శాంతా బయో కొత్త ప్లాంటులో ఉత్పత్తి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సనోఫీ పాశ్చర్‌లో భాగమైన శాంతా బయోటెక్నిక్స్ తాజాగా తమ కొత్త ప్లాంటులో టీకాల ఉత్పత్తి ప్రారంభించింది. తెలంగాణలోని ముప్పిరెడ్డిపల్లి దగ్గర ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో సుమారు 19,000 చ.మీ. విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటైంది. సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడితో ఇది ఏర్పాటైందని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో శాంతా బయో చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రారంభ దశలో పిల్లల్లో డిఫ్తీరియా మొదలైన వాటి నివారణకు ఉపయోగపడే శాన్-5 తదితర టీకాలు ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతం ఇందులో ఏటా పది మిలియన్ డోస్‌ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 30 మిలియన్ డోస్‌ల దాకా ఉండగలదని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో ఇప్పటికే ఒక ప్లాంటు ఉండగా, ముప్పిరెడ్డిపల్లిది రెండోదవుతుందన్నారు. మరోవైపు, ఇన్సులిన్ తయారీ ప్రాజెక్టు 2017 నాటికి సిద్ధం కాగలదని శాంతా బయోటెక్నిక్స్ ఈడీ మహేష్ భల్గాట్ వివరించారు. రూ. 450 కోట్లతో దీన్ని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఇదీ పూర్తయితే మొత్తం 1,000 మందికి ఉపాధి లభించగలదని చెప్పారు.