విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాస్ రావు
మంత్రి శంకర్... దాదాపు అన్ని పోలీసు విభాగాలకూ సుపరిచితమైన పేరు. 1979లో తన 20వ ఏట నుంచి దొంగతనాలు ప్రారంభించాడు. ఇప్పటి వరకు 250 నేరాలు చేసి 30 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతగాడిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. అయినప్పటికీ తన పంథా మార్చుకోని శంకర్... తన 58వ ఏట 31వ సారి సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కాడు. ఈసారి 11 నేరాల్లో నిందితుడిగా తేలాడు. 38 ఏళ్లపాటు సోలోగా చోరీలు చేసిన శంకర్... వయస్సు మీరడంతో తొలిసారిగా మరో ఇద్దరితో కలిసి ముఠా కట్టాడు. హైదరాబాద్, రాచకొండ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి శంకర్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో 250కి పైగా నేరాలు చేసి 30 సార్లు జైలుకు వెళ్ళి వచ్చిన మంత్రి శంకర్ మరోసారి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్, రాచకొండ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి శంకర్‌ను అరెస్టు చేశామని, అతడి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్‌తో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ మాట్లాడారు.
‘ముషీరాబాద్’లో నేర్చుకున్న ‘కళ’...
సికింద్రాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్ (58) అలియాస్ శివన్న బాల్యం మొత్తం అక్కడే గడిచింది. తన 20వ ఏట 1979లో తొలిసారిగా ఓ చోరీ చేశాడు. ఈ కేసులో ఆ ఏడాది డిసెంబర్ 12న అరెస్టు అయిన తర్వాత బెయిల్‌పై వచ్చి చోరీ సొత్తు ఖరీదు చేసే రిసీవర్‌గా మారాడు. ఈ నేరం కిందా పోలీసులకు చిక్కడంతో రిమాండ్ నిమిత్తం అప్పటి ముషీరాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్ళాడు. అక్కడే ఇతడికి నాటి ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధికి చెందిన దొంగలు నాగిరెడ్డి, బల్వీందర్ సింగ్, దీపక్ సక్సేన, నాగులుతో పరిచయమైంది. తాళం ఎలా పగులకొట్టాలో శంకర్‌కు నేర్పిన వీళ్ళు తొలిసారిగా జైలులోని వంటగది తాళం పగులకొట్టించారు. అక్కడే పదేపదే చోరీ చేయిస్తూ వంట సామాను బయటకు తెప్పించి వండుకుని తినేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే శంకర్ జైలు నుంచి బయటకు వచ్చేసరికి తాళాలు పగులకొట్టడంతో దిట్టగా మారిపోయాడు. చిలకలగూడతో పాటు రామాంతపూర్‌లోని నేతాజీనగర్‌ల్లోనే మకాంలు ఏర్పాటు చేసుకున్న ఇతగాడు ఒంటరిగా కేవలం తాళం వేసున్న ఇళ్ళను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయేవాడు.
టిప్‌టాప్‌గా తిరుగుతూ చోరీలు...
ఓ చిన్న రాడ్డు, నాలుగు స్క్రూడ్రైవర్లను తనతో ఉంచుకునే శంకర్ ఎలాంటి తాళాన్నైనా కేవలం మూడు సెకన్లలో పగులకొట్టడంతో దిట్ట. కొన్నేళ్ళ క్రితం వరకు ఇతగాడు టిప్‌టాప్‌గా తిరుగుతూ చోరీలు చేశాడు. ఖరీదైన వస్త్రాలు, బూట్లు, టై ధరించి కారులో తిరుగుతూ రెక్కీలు చేసేవాడు. తాళం వేసి ఉన్న ఇల్లు రోడ్డు మీదికి కనిపిస్తే చాలు కాస్త దూరంలో వాహనాన్ని ఆపి దర్జాగా వెళ్ళి ‘పని’ పూర్తి చేసుకుని వచ్చేవాడు. అలాకానప్పుడు మంత్రి శంకర్ చోరీ చేయడంలో పక్కా ‘క్రమశిక్షణ’తో వ్యవహరిస్తుంటాడు. ఓ గల్లీలో ఉన్న ఇంట్లో ఆవరణలోకి ప్రవేశించి తాళం వేసుందా? లేదా? అన్నది గమనిస్తాడు. తాళం వేసున్న ఇల్లు దొరికే వరకు పిట్ట గోడలు దూకుతూ పక్కనున్న ఇళ్ళల్లోకి వెళ్తూనే ఉంటాడు. ఇలా ఓ లైన్ పూర్తయిన తర్వాత మరో లైన్‌లోకి వెళ్ళి తన టార్గెట్ పూర్తయ్యే వరకు ‘కష్టపడతాడు’. సాధారణంగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్యే దొంగతనం పూర్తి చేసేస్తాడు. చోరీ చేసిన తర్వాత ఆ ఇంటి మిద్దె మీదే తెల్లవారే వరకు కూర్చుంటాడు. మార్నింగ్ వాకర్స్ హడావుడి మొదలైనప్పుడు వారితో కలిసిపోయి తప్పించుకుంటాడు.
తరచు మకాంలు మారుస్తూ...
మంత్రి శంకర్ ప్రధానంగా బోయిన్‌పల్లి, బేగంపేట, మారేడ్‌పల్లి, కార్ఖానా, ఉస్మానియా వర్శిటీ ఠాణాల పరిధిల్లోనే చోరీలు చేస్తుంటాడు. ఈ ప్రాంతాల్లో ప్రతి అంగుళం ఇతడికి తెలిసి ఉండటంతో వీటినే టార్గెట్‌గా చేసుకుంటాడు. 38 ఏళ్ళుగా చోరీలు చేస్తున్న ఇతగాడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు. 30 సార్లు అరెస్టు అయిన ఘరానా దొంగ కావడంతో పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాడు. వరుసగా మూడు రోజుల పాటు ఏ ఒక్క ప్రాంతంలోనూ ఉండకుండా మకాం మారుస్తూ ఉంటాడు. చోరీల ద్వారా వచ్చే సొమ్ముతో జల్సాలు చేసే ఇతగాడికి వ్యభిచారం ప్రధాన వీక్‌నెస్. వస్త్రాలు, బూట్లతో సహా ప్రతీదీ బ్రాండెడ్‌వే ఖరీదు చేసి వాడతాడు. జైల్లో లేని సమయంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా 3–4 చోరీలు చేస్తుంటాడు. దాదాపు 250 కేసుల్లో నిందితుడిగా ఉండి మోస్ట్ వాంటెడ్ కావడంతో పోలీసులు ఇతడిపై రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించారు. రెండోసారి ప్రయోగించిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో జైలు నుంచి బయటకు వచ్చాడు.
తొలిసారిగా ముఠా కట్టిన శంకర్...
దాదాపు 38 ఏళ్ళుగా ఒంటరిగా నేరాలు చేస్తున్న శంకర్ వయస్సు మీరడంతో తొలిసారిగా చోరీలు చేయడానికి ముఠా కట్టాడు. పాతబస్తీకి చెందిన ఒబేద్, జాఫర్‌ఖాన్‌లతో కలిసి రంగంలోకి దిగాడు. వీరే ఇతడికి ఆశ్రయం కూడా కల్పించారు. మూడు నెలల కాలంలో నగరంతో పాటు రాచకొండలోని మూడు ఠాణాల పరిధిల్లో పంజా విసిరాడు. ఐదు ఠాణాల పరిధిలో 11 చోరీలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్ ప్రసాద్‌వర్మ, జి.వెంకటరామిరెడ్డి, ఎన్.శ్రీశైలం, మహ్మద్ తాజుద్దీన్‌లతో కూడిన బృందం గాలించింది. సోమవారం పట్టుకుని 370 గ్రాముల బంగారం, రూ.3.2 లక్షల నగదు, వాహనం స్వాధీనం చేసుకుంది. నిందితుడిని సైదాబాద్ పోలీసులకు అప్పగించి పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరి అనుచరుల కోసం గాలిస్తోంది. చోరీ చేసిన సొత్తును ముత్తూట్ సహా కొన్ని సంస్థల్లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటాడు. ఇతడిపై ఇప్పటికే రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించడంతో మరోసారి ప్రయోగించే ఆస్కారం లేదని, ఈ నేపథ్యంలో కేసుల విచారణ త్వరగా పూర్తయి శిక్షలు పడేలా ప్రయత్నిస్తామని పోలీసు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment