
ప్రపంచ మానవాళి పట్ల మీ సంఘీభావానికి కృతజ్ఞతలు. వనరులు, బలాలు ప్రోది చేసుకుని పరస్పర సహకారంతో జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తేనే కోవిడ్ 19 మహమ్మారి నుంచి బయటపడొచ్చు
న్యూయార్క్: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసి, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచ మానవాళి పట్ల మీ సంఘీభావానికి కృతజ్ఞతలు. వనరులు, బలాలు ప్రోది చేసుకుని పరస్పర సహకారంతో జాతి శ్రేయస్సు కోసం పనిచేస్తేనే కోవిడ్ 19 మహమ్మారి నుంచి బయటపడొచ్చు’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు.
ప్రపంచ శాంతి కోసం భారత్ పనిచేస్తోందని తెలిపారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో 150 దేశాలకు భారత్ అవసరమైన మందులు సరఫరా చేసిందని తెలిపారు. భారత్‌లో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ జరుతున్నాయని తెలిపారు. దాంతోపాటు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాని నిల్వకు సంబంధించి ఇతర దేశాలకు సాయం చేస్తామని చెప్పారు. అదే సమయంలో కరోనా విషయంలో ఐక్యరాజ్యసమితి చేయగలిగినంత చేస్తోందా? అని ప్రశ్నించారు. 9 నెలలుగా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి ఉమ్మడి కార్యచరణ, ప్రభావవంతమైన ప్రతిస్పందన ఎక్కడ? అని ప్రశ్నించారు.
(చదవండి: నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?)