Shantha Biotechnics
-
యాదాద్రికి శాంతా బయోటెక్నిక్స్ రూ.1.08 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే అన్న ప్రసాదం కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ సీఈవో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి రూ.1.08 కోట్ల చెక్కును ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని బాలాల యంలో చెక్కు ఇచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని, భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. అనంతరం దాత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి శ్రీకృష్ణాలంకారంలో హంస వాహనంపై ఊరేగారు. -
శాంతా బయో కొత్త ప్లాంటులో ఉత్పత్తి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సనోఫీ పాశ్చర్‌లో భాగమైన శాంతా బయోటెక్నిక్స్ తాజాగా తమ కొత్త ప్లాంటులో టీకాల ఉత్పత్తి ప్రారంభించింది. తెలంగాణలోని ముప్పిరెడ్డిపల్లి దగ్గర ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో సుమారు 19,000 చ.మీ. విస్తీర్ణంలో ఈ ప్లాంటు ఏర్పాటైంది. సుమారు రూ. 250 కోట్ల పెట్టుబడితో ఇది ఏర్పాటైందని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో శాంతా బయో చైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రారంభ దశలో పిల్లల్లో డిఫ్తీరియా మొదలైన వాటి నివారణకు ఉపయోగపడే శాన్-5 తదితర టీకాలు ఈ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఇందులో ఏటా పది మిలియన్ డోస్‌ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 30 మిలియన్ డోస్‌ల దాకా ఉండగలదని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో ఇప్పటికే ఒక ప్లాంటు ఉండగా, ముప్పిరెడ్డిపల్లిది రెండోదవుతుందన్నారు. మరోవైపు, ఇన్సులిన్ తయారీ ప్రాజెక్టు 2017 నాటికి సిద్ధం కాగలదని శాంతా బయోటెక్నిక్స్ ఈడీ మహేష్ భల్గాట్ వివరించారు. రూ. 450 కోట్లతో దీన్ని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఇదీ పూర్తయితే మొత్తం 1,000 మందికి ఉపాధి లభించగలదని చెప్పారు. -
అయిదేళ్లలో రూ.500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న పిల్లల్లో డిఫ్తీరియా తదితర వ్యాధుల నివారణకు ఉపయోగపడే శాన్5 టీకాల విక్రయాల ద్వారా.. వచ్చే అయిదేళ్లలో దాదాపు రూ. 500 కోట్ల ఆదాయాన్ని శాంతా బయోటెక్నిక్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లకు ఏటా 200 మిలియన్ డోసుల మేర డిమాండ్ ఉంటోంది. శాన్5 పెంటావాలెంట్ వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యూహెచ్వో) ప్రీ-క్వాలిఫైడ్ గుర్తింపును పునరుద్ధరించడంతో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. ఈ గుర్తింపుతో మరోసారి ఐక్యరాజ్యసమితి పరిధిలోని యూనిసెఫ్ తదితర ఏజెన్సీలు, వివిధ దేశాలకు ఈ టీకాలను సరఫరా చేసేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా శాంతా బయో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేఐ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటనస్, హెపటైటిస్-బి మొదలైన వాటి అయిదు వ్యాధుల నివారణకు ఈ టీకాలు ఉపయోగపడతాయని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి శాన్5ని శాంతా బయో 2008లోనే ప్రవేశపెట్టింది. అయితే, 2010లో స్వల్ప సాంకేతిక సమస్యల కారణంగా ఈ 5-ఇన్-1 టీకా ప్రీ-క్వాలిఫైడ్ గుర్తింపు కోల్పోయిందని వరప్రసాద రెడ్డి తెలిపారు. దీని వల్ల సుమారు రూ. 1,500 కోట్ల విలువ చేసే ఆర్డర్లు కోల్పోయినట్లయిందన్నారు. అలాంటి కీలక తరుణంలో సనోఫీ సంస్థ శాంతా బయోకు గణనీయమైన తోడ్పాటు అందించిందని వరప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్నుంచి సనోఫీ దాదాపు రూ. 1,000 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసిందని, ప్రస్తుతం శాంతా బయోలో సనోఫీకి 98 శాతం మేర వాటాలు ఉన్నాయని ఆయన వివరించారు. దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి శాన్5కి మళ్లీ డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సాధించగలిగామని శాంతా బయో సీఈవో హరీశ్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ వ్యవధిలో నాణ్యతా ప్రమాణాల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకున్నామని, ఉద్యోగుల సంఖ్యను 550 నుంచి సుమారు 850కి పెంచుకున్నామని ఆయన తెలిపారు. -
శాంతా బయోలో రూ.755 కోట్ల ఎఫ్‌డీఐకి ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1,258 కోట్ల విలువ చేసే 13 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతి పాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ. 6,266 కోట్ల మేర విదేశీ ఈక్విటీ పరిమితిని పెంచుకోవాలనే యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించింది. సెప్టెంబర్ 19న జరిగిన సమావేశంలో ఎఫ్ఐపీబీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఎఫ్ఐపీబీ 8 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయం వాయిదా వేయగా, రెండింటిని తోసిపుచ్చింది. తాజాగా ఆమోదం పొందిన వాటిల్లో శాంతా బయోటెక్నిక్స్(రూ. 755 కోట్లు) కూడా ఉంది. ఎన్నారైలు, ఇతరుల దగ్గరున్న షేర్లను కొనుగోలు చేసేందుకు, కొత్తగా మరింత ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చుకునేందుకు అనుమతి లభించింది. ఇక క్లియరెన్స్ లభించిన మిగతా ప్రతిపాదనల్లో ఈక్విటాస్ హోల్డింగ్స్(రూ. 222.8 కోట్లు), స్టోర్క్ టైటానియం (రూ. 156 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. 2013-14 ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4% పెరిగి 8.46 బిలియన్ డాలర్లకు చేరాయి.