సాక్షి, సిటీబ్యూరో: కంఠసర్పి(డిఫ్తీరియా) మళ్లీ కాటేస్తుంది. గత కొద్ది కాలంగా ఇది చాపకింది నీరులా విస్తరిస్తుంది. ఒక్క హైదరాబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డిఫ్తీరియా బాధితులు వస్తున్నారు. వైద్యులు వీరిని క్లీనికల్ డిఫ్తీరియాగా నమోదు చేసి చికిత్స చేస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో జూన్‌లో 64, జులైలో 110 డిఫ్తీరియా కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు తెలిసింది.
వారిలో ఇద్దరు కర్నూలుకు చెందిన వా రు కాగా, మరో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారే. వీరి వివరాలు బయటికి పొక్కకుండా అధికారులు గోప్యతను పాటిస్తుండటం విశేషం. గురువారం ఫీవర్ ఆస్పత్రిలో 14 మంది చికిత్స పొందుతుండగా, ఉస్మానియాలో మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. గొంతునొప్పితో బాధపడుతున్న ఈ బాధితులకు చికిత్స చేసేందుకు ఈఎన్‌టీ నిపుణుడు అందుబాటులో లేక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.