helth department
-
అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయండి.. మంకీపాక్స్‌పై కేంద్రం ఆదేశాలు
ఢిల్లీ : కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ). ఈ తరుణంలో ఎంపాక్స్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం. భారత్‌లో ఇప్పటి వరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. అయితే ఆగస్ట్ 16న యూఏఈ నుంచి దేశానికి వచ్చిన ముగ్గురు రోగుల్ని పాకిస్థాన్ గుర్తించింది. అంతకుముందు, స్వీడన్, ఆఫ్రికా వెలుపల మొదటి పాక్స్ కేసును నిర్ధారించాయి. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎంపాక్స్ ప్రమాదకరంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
చలికాలంలో సీఓపీడీని అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది
గుంటూరు మెడికల్: మోహన్ ప్రతిరోజూ సిగిరెట్లు కాలుస్తాడు. మూడు నెలలుగా దగ్గు వస్తున్నా పట్టించుకోకుండా వదిలివేశాడు. స్మోకింగ్ మానేయాలని వైద్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. చలికాలం ప్రారంభం కావడంతో ఇటీవల ఓ రాత్రివేళలో శ్వాసతీసుకోవటం ఇబ్బందిగా ఉండి నిద్రకూడ పట్టకపోవటంతో అర్థరాత్రి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు శ్వాసకోస నాళాలకు సోకే సీఓపీడీ వ్యాధి సోకినట్లు చెప్పి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఎందరో ఈ వ్యాధి సోకినా తెలియక ప్రాణాపాయ స్థితివరకు ఇళ్ల వద్ద ఉంటూ చివరి సమయంలో పరుగులు తీస్తున్నారు. 2019లో 3.23 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా సీఓపీడీతో మృతిచెందారు. మనదేశంలో ప్రతిఏడాది 2,300 మంది చనిపోతున్నారు. సీఓపీడీ అంటే... క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్( సీఓపీడీ). ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి ఇది. వ్యాధి సోకినవారికి గాలి గొట్టాలు ఇన్ఫెక్షన్కు గురై కొన్ని సార్లు మూసుకుపోయి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఆయాసం, దగ్గు, కళ్లెపడటం, ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, గుండెదడ, కాళ్లు వాయటం, పిల్లికూతలు, బరువు తగ్గటం, కొద్దిగా జలుబు చేయగానే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎక్సరే, స్పైరో మెట్రో లేదా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది... ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ వస్తుంది. పొగతాగేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగకపోయినా పొగతాగేవారి పక్కన ఉండి పొగ పీల్చటం వల్ల కూడా వ్యాధి వస్తుంది. గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, కట్టెల పొయ్యి, పిడకల పొయ్యి వినియోగించేవారికి, బొగ్గు గనుల్లో, సిమెంట్ ఫ్యాక్టరీల్లో, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారికి, ధుమ్ము, ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో, పరిశ్రమల్లో పనిచేసేవారికి వ్యాధి సోకుతుంది. ఉబ్బసం( ఆస్తమా), అలర్జీ ఉన్నవారు జబ్బు నయం అయ్యేందుకు వైద్యం చేయించుకోకపోతే సీఓపీడీ రావచ్చు. జిల్లాలో వ్యాధి బాధితులు... జిల్లాలో 50 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) ఉన్నారు. ప్రతిరోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఇరువురు లేదా, ముగ్గురు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల హాస్పటల్లో ప్రతిరోజూ పది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. -
పశ్చిమగోదావరి: మళ్లీ వింత వ్యాధి కలకలం..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో మళ్లీ వింత వ్యాధి కలకలం రేపింది. అంతుచిక్కని వ్యాధి కొవ్వలి గ్రామానికీ విస్తరించింది. దీంతో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే కోఠారు అబ్బయ్యచౌదరి గ్రామంలో మంగళవారం పర్యటించారు. ప్రజలెవరూ భయాందోళన చెందనవసరం లేదన్నారు. కాగా, జిల్లాలో అంతు చిక్కని వింత వ్యాధి పట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని రోజులుగా కొమరవోలు, పూళ్లలో విస్తరించిన అంతుచిక్కని వ్యాధిపై అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో వ్యాధి ప్రభావం పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. చదవండి: నేనే శివుడిని.. నాకు ఏ టెస్టు వద్దు: పద్మజ వింత వ్యాధికి గురై డిశార్జ్ అయిన రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సదుపాయం, వారు తీసుకుంటున్న ఆహార పానీయాలపై కూడా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంటింటికి సర్వే కొనసాగుతుంది. ప్రజలు ఎవరు ఎక్కడా కూడా భయపడాల్సిన పరిస్థితి లేదని ఎక్కడైనా వింత వ్యాధి లక్షణాలు ఉంటే వారికి పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. చదవండి: ఉద్యోగాల పేరిట మోసం -
వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు వేతనం
సాక్షి, హైదరాబాద్: విపత్కర సమయంలో చెమటోడ్చి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలోని రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తి వేతనం/గౌరవవేతనంలో 10 శాతం ప్రోత్సాహకం ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వీరితో పాటు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, రెగ్యులర్ పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజి బోర్డులోని రెగ్యులర్, ఔట్సోర్సింగ్ వాటర్ సప్లై లైన్మన్లు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ.7,500, జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.5,000, రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్లకు రూ.5,000 చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మార్చి నెలలో విధులు నిర్వహించిన సిబ్బందికి మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని, వివిధ కారణాల వల్ల ఆయా శాఖల్లో సస్పెండ్ అయిన ఉద్యోగులు, అధికారిక, అనధికారిక సెలవుల్లో ఉన్న వారికి ఈ ప్రోత్సాహకాలు వర్తించబోవని స్పష్టం చేశారు. వేతనాల్లో కోత ‘కట్’: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, హెచ్ఎండబ్ల్యూఎస్ ఉద్యోగులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీల పారిశుద్ధ్య సిబ్బందికి మార్చి నెల వేతనంలో 10 శాతం వాయిదా వేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గతంలో విడుదల చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
కరోనాపై ఆందోళన వద్దు..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్‌ను పరీక్షించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి ఏపీకి వచ్చిన 675 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు. 428 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు.ఆసుపత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారన్నారు. (కరోనా ఎఫెక్ట్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ) 52 మందికి నెగిటివ్.. 61 మంది శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా 52 మందికి నెగిటివ్ అని తేలిందని.. 8 మంది శాంపిల్స్ సంబంధించిన రిపోర్టులు రావాల్సిఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో 8,691 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని.. వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం,గన్నవరం, క్రిష్ణపట్నం ఓడరేవుల్లో ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవని తెలిపారు. (కరోనా పరీక్ష చేయించుకుని రండి..) కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు వ్యాధి లక్షణాలు ఉన్నా.. లేకపోయినా ఇళ్లలోనే ఉండాలని..బయటకు వెళ్లకూడదని సూచించారు. కుటుంబసభ్యులు, ఇతరలతో కలవకూడదని తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌ను ధరించి 108 వాహనంలోనే సమీప ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని జవహర్‌రెడ్డి సూచించారు. అన్ని జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాం.పూర్తి స్థాయిలో మాస్క్‌లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని కోరారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని తెలిపారు (కోడిని తింటే ‘కోవిడ్’ రాదు..) -
చిరుద్యోగులపై చిన్నచూపు!
నిజామాబాద్‌అర్బన్: వైద్యారోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో అన్ని విధులు నిర్వహించే రెండో ఏఎన్ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా క్రమబద్ధీకరణకు నోచుకోక, సకాలంలో వేతనాలు అందక అష్ట కష్టాలు పడుతున్నారు. గ్రామాల్లో అన్ని వైద్య సేవలు అందించే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పాలకులు, ఉన్నతాధికారులు చిన్న చూపు చూస్తున్నారు. పైగా కాంట్రాక్ట్ విధానంలో కొనసాగిన వీరు.. అధికారుల తప్పిదం వల్ల ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారిపోయారు.! దీంతో తాము రెగ్యులర్ అయ్యే అవకాశం కోల్పోతామని రెండో ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్ట్ నుంచి ఔట్‌సోర్సింగ్‌కు..! ఉమ్మడి జిల్లాలో 17 క్లస్టర్ల పరిధిలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 377 ఉప కేంద్రాలు కొనసాగుతున్నాయి. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు, పీహెచ్‌సీలకు ఇద్దరు, ఉప కేంద్రానికి ఒక్కరు చొప్పున 376 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. 2001 నుంచి 2007 వరకు ఇంటర్వ్యూలు, రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీరంతా ఎంపికయ్యారు. వీరిలో కొంత మందిని యూరోపియన్ స్కీం కింద, మరికొంత మందిని జాతీయ గ్రామీణ ఆరోగ్య ఆరోగ్య పథకం (ఎన్ఆర్హెచ్ఎం) కింద, మరి కొందరిని ఆర్సీహెచ్–2 స్కీం కింద నియమితులయ్యారు. 2007 తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరి కొందరిని ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఐదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిన వారిని రెగ్యులర్ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ లెక్కన జిల్లాలో 186 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రెగ్యూలర్ అయ్యే అవకాశముంది. అయితే, ఉన్నతాధికారులు తరచూ నిబంధనలు మారుస్తుండడంతో ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్ట్ విధానంలో పని చేసే వారు సంవత్సరానికి ఒకసారి బాండ్ పేపర్ ద్వారా కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేసుకోవాల్సి. అయితే, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ఔట్సోర్సింగ్ కింద పరిగణిస్తూ అధికారులు గతంలో బాండ్ రాయించుకున్నారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల ప్రస్తుతం వారు ఆందోళనకు గురవుతున్నారు. చాలీచాలని వేతనాలు.. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారి స్థాయిలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రతి పీహెచ్సీ, సబ్ సెంటర్లలో రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు సమానంగా గ్రామాలను కేటాయించారు. రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు టార్గెట్‌ను నిర్ణయించారు. బాధ్యతలు సమానంగా అప్పగించారు. అయితే, వేతనంలో మాత్రం భారీ తేడా ఉంది. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు మూడు, నాలుగు నెలలకు ఒకసారి వతనాలు చెల్లిస్తున్నారు. సకాలంలో డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఏఎన్ఎంలకు పీఎఫ్ పేరిట రూ.2 వేల కోత విధిస్తున్నా, ఇంత వరకు వారికి పీఎఫ్ నెంబర్ ఇవ్వలేదు. వ్యాక్సిన్ డ్యూటీకి సంబంధించి డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ఖర్చును సైతం ఏఎన్ఎంలే భరిస్తున్నారు. మార్పులో భాగంగా ప్రతి కాంట్రాక్ట్ ఏఎన్ఎంకు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీని కోసం వారు సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. డిమాండ్లు ఇవే.. రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం కాంట్రాక్టు విధానంలో ఏఎన్ఎంలను ఎంపిక చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం రూ.32 వేలతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వ్యాక్సిన్ అలవెన్సు రూ.500, యూనిఫాం అలవెన్సు రూ.1500, ఎఫ్‌టీఏ రూ.550 ఇవ్వడంతో పాటు 35 క్యాజువల్ లీవ్స్, 180 రోజులు వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరుతున్నారు. నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దుతో పాటు ఇతర డిమాండ్లు సర్కారు ముందు ఉంచుతున్నారు. ఏడాదైనా వెలువడని లేని ఫలితాలు.. గత ఎడాది టిఎస్పిఎస్సి ద్వార ఏఎన్ఎంలకు సంబందించి రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్ విభాగంలో పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ జరిగింది. గతేడాది మే నెలలో పరీక్ష నిర్వహించగా, ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదు. కొన్ని రోజుల క్రితం ఏఎన్ఎంల నుంచి సర్వీస్ వివరాలను సేకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎంలకు సర్వీస్ మార్కులు కలిపి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎంత మంది ఉద్యోగం పొందుతారో తెలిసి పోతుంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. రెగ్యులర్ చేయండి.. రెగ్యులర్ ఏఎన్ఎంలతో పాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి. సంవత్సరాల తరబడి పని చేస్తున్నా మాకు ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇకనైన మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మా సమస్యలను పరిష్కరించాలి. – పద్మ, కాంట్రాక్ట్ ఏఎన్ఎం పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం.. వైద్యారోగ్యశాఖలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు రెండో ఏఎన్ఎంలు. 15 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదు. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించడంలో ఏఎన్ఎంల పాత్ర ఎంతో ముఖ్యం. రెండో ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం. – నటరాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు -
విస్తరిస్తున్న కుష్ఠు
పాల్వంచరూరల్: జిల్లాలో కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి తీవ్రత తగ్గేందుకు సకాలంలో చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిర్మూలన చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా జనవరి 30 నుంచి ఈనెల 13 వరకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన కల్పిస్తూ జాగృతం చేస్తున్నారు. ఏజెన్సీ, పారిశ్రామిక ప్రాంతమైన జిల్లాలోని 23 మండలాల పరిధిలో గత మూడేళ్ల గణాంకాల ఆధారంగా 177 మంది వ్యాధి గ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంతో అశించిన స్థాయిలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ, కుష్ఠువ్యాధి నిర్మూలన శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 78 కేసులను గుర్తించారు. గత ఏడాది 62 కేసులు ఉండగా.. 2016 నుంచి 2019 వరకు ప్రస్తుత కేసులు కలుపుకుని 177కు చేరింది. వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, తెలిసినా బయటకు చెపితే సామాజికంగా దూరం అవుతామనే భయంతో కొందరు నివారణ చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని భావించిన ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు ఆశా వర్కర్ల సహాయంతో ఇంటింటి సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వేలో 9,83,179 మందిని పరీక్షించారు. ఇందులో అనుమానాస్పదంగా 1923 మందిని గుర్తించారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించగా 78 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వ్యాధి లక్షణాలు... కుష్ఠు వ్యాధి ముఖ్యంగా నరాలకు, చర్మానికి సోకుతుంది. వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. వయసు, లింగ బేధం లేకుండా ఎవరికైనా సోకవచ్చు. వంశపారంపర్యంగా ఈ వ్యాధి సంక్రమించదు. కుష్ఠు మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువగా లేదా రాగి రంగు కలిగి ఉంటాయి. మచ్చలపై స్పర్శ, నొప్పి ఉండదు. శరీరంలో ఏ భాగంలోనైనా సోకవచ్చు. వ్యాధి ప్రారంభ దశలో గుర్తించి ఎంబీపీ చికిత్స చేయించుకుంటే అంగవైకల్యానికి దారితీయదు. కుష్ఠు వ్యాధి నివారణ, చికిత్స కోసం జిల్లాలోని అన్ని అరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఎలా సంక్రమిస్తుంది... కుష్ఠు వ్యాధి ప్రధానంగా మైకో బ్యాక్టీరియా లెప్రె వలన సంక్రమిస్తుంది. వ్యాధి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు, సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ వ్యాధిపై అవగాహన లేనివారు సరైన సమయంలో వైద్య చికిత్సలు చేయించుకోకపోవడంతో ఇది తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘స్పర్శ’ పేరుతో అవగాహన స్పర్శ అనే కార్యక్రమం ద్వారా వైద్య, అరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 30 వేల కరపత్రాలు, 100 సెల్ఫ్ కిట్లు పంపిణీ చేశాం. వ్యాధి నిర్మూలనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ సుక్రుత, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ లెప్రసీ అండ్ ఎయిడ్స్ -
‘కల్తీ’గాళ్లు
కల్తీ వ్యాపారాలకు కామారెడ్డి జిల్లా అడ్డాగా మారింది.. కొందరి అక్రమ సంపాదన యావ సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది!. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం మానేసిన ఫలితంగా కల్తీ మాఫియా జూలు విదుల్చుతోంది. కల్తీ కారణంగా ఆహార పదార్థాలన్నీ విషతుల్యంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువులు సహజత్వాన్ని కోల్పోయి ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల యవ్వారం తాజాగా మరోమారు జిల్లాలో వెలుగు చూసింది. బాన్సువాడలో నకిలీ నెయ్యి తయారు చేసి, విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. కామారెడ్డి క్రైం: సరిగ్గా ఏడాది క్రితం.. వంటనూనె కొనేందుకు ఓ దినసరి కూలీ జిల్లా కేంద్రం లోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లి, వంటనూనె కావాలని అడిగితే సదరు వ్యాపారి కల్తీ నూనె అంటగట్టాడు. దాంతో వంట చేసుకుని భోజనం చేసిన ఆ కుటుంబం మొత్తం వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయింది. కల్తీ నూనె వ్యవ హారం బయటకు రావడంతో అధికారులు అప్ప ట్లో హడావుడి చేశారు. కల్తీ వంటనూనె విక్రయిం చిన దుకాణంతో పాటు మరికొన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి, చేతులు దులుపుకున్నారు. అన్నీ తెలిసినా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తేగానీ కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం అప్పట్లో దాడులు నిర్వహించి తామేదో మొత్తం కల్తీలను అరికట్టినట్లు ఫోజులిచ్చేసింది. ఇక ఆ వ్యవహారాన్ని అక్కడితో ముగించేసింది. అయితే, వాస్తవాల్లోకి వెళితే మార్కెట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తినే తిండి, వస్తువులన్నీ కల్తీమయం గా మారాయి. కల్తీ ఆహార పదార్థాలు, వస్తువుల వినియోగంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపం లా మారుతున్నాయి. పాలు, నూనె, నెయ్యి, పప్పు దినుసులు, పండ్లు ఇతర నిత్యావసరాలన్నీ కల్తీ అవుతున్నాయి. నియంత్రించే వారు లేకపోవడంతో కల్తీగాళ్ల వ్యాపారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడం మానేశారనే ఫిర్యా దులున్నాయి. తాజాగా బాన్సువాడలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. విషతుల్యంగా నిత్యావసరాలు.. బాన్సువాడ పట్టణంలో వెలుగుచూసిన నకిలీ నెయ్యి తరహాలోనే జిల్లా కేంద్రంలోనూ కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నట్లుగా సమాచారం. కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ఓ కిరాణ దుకాణం, గంజ్ ప్రాంతంలోని పలు కిరాణ దుకాణాల నుంచి నిత్యం పెద్ద మొత్తంలో వనస్ప తి (డాల్డా) ప్యాకెట్లు వెళ్తుంటాయి. వాటిని నకిలీ నెయ్యి తయారీకే ఉపయోగిస్తారనే విషయం బహిరంగ రహస్యం. జిల్లా కేంద్రంలో గల్లీ గల్లీలోనూ పాల విక్రయ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో పాలు చిక్కగా, ఆకర్షణీయంగా ఉండేందుకు పలు రకాల రసాయనాలు, పౌడర్లు కలుపుతున్నారనే ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నా యి. కారంపొడి, పసుసులను కల్తీ చేయడానికి తక్కువ ధరలో వచ్చే పిండి పదార్థాలు, రంగు కోసం పౌడర్లు, చెక్క పొడి వాడుతున్నారు. కంది పప్పులో సోయా పప్పు, మిరియాలలో బొప్పా యి విత్తులు కలిపేస్తారు. ఇక, కామారెడ్డి కల్తీ నూనెల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ 3–4 వంట నూనెల తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి ఐదారు జిల్లాలకు వివిధ రకాల కంపెనీల పేర్లతో మంచి నూనె ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయి. నాసిరకం నూనె పదార్థాలను కలుపుతూ అనుమానం రాకుండా ఉండేందుకు రసాయనాల ను వినియోగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇవే కాకుండా కిరాణ దుకాణాల్లో చిన్న పిల్లలు కొనుక్కునే తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు కామారెడ్డిలో రెండు,మూడు చోట్ల ఉన్నాయి. వా టిపై అధికారుల కనీస పర్యవేక్షణ లేదు. అపరిశుభ్ర వాతావరణంలో తినుబండరాలు తయారు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మామూళ్ల మత్తులో అధికారులు! కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి లాంటి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారాలు సాగుతుంటాయి. ప్రతి రోజు రూ.కోట్లల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రధాన పట్టణాల్లో, ముఖ్యంగా కామారెడ్డిలో జీరో దందా ఎక్కువగా నడుస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే నకిలీ వ్యాపారాలు నడుస్తున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు మిగతా సమయాల్లో నకిలీ ఆహార పదార్థాలు, వస్తువులపై కనీస పర్యవేక్షణ చేపట్టడం లేదు. మాముళ్లే అందుకు కారణమనేది బహిరంగ సత్యం. ఈ వ్యవహారంపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి నాగరాజు వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. అన్నింటా కల్తీయే..! జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీ వ్యాపారాలు జోరుగా నడుస్తున్నాయి. తాగే పాలను, తినే తిండిని సైతం వదలడం లేదు. ఉప్పులు, పప్పులు, పసుపు, కారంపొడి, చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, టీపొడి, నూనెలు.. ఇలా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. గతంలో వంటకు ఉపయోగించే ఆహార పదార్థాలకు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న ఆహార పదార్థాలకు వ్యత్యాసం ఎంతగానో ఉంది. ఎంత ప్రయత్నించినా వంటలు రుచిగా కావడం లేదు అని మాత్రమే వినియోగదారులు ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఆహార పదార్థాల్లో కల్తీలేనని గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. రుచి మాట పక్కన పెడితే విలువైన ఆరోగ్యానికి హాని జరుగుతుందనేది వాస్తవం. ధనార్జనే లక్ష్యంగా నడుస్తున్న నకిలీ వ్యాపారాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. -
సమస్యలు పరిష్కరించాలి
ఆర్మూర్ : ఏళ్ల తరబడి శ్రమ దోపిడీకి గురవుతున్న వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన పెన్‌డౌన్, టౌల్ డౌన్ నిరసన కార్యక్రమం బుధవారం కొనసాగింది. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ఆస్పత్రి ప్రాంగణం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించడంతో పాటు అక్కడే వంటావార్పు, భోజనాల కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేయాలని, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లను సాధించుకొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాకు రెగ్యులర్ ఉద్యోగులు సంఘీబావం తెలిపారు. -
కొనసాగిన వైద్య సిబ్బంది నిరసన
జనగామ అర్బన్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు జిల్లాలోని వైద్య సిబ్బంది చేస్తున్న పెన్‌డౌన్, టూల్ డౌన్ కార్యక్రమం బుధవారం రెండో రోజు కొనసాగింది. ఈమేరకు ఏరియా ఆస్పత్రి, చంపక్ హిల్స్‌లోని ఎంసీహెచ్‌ల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజులపాటు ప్రసూతి సెలవులు ఇచ్చి వేతనం చెల్లించాలని కోరారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పించి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. అలాగే, ఎస్టీఓ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మయ్య, కార్యదర్శి కె.రాజేష్, సిబ్బంది సంతప్, సహదేవ్, శ్రీరాములు, మధుకర్, రంజిత్, శశిధర్, అభిలాష్, చంద్రారెడ్డి, శ్రీధర్, రమేష్, రమ్య, ఉమాదేవి, శోభ, నాగమణి, వెంకమ్మ, సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
డెంగీ జ్వరాలు.. 20వేల మందికి నోటీసులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో డెంగీ వ్యాప్తికి కారకులైన 20 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంగళవారం నోటీసులు జారీచేసింది. దుకాణాలు, ఇళ్లు, ఇంటి ఖాళీ స్థలాల్లో మురుగునీటి గుంతలతో పారిశుద్ద్యాన్ని భంగపరిచేలా వ్యవహరిస్తున్న 20 వేల మందికి ఈ నోటీసులు అందాయి. గత రెండు నెలల కాలంలో డెంగీ జ్వరాల బారిన పడి వందల సంఖ్యలో మృత్యువాత పడగా, పదివేల మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ దోమలతో నిండి ఉన్న 20 వేల మురుగు నీటి గుంతలను గుర్తించిన ప్రభుత్వం.. 48 గంటల్లోగా వాటిని తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష తప్పదని సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించింది. -
నగరంలో మళ్లీ పోలియో కలకలం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ పోలియో (టైప్–2) వైరస్ కలకలం సృష్టిస్తోంది. అంబర్‌పేట, నాగోలు నాలాలో పోలియో ఆనవాళ్లు ఉన్నట్లు మరోసారి భయటపడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సాధారణ నమూనా సేకరణలో భాగంగా ఆగస్టు 28న నగరంలో ర్యాండమ్‌గా సేకరించిన శాంపిల్స్‌ను ముంబై డబ్ల్యూహెచ్ఓ సంస్థకు పంపగా.. పరీక్షల్లో నాగోలు, అంబర్‌పేట నాలాల్లో పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. వ్యక్తి మలం ద్వారా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నాలాలో వైరస్ బయటపడింది కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ ఇదే వైరస్ పిల్లలకు వ్యాపించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే వైరస్ ఆనవాళ్లు మళ్లీ బయటపడటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదు మాసాల కిందే గుర్తింపు అంబర్పేట్, గోల్నాక నాలాలో పోలియో వైరస్ ఆన వాళ్లు ఉన్నట్లు ఐదు మాసాల క్రితమే నిర్ధారణైంది. హైదరాబాద్ జిల్లాలోని అ ంబర్పేట, గోలా ్నక, బార్కాస్, కంటోన్మెంట్, డబీర్‌పుర, జంగమ్మెట్, కింగ్‌కోఠి, లాలాపేట, మలక్‌పేట, నాంపల్లి, పానిపురా, సీతాఫల్మండి, సూరజ్‌భాను ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్, మల్కజిగిరి, బాలానగర్, అల్వాల్, నార్సింగ్, శేర్లింగంపల్లి, కీసర, నారపల్లి, ఉప్పల్, అబ్దుల్లాపూర్, సరూర్‌నగర్, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ సంస్థల ప్రతినిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు నగరంలో వేర్వేరుగా పర్యటించాయి. ఆయా ప్రాంతాల్లో ఆరు మాసాల నుంచి మూడేళ్లలోపు పిల్లలు మూడున్నర లక్షల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు జూన్ 20 నుంచి 26 వరకు ప్రత్యేకంగా ఐపీవీ వాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఓపీవీ స్థానంలో ఐపీవీ పరిచయం అప్పటి వరకు ఉన్న ఓరల్ పోలియో వాక్సిన్(ఓపీవీ) స్థాన ంలో (ఏప్రిల్ 25 నుంచి) కొత్తగా ఇన్ యాక్టివేటెడ్ పోలియో వాక్సిన్(ఐపీవీ) పోలియో ఇంజెక్షన్లను వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులోకి తెచ్చింది. ప్రజల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో వాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు జెనీవా, చెన్నై నుంచి వాక్సిన్ తెప్పించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీవీ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. దీంతో నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు తమ వద్దకు వచ్చిన పిల్లలకు ఇప్పటిMీ ఓరల్ పోలియో వాక్సిన్‌నే వేస్తున్నట్లు ఈ తాజా ఉదాంతంతో స్పష్టమైంది. పోలియో వైరస్ నాలాలో ఉన్నందున అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆ రోగ్యశాఖ స్పష్టం చేస్తోంది. -
ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు చర్యలు
వైద్యులు, సూపర్వైజర్ల నియామకం డీఎంఅండ్ హెచ్‌వో చంద్రయ్య చింతూరు: ఏజెన్సీలో మలేరియా నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు డీఎం అండ్ హెచ్‌వో కె.చంద్రయ్య తెలిపా రు. గురువారం ఆయన చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇటీవలే 10 మంది వైద్యులను నియమించినట్లు తెలిపారు. విలీన మండలాల్లోని తొమ్మిది పీహెచ్‌సీలకూ ఇద్దరు చొప్పున సూపర్వైజర్లను మైదాన ప్రాం తం నుంచి డిప్యుటేషన్‌పై నియమించామన్నారు. వారు క్షేత్రస్థాయిలో మలేరియా కేసులను స్వయంగా పర్యవేక్షిస్తారని చెప్పా రు. వీరికితోడు దోమల నివారణ, యాంటీ లార్వా చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సబ్యూనిట్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూస్తున్నామని, ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇటీవల హాస్టళ్లలో విద్యార్థుల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయన్నారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇళ్ళకు పంపివేయకుండా ఆసుపత్రులకు పంపి పరీక్షలు నిర్వహించాలని హాస్టళ్ల సిబ్బందికి సూచించారు. హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యతను వార్డెన్, ఏఎన్ఎంలకు అప్పగించినట్లు తెలిపారు. జ్వరాల నియంత్రణకు ఏజెన్సీలో 104 వెళ్లలేని గ్రామాల్లో 650 వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన తులసిపాక, ఏడుగురాళ్లపల్లి, లక్ష్మీపురం పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించి మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అడిషనల్ డీఅండ్‌హెచ్‌వో పవన్‌కుమార్, డీఎంవో ప్రసాద్, ఎస్పీహెచ్వో సుబ్బమ్మ పాల్గొన్నారు.