ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో ఇద్దరు వ్యక్తులకు నిపా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు కొద్దిరోజుల క్రితం కేరళ వెళ్లి వచ్చారు. ఇరువురి బ్లడ్ శాంపిల్స్‌ను వ్యాధి నిర్ధారణ కోసం పుణెలో గల నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ)కు పంపారు.
ఈ మేరకు తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కే రమేష్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భయపడాల్సిన పనేంలేదని, బ్లడ్ శాంపిల్స్‌ను వ్యాధి నిర్ధారణ కోసం పంపినట్లు చెప్పారు. కేరళలో నిపా వైరస్‌కు చికిత్స అందిస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు.
అనుమానితుడు కేరళలో వెళ్లొచ్చిన ప్రాంతానికి, నిపా వైరస్ సోకిన ప్రాంతానికి వందల కిలోమీటర్ల కొద్దీ దూరం ఉందని చెప్పారు. కాబట్టి భయాందోళనలకు గురి కావాల్సిన పని లేదని, పాజిటివ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో స్పందించేందుకు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో సిబ్బంది భద్రత కోసం ప్రొటెక్టివ్ సూట్లను సైతం తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. చెట్ల నుంచి రాలి పడిన పండ్లను, కొరికిన గుర్తు ఉన్న పండ్లను తినొద్దని ప్రజలను కోరారు. గ్రామల్లో సైతం ప్రజలకు దీనిపై అవగాహన వచ్చేలా ఎన్‌జీవోలు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. కాగా, ఇప్పటివరకూ 12 మంది నిపా బారిన పడి మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment