మంకీపాక్స్‌పై WHO హెచ్చరికలు.. అప్రమత్తమైన కేంద్రం | Mishra Principal Secretary to Prime Minister chaired a high level meeting on monkeypox | Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌పై WHO హెచ్చరికలు.. అప్రమత్తమైన కేంద్రం

Published Sun, Aug 18 2024 9:06 PM | Last Updated on Sun, Aug 18 2024 9:33 PM

Mishra Principal Secretary to Prime Minister chaired a high level meeting on monkeypox

కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవర పెడుతున్న మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మంకీ పాక్స్‌ ఆఫ్రికా నుంచి పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చేరడంతో  మోదీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్ట్‌18) మంకీ పాక్స్‌పై ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పీకే మిశ్రా జారీ చేశారు. మంకీ పాక్స్‌ను ఎదుర్కొనే అంశంతో పాటు ముందుగానే రాష్ట్రాల్లో టెస్టింగ్‌ ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు.

మంకీపాక్స్‌ సోకిన రోగుల సంఖ్య
ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్‌ సోకిన రోగుల సంఖ్య 18,737కి చేరింది. ఈ ఒక్క వారంలోనే 1200 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లాడ్‌-1తో పాటు అన్నీ రకాల వైరస్‌లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 545 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 97 శాతం కేసులు, మరణాల కేసులో కాంగోలో నమోదవుతుండగా..ఈ ఒక్క వారంలో 202 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్‌ కేసుల్ని గుర్తించగా..మరణాల రేటు 8.2శాతంగా ఉంది. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39కేసులు నిర్ధారణయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్థాన్‌లలో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి.

డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర స్థితి
మంకీపాక్స్‌ విజృంభణ వేళ డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే అంతర్జాతీయంగా ఆందోళనలతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తొలిదశలో ఆ కమిటీ సిఫార్స్‌లను ప్రచురిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఎన్‌జీవోలతో కలిసి టీకా ఉత్పత్తులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు దక్షిణాఫ్రికాలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్‌మెంట్‌ దేశాల ప్రతినిధులు ఖండంలో కోరలు చాస్తున్న ఎంపాక్స్‌పై చర్చించారు. డబ్ల్యూహెచ్‌ఓతో పాటు పలు దేశాలు వ్యాధి నియంత్రణా సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములు, మంకీపాక్స్‌ నివారణకు కృషి చేయాలని అభ్యర్ధించారు. ప్రభావ దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement