సిమెంటు రోడ్ల కోసం ఎమ్యెల్యేను నిలదీస్తున్న గిరిజనులు
ఆయన ఒక ప్రజాప్రతినిధి. ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాల్సిన వ్యక్తి. మూడేళ్లుగా రోడ్డు పనులు చేయించకపోవడంపై స్థానికలు నిలదీయడంతో విచక్షణ కోల్పోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై చిందులేశారు. వార్త రాసి ఏం పీకుతారంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సంఘటన పెద్దమండ్యం మండలంలో బుధవారం జరిగింది. ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు, పెద్దమండ్యం: మండలంలోని మందలవారిపల్లె నుంచి తుమ్మలవంకతండా వరకు రూ.4.50 కోట్లతో తారు రోడ్డు, పెద్దేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్యె ల్యే శంకర్‌యాదవ్ బుధవారం శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పరిధిలోని దేనేనాయక్ తండాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ తండాలను కలుపుతూ రోడ్డు వేశామని తెలిపారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ తండాల్లో సిమెంటు రోడ్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తండాలో సిమెంటు రోడ్లు వేసేందుకు మూడేళ్ల క్రితం కంకర, ఇసుక తోలి అలాగే వదిలేశారని మండిపడ్డారు. తండాల్లో సిమెంటు రోడ్ల కోసం రూ.60 లక్షలు వచ్చిందని చెప్పి కంకరు, ఇసుక తోలి వదిలేస్తే ఏం ఉపయోగమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న సాక్షి విలేకరి ఫొటోలు తీస్తుండగా ఎమ్యెల్యే గమనించారు. విచక్షణ కోల్పోయారు. సాక్షి పేపరులో వార్త రాసి ఏం పీకుతారంటూ చిందులేశారు. అనంతరం దండువారిపల్లెకు రూ.1.23 కోట్లతో చేపట్టనున్న తారురోడ్డు పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడా ఎమ్మెల్యేకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఐదేళ్లుగా రోడ్డు వేయకుండా ఇప్పుడు వచ్చారా అంటూ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment