హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న పిల్లల్లో డిఫ్తీరియా తదితర వ్యాధుల నివారణకు ఉపయోగపడే శాన్5 టీకాల విక్రయాల ద్వారా.. వచ్చే అయిదేళ్లలో దాదాపు రూ. 500 కోట్ల ఆదాయాన్ని శాంతా బయోటెక్నిక్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లకు ఏటా 200 మిలియన్ డోసుల మేర డిమాండ్ ఉంటోంది. శాన్5 పెంటావాలెంట్ వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యూహెచ్‌వో) ప్రీ-క్వాలిఫైడ్ గుర్తింపును పునరుద్ధరించడంతో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. ఈ గుర్తింపుతో మరోసారి ఐక్యరాజ్యసమితి పరిధిలోని యూనిసెఫ్ తదితర ఏజెన్సీలు, వివిధ దేశాలకు ఈ టీకాలను సరఫరా చేసేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా శాంతా బయో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేఐ వరప్రసాద్ రెడ్డి తెలిపారు.
డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటనస్, హెపటైటిస్-బి మొదలైన వాటి అయిదు వ్యాధుల నివారణకు ఈ టీకాలు ఉపయోగపడతాయని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి శాన్5ని శాంతా బయో 2008లోనే ప్రవేశపెట్టింది. అయితే, 2010లో స్వల్ప సాంకేతిక సమస్యల కారణంగా ఈ 5-ఇన్-1 టీకా ప్రీ-క్వాలిఫైడ్ గుర్తింపు కోల్పోయిందని వరప్రసాద రెడ్డి తెలిపారు. దీని వల్ల సుమారు రూ. 1,500 కోట్ల విలువ చేసే ఆర్డర్లు కోల్పోయినట్లయిందన్నారు. అలాంటి కీలక తరుణంలో సనోఫీ సంస్థ శాంతా బయోకు గణనీయమైన తోడ్పాటు అందించిందని వరప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
అప్పట్నుంచి సనోఫీ దాదాపు రూ. 1,000 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసిందని, ప్రస్తుతం శాంతా బయోలో సనోఫీకి 98 శాతం మేర వాటాలు ఉన్నాయని ఆయన వివరించారు. దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి శాన్5కి మళ్లీ డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సాధించగలిగామని శాంతా బయో సీఈవో హరీశ్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ వ్యవధిలో నాణ్యతా ప్రమాణాల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకున్నామని, ఉద్యోగుల సంఖ్యను 550 నుంచి సుమారు 850కి పెంచుకున్నామని ఆయన తెలిపారు.
అయిదేళ్లలో రూ.500 కోట్లు
Published Tue, May 6 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement
Advertisement