సాక్షి, తిరుపతి : అదంతా దట్టమైన అటవీ ప్రాంతం... అక్కడకు వెళ్లాలంటే రెండు కొండలు ఎక్కి దిగాలి. సుమారు 12 కి.మీ పైనే నడవాలి. జనావాసాలకు దూరంగా తరతరాలుగా కీకారణ్యంలో గడుపుతున్న నాలుగు ముస్లిం కుటుంబాలకు దాదాపు శతాబ్దం పాటు సర్కారు పథకాలు ఏవీ దరి చేరలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వారు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా ప్రతి నెలా పింఛన్ అందుకుంటున్నారు. రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమకు ఇళ్లు కూడా ఇస్తుందని చెప్పినా ఎందుకనో ఆగిపోయిందని నిట్టూరుస్తున్నారు. ఇల్లు ఇస్తే తాము కూడా జనావాసాల్లోకి వస్తామని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం కల్లూరు రిజర్వు ఫారెస్టులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం శ్రమించి అక్కడకు చేరుకుంది.
నాలుగు తరాలుగా అక్కడే..
సుమారు వందేళ్ల క్రితం ముర్తుజాఖాన్ అనే వ్యక్తి చిట్లిగుట్టకు అటవీ ప్రాంతానికి చేరుకుని నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉంటూ వివాహం చేసుకున్నాడు. ఆయన కుమారుడు మల్కీఖాన్ కూడా అక్కడే నివసిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఐదుగురు కుమారులు కూడా అడవితల్లి ఒడిలోనే పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం వీరంతా పిల్లలతో కలసి అక్కడ ఉంటున్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో సయ్యద్‌ఖాన్ (16) పాముకాటుకు బలి కాగా మరో నలుగురు చిన్నారులు పాముకాటు, ఫిట్స్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఒకసారి అడవికి నిప్పు అంటుకున్న సమయంలో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది.
అడవి ఒడిలోనే చిన్నారులు..
చిట్లిగుట్టలో 18 మంది చిన్నారులుండగా వీరెవరూ పాఠశాల ముఖం చూసిన దాఖలాలు లేవు. బడికి పంపాలంటే సుమారు 12 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోవడంతో చిన్నారులు అడవికే పరిమితమయ్యారు.
పంటలు, పండ్లతోటలు..
అక్కడ ఉంటున్న నాలుగు కుటుంబాలు రాళ్లు రప్పలు, చెట్లను తొలగించి సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వరి, వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు పెంపకం ద్వారా పండ్లు, కాయలను సమీపంలోని కల్లూరులో విక్రయిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment