శాంతా బయోలో రూ.755 కోట్ల ఎఫ్‌డీఐకి ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ. 1,258 కోట్ల విలువ చేసే 13 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతి పాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ. 6,266 కోట్ల మేర విదేశీ ఈక్విటీ పరిమితిని పెంచుకోవాలనే యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించింది. సెప్టెంబర్ 19న జరిగిన సమావేశంలో ఎఫ్‌ఐపీబీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఎఫ్‌ఐపీబీ 8 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలపై నిర్ణయం వాయిదా వేయగా, రెండింటిని తోసిపుచ్చింది.
తాజాగా ఆమోదం పొందిన వాటిల్లో శాంతా బయోటెక్నిక్స్(రూ. 755 కోట్లు) కూడా ఉంది. ఎన్నారైలు, ఇతరుల దగ్గరున్న షేర్లను కొనుగోలు చేసేందుకు, కొత్తగా మరింత ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చుకునేందుకు అనుమతి లభించింది. ఇక క్లియరెన్స్ లభించిన మిగతా ప్రతిపాదనల్లో ఈక్విటాస్ హోల్డింగ్స్(రూ. 222.8 కోట్లు), స్టోర్క్ టైటానియం (రూ. 156 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. 2013-14 ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్యలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4% పెరిగి 8.46 బిలియన్ డాలర్లకు చేరాయి.