వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం
పాల్వంచరూరల్: జిల్లాలో కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి తీవ్రత తగ్గేందుకు సకాలంలో చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిర్మూలన చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా జనవరి 30 నుంచి ఈనెల 13 వరకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన కల్పిస్తూ జాగృతం చేస్తున్నారు. ఏజెన్సీ, పారిశ్రామిక ప్రాంతమైన జిల్లాలోని 23 మండలాల పరిధిలో గత మూడేళ్ల గణాంకాల ఆధారంగా 177 మంది వ్యాధి గ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంతో అశించిన స్థాయిలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ, కుష్ఠువ్యాధి నిర్మూలన శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 78 కేసులను గుర్తించారు. గత ఏడాది 62 కేసులు ఉండగా.. 2016 నుంచి 2019 వరకు ప్రస్తుత కేసులు కలుపుకుని 177కు చేరింది. వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, తెలిసినా బయటకు చెపితే సామాజికంగా దూరం అవుతామనే భయంతో కొందరు నివారణ చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని భావించిన ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు ఆశా వర్కర్ల సహాయంతో ఇంటింటి సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వేలో 9,83,179 మందిని పరీక్షించారు. ఇందులో అనుమానాస్పదంగా 1923 మందిని గుర్తించారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించగా 78 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు.
వ్యాధి లక్షణాలు...
కుష్ఠు వ్యాధి ముఖ్యంగా నరాలకు, చర్మానికి సోకుతుంది. వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. వయసు, లింగ బేధం లేకుండా ఎవరికైనా సోకవచ్చు. వంశపారంపర్యంగా ఈ వ్యాధి సంక్రమించదు. కుష్ఠు మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువగా లేదా రాగి రంగు కలిగి ఉంటాయి. మచ్చలపై స్పర్శ, నొప్పి ఉండదు. శరీరంలో ఏ భాగంలోనైనా సోకవచ్చు. వ్యాధి ప్రారంభ దశలో గుర్తించి ఎంబీపీ చికిత్స చేయించుకుంటే అంగవైకల్యానికి దారితీయదు. కుష్ఠు వ్యాధి నివారణ, చికిత్స కోసం జిల్లాలోని అన్ని అరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు.
ఎలా సంక్రమిస్తుంది...
కుష్ఠు వ్యాధి ప్రధానంగా మైకో బ్యాక్టీరియా లెప్రె వలన సంక్రమిస్తుంది. వ్యాధి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు, సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ వ్యాధిపై అవగాహన లేనివారు సరైన సమయంలో వైద్య చికిత్సలు చేయించుకోకపోవడంతో ఇది తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు.
‘స్పర్శ’ పేరుతో అవగాహన
స్పర్శ అనే కార్యక్రమం ద్వారా వైద్య, అరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 30 వేల కరపత్రాలు, 100 సెల్ఫ్ కిట్లు పంపిణీ చేశాం. వ్యాధి నిర్మూలనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ సుక్రుత, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ లెప్రసీ అండ్ ఎయిడ్స్
Comments
Please login to add a commentAdd a comment