నిపా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్న గబ్బిలాలు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా కేరళను వణికిస్తున్న ప్రమాదకర నిపా వైరస్ హైదరాబాద్ వాసులకు సోకిందన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. అయితే నిపా వైరస్ గురించి ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని నగరంలోని ఫీవర్ ఆస్పత్రి సుపరింటెండ్ కె.శంకర్ చెప్పారు. నిన్న ఇద్దరు అనుమానితుల శాంపిల్స్ మాత్రమే పుణేకు పంపామన్నారు. కానీ ఆ ఇద్దరి బ్లడ్ శాంపుల్స్‌లో వైరస్ లేదని స్పష్టమైందని ఆయన వివరించారు. అయితే నిపా వైరస్ ప్రభావం ఉన్న కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించకపోవడమే మంచిదని తెలుగు ప్రజలను ఆయన హెచ్చరించారు. నిపా వైరస్ సోకినట్లుగా అనుమానం ఉన్నవారు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి టెస్టులు చేపించుకోవాలన్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు చెబుతోంది.
కాగా, నిపా లక్షణాలతో బాధప డుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి రక్తం, మూత్ర, లాలాజల నమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణ కోసం పుణేకు పంపిన విషయం తెలిసిందే. నగరంలోని ఓ ఐటీ కంపెనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(24) ఈ నెల 18న కేరళ వెళ్లి 21న తిరిగి వచ్చాడు. ఆ వెంటనే జ్వరం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుం డటంతో ఫీవర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే నిమ్స్‌లో మరో వ్యక్తి(31) ఎన్‌సెఫలైటిస్ (మెదడు సంబంధిత వ్యాధి) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కేరళలో ఇప్పటికే అధికారికంగా 12 మరణాలు సంభవించగా, పలు కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment