ఢిల్లీ : కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ). ఈ తరుణంలో ఎంపాక్స్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం.
భారత్‌లో ఇప్పటి వరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. అయితే ఆగస్ట్ 16న యూఏఈ నుంచి దేశానికి వచ్చిన ముగ్గురు రోగుల్ని పాకిస్థాన్ గుర్తించింది. అంతకుముందు, స్వీడన్, ఆఫ్రికా వెలుపల మొదటి పాక్స్ కేసును నిర్ధారించాయి.
డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎంపాక్స్ ప్రమాదకరంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment