అరుదైన పక్షులకు విడిదిగా మారిన తెలంగాణ
గోదావరి, కృష్టా నది తీరాల్లో నీటి వసతి పెరగటంతో తరలి వస్తున్న విదేశీ విహంగాలు
కవ్వాల్, అమ్రాబాద్, ఏటూరు నాగారం సాంక్చ్యురీల్లో జీవ వైవిధ్యం
432 రకాల పక్షుల గుర్తింపు.. వాటిని చూసేందుకు అడవులకు క్యూ కడుతున్న పక్షి ప్రేమికులు
నేడు జాతీయ పక్షుల దినోత్సవం
సాక్షి ప్రతినిధి, వరంగల్/నెట్‌వర్క్: తెలంగాణలో నీటి గలగలతోపాటు అరుదైన పక్షుల కిలకిలలు కూడా పెరుగుతున్నాయి. రక్షిత అడువులు, నదుల తీరాలు అరుదైన పక్షి జాతులకు ఆవాసంగా మారాయి. గోదావరి, కృష్టా, పెన్‌గంగా తీరప్రాంతాల్లో విదేశీ వలస పక్షుల సందడి పెరిగింది. ఇప్పటివరకు 432 పైగా పక్షి జాతులను గుర్తించారు. రష్యా, మంగోలియా, ఆఫ్రికా, ఆ్రస్టేలియా, వియత్నాం తదితర సుదూర ప్రాంతాల నుంచి పక్షులు తెలంగాణకు వలస వస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని పక్షి జాతులపై ప్రత్యేక కథనం.
అరుదైన జాతులు
దేశంలో 566 అభయారణ్యాలు ఉంటే తెలంగాణలో 5,672 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 9 ఉన్నాయి. పాకాల, ఏటూరునాగారం, ప్రాణహిత, కవ్వాల్, శివ్వారం, మంజీరా, పోచారం, కిన్నెరసాని, అమ్రాబాద్ అభయారణ్యాలు జీవవైవిధ్యానికి ఆలవాలంగా మారాయి. ఫారెస్ట్ వాగ్‌టెయిల్, బ్లాక్ బజా, లగర్ ఫాల్కన్, డస్కీ ఈగల్ ఔల్, స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్, స్మాల్ ప్రాటిన్‌కోల్, రెడ్ క్రస్టెడ్ పోచార్డ్స్, కామన్ కింగ్‌ఫిషర్, బ్లాక్ షోల్డర్డ్ కైట్, లీసర్ ప్లాంబాకక్ ఉడ్‌పికర్, ఓరియంటల్ హనీ బజర్డ్, ఇండియన్ కార్మోరన్ట్, స్పాటెడ్ ఔల్ట్, కామన్ హూప్, బ్రౌన్‌వుడ్ శ్రైక్, ఆశిక్రౌన్డ్ స్పారో లార్క్, ఎల్లో ఫ్రూటెడ్ గ్రీన్ పిజియన్, కామన్ హాక్ కుకూ, శిక్‌రా, చాంగెబ్ల్ హాక్ ఈగల్, పైడ్ కింగ్‌ఫిషర్, వైట్ ఐ బజర్డ్, సినిరియస్ టిట్, వైట్ త్రోటెడ్ కింగ్‌ఫిషర్, అలెగ్జాండ్రిన్ ప్యారకిట్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్ హెడెడ్ హైబీస్, రివర్ టర్న్ తదితర జాతుల పక్షులు ఇక్కడ ఆవాసాలు ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు.
అమ్రాబాద్ రిజర్వ్‌లోనే 310 రకాల పక్షలు
ప్రపంచంలో మొత్తం 10,906 పక్షి జాతులను ఇప్పటివరకు గుర్తించారు. వాటిలో 1,353 పక్షి జాతులు భారత్‌లో నివసిస్తున్నాయని జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. మొత్తం పక్షి జాతుల్లో ఇది 12.4 శాతం. తెలంగాణలో గతంలో 380 రకాల పక్షలను గుర్తించినట్లు నివేదికలు ఉన్నాయి. తాజాగా మరికొన్ని కొత్త జాతులను గుర్తించటంతో వాటి సంఖ్య 432కు పెరిగింది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌నే ఇప్పటివరకు 310 పక్షి జాతులను గుర్తించారు. రెండేళ్లుగా నల్లమలలో ఫారెస్ట్ వాగ్‌టెయిల్, బ్లాక్ బజా, లగర్ ఫాల్కన్, డస్కీ ఈగల్ ఔల్, స్పాట్ బెల్లీడ్ ఈగల్ ఔల్ వంటి అరుదైన పక్షులు సందడి చేస్తున్నాయి.
తాడ్వాయి, ములుగు, వెంకటాపురం, గణపురం, రామప్ప, పాకాల, లక్నవరం ప్రాంతాల్లో అలెగ్జాండ్రిన్ ప్యారకిట్, ఓరియంటల్ డార్టర్, బ్లాక్ హెడెడ్ హైబీస్, రివర్ టర్క్ తదితర 122 రకాల పక్షులను గుర్తించినట్లు ఫారెస్టు కాలేజ్, రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో రిసెర్స్ స్కాలర్స్ సాహిత్ చెప్యాల, నిఖిల్ బుసాయి ‘సాక్షి’కి తెలిపారు. కవ్వాల్, శివ్వారం, మంజీరా, ప్రాణహిత అభయారణ్యాల్లో కూడా ఇవి కనిపించినట్లు చెప్పారు. అయితే ఇసుక తవ్వకాలు, సింగరేణి బొగ్గు కార్యకలాపాలు, కాలుష్యం వంటి చర్యలు పక్షుల మనుగుడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటపొలాల్లో వాడుతున్న క్రిమి సంహారకాలు పక్షులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
వలస పక్షులకు విడిదిగా నల్లమల
నల్లమల అటవీప్రాంతం అరుదైన వలస పక్షులకు విడిదిగా మారింది. అంతరించిపోతున్న పక్షులు సైతం ఇక్కడ కనిపించాయి. పక్షుల సంరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. – మదన్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, హైదరాబాద్.
పక్షులకు ఆలవాలం మన అడవులు
భూపాలపల్లి, ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో 122 రకాల పక్షులు కనిపించాయి. ఇందులో మూడు రకాల పక్షులపై పర్యావరణ మార్పుల ప్రభావం పడుతోంది. జీవవైవిధ్య పరిరక్షణపై ప్రభుత్వాలు ఇంకా శ్రద్ధ వహించాల్సి ఉంది. – సాహిత్ చెప్యాల, రిసెర్స్ స్కాలర్, ఎఫ్‌సీఆర్‌ఐ, ములుగు.
310 రకాల పక్షులను గుర్తించాం
నల్లమలలో ఇప్పటివరకు మొత్తం 310 రకాల పక్షులను గుర్తించాం. వీటిలో కొన్ని వలస పక్షులు, మరికొన్ని అత్యంత అరుదైన పక్షులు ఉన్నాయి. ఇక్కడ జీవవైవిద్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో క్రమంగా పక్షులు, వన్యప్రాణుల సంఖ్య పెరుగుతోంది. – రోహిత్ గోపిడి, ఐఎఫ్‌ఎస్ అధికారి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్ జిల్లా.
Comments
Please login to add a commentAdd a comment