీరభద్రరాజుకు చెందిన ఎస్‌బీహెచ్ ఖాతాకు రూ.2.44 లక్షలు, బి.నర్సింహరాజుకు సంబంధించిన ఎస్‌బీహెచ్ ఖాతాకు రూ.85,952, డి.శ్రీధర్ ఎస్‌బీహెచ్ ఖాతాకు రూ.2,81,248లను ఆన్‌లైన్ విధానం ద్వారా చెల్లించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న కనీస మద్దతు ధరను పొందేందుకు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని, పైకం చెల్లింపుల్లో జాప్యాన్ని, దళారుల సమస్యను నివారించేందుకు ఆన్‌లైన్ ఈ పేమెంట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా జిల్లాలో ప్రారంభించారని అన్నారు.
గత సంవత్సరం 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది దానికి మూడో వంతు 90వేల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యం నిర్ధేశించామని అన్నారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్, ఐకేపీ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణకు కలిసి కట్టుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. వరి పండించే రైతులందరికీ ఆన్‌లైన్ ఈ పేమెంట్ విధానంపై అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వైవీ.సాంబశివరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి గౌరీశంకర్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు వీబీ.భాస్కర్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఇన్‌చార్జ్ సహాయ సంచాలకులు ఎంఏ.అలీమ్, ఇన్ఫర్మేషన్ సెంటర్ జిల్లా అధికారి శ్రీనివాస్, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గురునాధం, మేనేజర్లు రాఘవరెడ్డి, శివతేజ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు ఆన్‌లైన్‌లో ‘ఈ పేమెంట్’
Published Wed, Nov 12 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement