Leprosy disease
-
అనుబంధం, ఆత్మీయత.. అంతా ఒక బూటకం
సాక్షి, ఒడిశా: కుష్ఠు వ్యాధి ఒకప్పుడు భయంకరమైనది. అయితే కుష్ఠు వ్యాధికి మందులు వచ్చిన తరువాత అది ప్రమాదకరమైన వ్యాధి కాదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్లు, ప్రభుత్వం చెబుతూనే ఉన్నా నేటికీ అనేక మంది కుష్ఠు వ్యాధి గ్రస్తులను అంటరాని వారిగానే పరిగణిస్తున్నారు. వారిని చూస్తే అసహ్యించుకుంటున్నారు. ఆఖరికి రక్త సంబంధీకులే వారిని దూరంగా నెడుతున్నారు. అలా కుటుంబ సభ్యులు వెళ్లగొట్టిన ఒక వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో ఒక కాలువ పక్కన సిమెంట్ పైపు గొట్టంలో తల దాచుకుంటూ దుర్భర జీవితం గడుపుతోంది. నవరంగపూర్ జిల్లా నందాహండి సమితి విమాలిగుడ గ్రామంలో ఈ పరిస్థితి కనిపించింది. గ్రామానికి చెందిన కమల బిశాయి(55)కి కుష్ఠు వ్యాధి ఉందని వైద్యులు వెల్లడించారు. మందులు వాడితే నయమవుతుందని తెలిపారు. అయితే కుష్ఠు వ్యాధి అంటే మహమ్మారి అని అది తమకు కూడా సోకవచ్చన్న భయంతో ఆమె ఇంటివారు మానవత్వాన్ని మరిచి ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఏడాది కిందట ఆమె భర్త మరణించాడు. అందుచేత ఆమె తన కొడుకు, కోడలు వద్ద ఉంటోంది. ఆమె కాలివేలికి కురుపై కాలక్రమేణా పెద్దది కావడంతో హాస్పిటల్‌కు వెళ్లగా ఆమెకు కుష్ఠు వ్యాధి సోకిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో ఆమె బందువులు, గ్రామస్తులు అంటరాని దానిగా చూడడం మొదలుపెట్టారు. ఆఖరికి కన్న కుమారుడు, కోడలు కూడా ఆమెను అంటరానిదిగా చూసి ఇంటి నుంచి బయటకు పంపివేశారు. గ్రామంలో నిన్నటి వరకు ఎంతో ఆదరంగా చూసిన ప్రజలు, చుట్టుపక్కల వారు, బంధువులు, మిత్రులు, ఆఖరికి కన్నకొడుకు, కోడలు తనను చీదరించుకుంటూ దరి చేరనీయక పోవడంతో ఆ వృద్ధురాలు ఖిన్నురాలైంది. ఆఖరికి ఆమెకు తిండి కూడా పెట్టేవారు లేక పోయారు. నిలువ నీడ లేని కమల బిశాయి సమీప కాలువ వద్ద గల పాడైన ఒక సిమ్మెంట్ పైపులో తల దాచుకుంటోంది. (ఒంటిపై చీరలు తీసి ప్రాణాలు కాపాడారు) రేషన్ బియ్యమే ఆధారం ఎండావానలకు ఆమె ఆపైపునే ఇంటిగా భావిస్తూ అందరికీ దూరంగా ఒంటరిగా ఉంటోంది. తనకు ఉన్న రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చే బియ్యమే జీవనాధారం. ఆమె పగలు తిరుగుతూ సాయంత్రం పైపు వద్దకు చేరుకుంటూ పైపులో తల దాచుకుంటోంది. ఈ విషయం పంచాయతీ అధికారులకు తెలిసినా వారిలో మానవత్వం నిద్ర లేవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కుష్ఠు వ్యాధి నేడు అంటరాని వ్యాధి కాదని అధికారులు ప్రకటనలు చేస్తున్నా అటువంటి వారికి ఉచిత మందులు ఇచ్చి సేవలు చేస్తున్న లెప్రా ఇండియా లాంటి సంస్థలు ఉన్నా కమల బిశాయి లాంటి అభాగ్యులను నేటికీ సమాజానికి దూరంగా నెట్టేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆమెకు తగిన రక్షణ కల్పించి వైద్యం తో పాటు పునరావాసం కల్పించాలని విజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. -
కలవరపెడుతున్న కుష్టు వ్యాధి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కుష్టు వ్యాధి నివారించబడిందని అందరూ భావించే వేళ.. కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. చాపకింద నీరులా వ్యాధి వ్యాప్తిచెందుతుండడం, పిల్లలకూ వ్యాధి సోకుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగి స్తోంది. కుష్టువ్యాధి నివారణ పక్షోత్సవాల్లో కొత్తగా కేసులు నమోదుకావడంతో వైద్యులు, సిబ్బంది అమ్రత్తమయ్యారు. జనవరి నెలఖారు నాటికి జిల్లాలో 349 కుష్ఠువ్యాధి కేసులు నమోదయ్యాయి. ఇందులో పిల్లలు 26 మంది ఉన్నారు. 349 కేసుల్లో పాసీబ్యాసిల్లరీ(పీబీ) కేసులు 211 కాగా, మల్టీ బ్యాసిల్లరీ కేసులు 138 నమోదయ్యాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి నెలాఖారు వరకు జిల్లా కుష్టునివారణ శాఖ ఆధ్వర్యంలో పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో కొత్త 12 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎంబీ కేసులు 8 కాగా, పీబీ కేసులు నాలుగు ఉన్నాయి. అయితే, చాలా మందికి కుççష్టు వ్యాధిపై అవగాహన లేక పోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగి అంగవైకల్యంవచ్చే వరకు గుర్తించలేక పోతున్నట్టు సిబ్బంది గుర్తించారు. కొంతమంది శరీరంపై మచ్చలు ఉన్నా సోపు మచ్చలు అనుకుని తేలికగా తీసుకుంటున్నట్టు నిర్ధారించారు. కుష్టు వ్యాధి సోకేదిలా.. కుష్టు వ్యాధి మైకో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి చర్మానికి, నరాలకు సోకుతుంది. కుష్టు వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి కుష్టు వ్యాధిసోకే అవకాశం ఉంది. వ్యాధిని గుర్తించడం ఇలా: శరీరంలోని ఏభాగంలోనైనా ఒకటి లేదా ఎక్కువ చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ మచ్చలపై స్పర్శ జ్ఞానం లేనప్పడు, నొప్పి తెలియనప్పుడు మచ్చలపై చెమట పట్టదు. వెంట్రుకలు కూడా రాలి పోతాయి. చర్మంపై బుడిపెలు ఏర్పడతాయి. చెవి తమ్మెలు, ముఖం, చేతులు కాళ్లపై బుడిపెలు ఏర్పడతాయి. కాళ్లు, చేతులు, పాదాల్లో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారితీస్తాయి. పాదాలలో గాయాలు ఏర్పడతాయి. కనురెప్ప పూర్తిగా మూయలేరు. రెండు రకాలుగా చికిత్స.. కుష్టు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ(పీబీ)గా గుర్తిస్తారు. వారికి ఆరు నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు మచ్చలు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ(ఎంబీ)గా గుర్తిస్తారు. వారికి 12 నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 15 నెలల్లో కోర్సును పూర్తి చేయాలి.బహుళ ఔషధ చికిత్సతో కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. దాదాపు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చయ్యే మందులను పూర్తిగా ఉచితంగా వ్యాధి గ్రస్తులకు అందిస్తారు. 6 నెలలు నుంచి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే కుష్టు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. వైద్యులను సంప్రదించాలి కుష్టువ్యాధి వ్యాప్తి నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి. వ్యాధిని గుర్తించకపోవడమే వ్యాధి వ్యాప్తికి కారణం. కుష్టు వ్యాధిపై ప్రతీ గురువారం పీహెచ్సీ పరిధిలో ఒక వైద్యుడు సర్వే చేస్తారు. అక్కడ కుష్టు వ్యాధి అనుమానితులు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే చికిత్స ప్రారంభిస్తాం. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారు తక్షణమే సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్యులను సంప్రదించాలి.– జె.రవికుమార్,జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి -
విస్తరిస్తున్న కుష్ఠు
పాల్వంచరూరల్: జిల్లాలో కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి తీవ్రత తగ్గేందుకు సకాలంలో చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి నిర్మూలన చర్యలు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా జనవరి 30 నుంచి ఈనెల 13 వరకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. గ్రామాలు, పాఠశాలల్లో అవగాహన కల్పిస్తూ జాగృతం చేస్తున్నారు. ఏజెన్సీ, పారిశ్రామిక ప్రాంతమైన జిల్లాలోని 23 మండలాల పరిధిలో గత మూడేళ్ల గణాంకాల ఆధారంగా 177 మంది వ్యాధి గ్రస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంతో అశించిన స్థాయిలో సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ, కుష్ఠువ్యాధి నిర్మూలన శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 78 కేసులను గుర్తించారు. గత ఏడాది 62 కేసులు ఉండగా.. 2016 నుంచి 2019 వరకు ప్రస్తుత కేసులు కలుపుకుని 177కు చేరింది. వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, తెలిసినా బయటకు చెపితే సామాజికంగా దూరం అవుతామనే భయంతో కొందరు నివారణ చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారు. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని భావించిన ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 24 నుంచి నవంబర్ 3 వరకు ఆశా వర్కర్ల సహాయంతో ఇంటింటి సర్వే నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వేలో 9,83,179 మందిని పరీక్షించారు. ఇందులో అనుమానాస్పదంగా 1923 మందిని గుర్తించారు. పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించగా 78 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వ్యాధి లక్షణాలు... కుష్ఠు వ్యాధి ముఖ్యంగా నరాలకు, చర్మానికి సోకుతుంది. వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి మూడు సంవత్సరాల సమయం పడుతుంది. వయసు, లింగ బేధం లేకుండా ఎవరికైనా సోకవచ్చు. వంశపారంపర్యంగా ఈ వ్యాధి సంక్రమించదు. కుష్ఠు మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువగా లేదా రాగి రంగు కలిగి ఉంటాయి. మచ్చలపై స్పర్శ, నొప్పి ఉండదు. శరీరంలో ఏ భాగంలోనైనా సోకవచ్చు. వ్యాధి ప్రారంభ దశలో గుర్తించి ఎంబీపీ చికిత్స చేయించుకుంటే అంగవైకల్యానికి దారితీయదు. కుష్ఠు వ్యాధి నివారణ, చికిత్స కోసం జిల్లాలోని అన్ని అరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఎలా సంక్రమిస్తుంది... కుష్ఠు వ్యాధి ప్రధానంగా మైకో బ్యాక్టీరియా లెప్రె వలన సంక్రమిస్తుంది. వ్యాధి నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు, సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ వ్యాధిపై అవగాహన లేనివారు సరైన సమయంలో వైద్య చికిత్సలు చేయించుకోకపోవడంతో ఇది తీవ్రరూపం దాల్చుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘స్పర్శ’ పేరుతో అవగాహన స్పర్శ అనే కార్యక్రమం ద్వారా వైద్య, అరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. జిల్లాలో 30 వేల కరపత్రాలు, 100 సెల్ఫ్ కిట్లు పంపిణీ చేశాం. వ్యాధి నిర్మూలనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ సుక్రుత, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ లెప్రసీ అండ్ ఎయిడ్స్ -
కుష్ఠును తరిమేద్దాం..!
కరీంనగర్‌హెల్త్: కుష్ఠు వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంత వరకు తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఇటీవల రోగుల సంఖ్య పెరగడంతో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరముంది. జిల్లాలో 2018–19లో 89 కేసులు నమోదు అయినట్లు కుష్ఠు వ్యాధి నివారణ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు 24 మంది రోగులు ఉండగా, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రోగుల సంఖ్య 89కి పెరిగింది. 2016–17లో 54 కొత్త కేసులు నమోదు కాగా, 2017–18లో 43 కేసులు నమోదు అయ్యాయి. జమ్మికుంట మండలం తనుగులలోని పరిమళ కాలనీలో 67 మంది ఉండగా, వీరికి పరీక్షలు నిర్వహిస్తే 17 కేసులు నమోదు అయినట్లు సమాచారం. కొత్త కేసుల నమోదుతో పాటు వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయడంలో కూడా ఆ శాఖ ముందుంది. ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి 2018లో 28 మందికి వ్యాధిని పూర్తిగా నయం చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 85 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ఒకరికి శస్త్రచికిత్స నిర్వహించి వంకరగా మారిన అవయవాలను సరిచేశారు. కుష్ఠు వ్యాధి నిర్మూలనకు జిల్లా కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అయితే కుష్ఠు వ్యాధిపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం కోసం ప్రభుత్వం ఈ నెల 30న కుష్ఠువ్యాధి వ్యతిరేక దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వ్యాధి లక్షణాల ఎలా ఉంటాయి? వంటి అంశాలతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో ప్రచారం, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను రూపొందించారు. వ్యాధి రెండు రకాలు పాసి బేసిలరీ లెప్రసీ (పీబీ)మొదటిది. దీనివల్ల శరీరంపై ఒకటి నుంచి ఐదు వరకు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు పొడిబారి, నొప్పి లేకుండా ఉంటాయి. మల్టీ బేసిలరీ లెప్రసీ (ఎంబీ) ఇది రెండవ రకం. శరీరంపై మచ్చల సంఖ్య ఆరు అంతకంటే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ నరాలకు కూడా సోకుతుంది. ఒకటే శస్త్రచికిత్స కేంద్రం వ్యాధి తీవ్రమై అంగవైకల్యం కలిగినపుడు శస్త్రచికిత్స చేయడానికి రాష్ట్రంలో ఒకే కేంద్రం ఉంది. హైదరాబాద్‌లోని శివానంద (ఎన్జీవో) లెప్రసీ రిహాబిలిటేషన్ సెంటర్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మందులు, పౌష్టికాహారం కోసం రూ.8వేలు అందిస్తారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెత్తని చెప్పులు ధరించి స్పర్శలేని పాదాలకు బొబ్బలు, పుండ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కాళ్లు, చేతులు, శరీర భాగాలను పండ్లు రాకుండా గమనిస్తుండాలి పొడిబారిన చేతులు, కాళ్లును ప్రతిరోజు 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పగుళ్లు, గాట్లు ఉన్న చోట మొద్దుగా ఉన్న అంచులు గల రాయితో తోమాలి. ఆ తర్వాత వంటనూనె పూసుకోవాలి. బొబ్బలు, పండ్లు ఉన్నపుడు సబ్బుతో శుభ్రం చేసుకొని గుడ్డను కట్టాలి. యాంటీ బయాటిక్ మాత్రలు వాడాలి. కండరాలు పని చేయనపుడు నూనెతో మర్ధన చేసి కీళ్లు గట్టిపడకుండా వ్యాయామం చేయాలి. సూర్యరశ్మిని భరించలేని పరిస్థితిలో కళ్లకు అద్దాలు వాడాలి. నిద్రపోయే సమయంలో కళ్లను కంటి ప్యాడ్స్‌తో మూసుకోవాలి. కుష్ఠు వ్యాధి లక్షణాలు.. కుష్ఠు వ్యాధి మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మజీవి వల్ల సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా నరాలు, చర్మానికి సోకుతుంది. రోగి చర్మం రంగు కంటే తక్కువ రంగు, లేదా ఎరుపు రంగు, స్పర్శ లేని మచ్చలు, ముఖంపై మెరిసే చర్మం ఉన్నపుడు కుష్ఠుగా అనుమానించాలి. అరిచేతులు, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం, కన్ను ఎగువ రెప్పలపై బలహీనతగా అనిపిస్తుంది. ఉచితంగా చికిత్స.. కుష్ఠు వ్యాధి రెండు మూడు రకాల ఔషధాల వల్ల (బహుళ ఔషద చికిత్స) పూర్తిగా నయం అవుతుంది. ఇది 28 రోజులకు సరిపడా ప్యాక్‌లో లభిస్తుంది. దీనిని ప్రారంభ దశలోనే తీసుకుంటే అంగవైకల్యం అరికట్టువచ్చు. రోగులకు నిర్ధేశించిన కాలం వరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి 12 నెలలపాటు ఖచ్చితంగా మందులు వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. నెలకు రూ.1500 పింఛన్ కుష్ఠు వ్యాధితో బాధపడి పని చేసుకోలేని స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరికి పింఛన్ అందిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 232 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కుష్ఠు వ్యాధి నివారణకు అవసరమైన అన్ని రకాల మందులు, చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి నివారణకు ప్రచారం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ సుజాత, జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ శాఖ అధికారి -
విస్తరిస్తున్న కుష్ఠు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి విస్తరిస్తోంది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కావడంతో ఆందోళనకు గురిచేస్తోంది. తగిన సమయంలో చికిత్స తీసుకోకుంటే దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి నిర్మూలన కోసం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లాలో పక్షోత్సవాలను వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధిగ్రస్తులు చికిత్స చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో వ్యాధి ముదిరిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 2017–18 సంవత్సరంలో వ్యాధిగ్రస్తులు 64 మంది ఉండగా, 2018 సంవత్సరంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య 118కి చేరింది. వ్యాధి నివారణ కోసం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు 108 మంది ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు నిర్ధారించారు. కాగా ఇటీవల నిర్వహించిన కుష్ఠు వ్యాధిగ్రస్తుల ఇంటింటి సర్వేలో వీరిని గుర్తించారు. 2017–18 సంవత్సరంలో 137 కేసులు ఉండగా, ఈఏడాది 104 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో మరికొంత మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాలతో పోల్చితే కుష్ఠు వ్యాధిగ్రస్తులు జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 92 మంది, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 16 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. స్పర్ష లేని మచ్చలు ఉన్నవారు దాదాపు 10వేల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు చేస్తే ఎంతమందికి వ్యాధి ఉందో.. లేదో తేలుతుందని పేర్కొంటున్నారు. కాగా అత్యధికంగా ఆదిలాబాద్ మండలంలో 30 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లాలో కుష్ఠు నివారణ కార్యక్రమం 1975 సంవత్సరం నుంచి అమలవుతోంది. అయితే గతం కంటే ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. 1991 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 38,335 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, 38,145 మందికి పూర్తిగా చికిత్స ద్వారా నయం అయిందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 108 మంది వ్యా«ధిగ్రస్తులు ఎండీటీ చికిత్స పొందుతున్నారని తెలిపారు. మైకోలెప్రి బ్యాక్టీరియాతో.. కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రి అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వస్తుంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన తర్వాత 3–15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడుతాయి. తొలిదశలో వ్యాధిని నిర్ధారించుకొని ఎండీటీ చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు స్పర్శ లేని మచ్చలు ఉంటే వ్యాధిగా గుర్తించవచ్చు. -
కుష్టు ఉందని విడాకులు కుదరదు
న్యూఢిల్లీ: విడాకులు తీసుకోవాలనుకునే భార్య/భర్త తమ జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపడం కుదరదు. ఈ మేరకు చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. ‘జీవిత భాగస్వామికి కుష్టు వ్యాధి ఉందనే కారణం చూపి ఇకపై విడాకులు పొందేందుకు వీలుండదు. కుష్టు నయం కాదని ఇదివరకు అందరూ భావించేవారు. కానీ, ఈ వ్యాధికి చికిత్స ఉంది’ అని వ్యక్తిగత చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చలో న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి అన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులపై వివక్షను చూపుతున్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వివాహ చట్టాల్లో ఈ మేరకు ప్రభుత్వం మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చర్చలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. దేశంలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేదు. ప్రభుత్వం ముస్లిం వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకోవద్దు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కుష్టు వ్యాధిని కారణంగా చూపి విడాకులు తీసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది’ అని చెప్పారు. -
మహమ్మారిలా.. చాప కింద నీరులా..
సాక్షి, హైదరాబాద్ : చాపకింద నీరులా రాష్ట్రంలో కుష్టువ్యాధి విస్తరిస్తోంది. ఇది ఎప్పుడో గతించిందని జనం భావిస్తుంటే, దాని జాడలు ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ వ్యాధి పోయిందని వైద్య ఆరోగ్యశాఖలోని సంబంధిత నిర్మూలనా విభాగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. దాన్ని వివిధ విభాగాల్లో కలిపేశారు. సిబ్బందిని కుదించారు. నిధులకు కోత పెట్టారు.ఫలితంగా మళ్లీ వ్యాధి జాడ కనిపించి ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా పెరుగుతున్న బాధితులు... 2016 సంవత్సరంలో రాష్ట్రంలో 2,025 కుష్టువ్యాధి కేసులు నమోదు కాగా, 2017లో 2,910 కేసులు రికార్డు అయ్యాయి. 2017 నవంబర్ 13 నుంచి అదే నెల 26 వరకు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కేసుల గుర్తింపు చేపట్టారు. లక్షలాది మందిని పరీక్షించి 26,548 మంది అనుమానిత బాధితులను గుర్తించారు. కొత్తగా 515 కేసులు వెలుగు చూశాయి. ఇక 2018లో గత ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి అంటే ఏడు నెలల్లోనే ఏకంగా 2,629 కేసులు నమోదయ్యాయి. అధికంగా ఖమ్మం జిల్లాలో 189 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 158, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 154, మహబూబ్‌నగర్ జిల్లాలో 122 నమోదయ్యాయి. ఈ తీవ్రతను గమనించిన ప్రభుత్వం మళ్లీ ప్రత్యేకంగా 2018 అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు 29 జిల్లాల్లో లక్షలాది మందిని పరీక్ష చేయించింది. దీనికోసం 25,644 టీంలు గ్రామాల్లో పర్యటించాయి. మొత్తంగా 79,821 మంది అనుమానితులను గుర్తించారు. అందులో 1337 మందికి సోకినట్టు నిర్ధారించారు. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఇన్ని కేసులు నమోదు కావడం గమనార్హం. పడకేసిన ఎన్ఎల్ఈపీ... ఈ వ్యాధిని గుర్తించి, చికిత్స అందించేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో నేషనల్ లెప్రసీ ప్రోగ్రామ్ విభాగం కింద లెప్రసీ కంట్రోల్ యూనిట్లు ఉండేవి. వ్యాధిగ్రçస్తుల సంఖ్య బాగా తగ్గిందన్న కారణంతో 2006లో ప్రభుత్వాలు ఈ యూనిట్లలో కొత్త నియామకాలు నిలిపేశాయి. సిబ్బందిని ఆరోగ్య శాఖలో విలీనం చేశారు. రోగులు గుర్తించినచోట చికిత్స కొనసాగించారు. తెలంగాణలో ఈ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో 3 వేల మంది వరకు సిబ్బంది ఉండగా, ఇప్పుడు 700 మందికి కుదించారు. పైగా గతంలో ప్రత్యేక విభాగం ఉంటే, దాన్ని ఇప్పుడు టీబీ, హెచ్ఐవీ తదితర విభాగాల్లో కలిపేశారు. అప్పట్లో ఈ విభాగానికి రూ. 20 కోట్ల వరకు నిధులు కేటాయిస్తే, ఇప్పుడు రూ. 3 కోట్లకు మించి బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారు. 2015 నుంచి చాలా ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ వ్యాధిగ్రస్తులను ఉన్న సిబ్బంది ద్వారా సర్వేలు చేయించి గుర్తించి, చికిత్స అందిస్తోంది. అందులో భాగంగానే గతేడాది అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు ప్రత్యేక సర్వే చేయించింది. ఇవీ లక్షణాలు... కుష్టులో పీబీ (పాసిబాసిల్లరి), ఎంబీ (మల్టిబాసిల్లరి)గా కేసులు ఉంటాయి. పీబీ అంటే అనుమానిత వ్యక్తి శరీరంపై దద్దులు, రాగి వర్ణపు మచ్చలు, అవయవాల్లో స్పర్శ తక్కువగా ఉండడంతో పాటు ఇతర లక్షణాలతో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఎంబీ కేసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరికి వైద్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ వ్యాధి చలి ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతంలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కుష్టు వ్యాధిని వ్యాప్తి చేసే మైకో బ్యాక్టిరియం లెప్రే శరీరంలోకి ప్రవేశించిన ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో వ్యాధి పొదిగే కాలం (ఇంకుబేషన్ íపీరియడ్) ఉండడంతో వెంటనే ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో వ్యాధి పెరగడానికి మరింత ఆస్కారం ఏర్పడుతోంది. గుర్తించిన వ్యాధిగ్రస్తులకు సరైన చికిత్స ద్వారా వందశాతం నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. -
నిజమేనా ?!
సాక్షి, పాలమూరు: జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న కుష్టు వ్యాధి(లెప్రసీ) సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమానించినట్లే వేగంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. అంతరించి పోయిందనుకున్న తరుణంలో చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తున్నట్లు తేలుతుండడంతో గమనార్హం. గతనెల 28వ తేదీన సర్వే ప్రారంభించగా ఇప్పటివరకు(గురువారం వరకు) 3,89,602 గృహాలకు గాను 2,70,885 గృహాల్లో సిబ్బంది సర్వే పూర్తి చేశారు. ఈ సందర్భంగా 2,648 అనుమానిత కేసులను గుర్తించడం గమనార్హం. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే నిరక్షరాస్యులు, అవగహన లేని వారి కారణంగా వ్యాధి జిల్లాలో పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అనుమానితుల కేసులన్నీ కుష్టు వ్యాధిగా భావించలేమని.. ప్రత్యేక వైద్యపరీక్షల్లో ఇందులో ఎక్కువ శాతం సాధారణ చర్మ వ్యాధులుగా తేలే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. నిఘా కరువవడంతో... కుష్టు వ్యాధి నివారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం 2010 ముందు వరకు పని చేసింది. ప్రపంచ దేశాల్లోకెల్లా మన దేశంలోనే అధికంగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో నివారణకు కేంద్ర ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతో వ్యాధి విస్తృతి గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి పది వేల మందిలో ఒక్క శాతానికి వ్యాధి(ప్రివిలెన్స్ రే టు) తగ్గింది. దీంతో రాష్ట్రంలో కుష్టు వ్యాధి విభాగాన్ని ప్రజారోగ్య శాఖలో విలీనం చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో నిఘా లేక నివారణ చర్యలు కొరవడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ లెప్రసీ బృందం ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న సర్వేలో వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించారు. దేశ ప్రివిలెన్స్ రేటు 2.3 శాతానికి చేరడంతో మేల్కొన్న కేంద్రం తాజాగా సర్వేకు ఆదేశించింది. వందల్లో అనుమానిత కేసులు జిల్లాలో వందల సంఖ్యలో కుష్టు వ్యాధి అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. సర్వే ఈనెల 4 వరకు కొనసాగించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 70శాతం కుటుంబాల్లో ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించాయి. జిల్లాలో సగటున రోజుకు 100నుంచి 120మధ్యలో అనుమానిత కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. వీటిలో సగానికి పైగా చర్మవ్యాధులు, పుండ్లు, గాయాలైన మచ్చలు ఉంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన మండలాల్లో వ్యాధి తీవ్రత బాగా ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఈ సర్వే ద్వారా తేలిన అనుమానిత కేసులను ఈనెల 5నుంచి లెప్రసీ వైద్యుల బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది. పెరగనున్న రోగుల సంఖ్య అక్టోబర్ 22నుంచి ప్రారంభమైన సర్వే ఈనెల 4వ తేదీతో ముగుస్తుంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఉదయం 6 నుంచి ఉదయం 9గంటల వరకు సర్వే చేస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 20 ఇల్లు, అర్భన్ ప్రాంతాల్లో 25ఇళ్లను పరిశీలించడానికి 3,891 మందితో 1,510 బృందాలను ఏర్పాటుచేశారు. ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరిని శరీరంపై ఏమైనా తెల్లమచ్చలు, రాగివర్ణపు మచ్చలు ఉంటే గుర్తిస్తు న్నారు. చర్మం రంగు మారడం, మొద్దుబారి పోవడం, స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఉంటే ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. సర్వేలో భాగంగా మహిళ, పురుష సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేస్తున్నారు. అక్టోబర్ 22నుంచి నిర్వహిస్తున్న కుష్టు గుర్తింపు సర్వేకు ముందు ఈ వ్యాధి బాధితులు జిల్లాలో 74మంది ఉండగా ఈ సర్వే అనంతరం గణనీయంగా పెరిగే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 2,648 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరికీ ఈనెల 5న వైద్య బృందాలు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయనున్నాయి. ఈ పరీక్షల సందర్భంగా ఎక్కువ శాతం సాధారణ చర్మవ్యాధులుగా తేలుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే మంచిదే కానీ.. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం నివారణ చర్యల్లో వేగం పెంచాల్సి ఉంటుంది. ఇలా వ్యాపిస్తుంది కుష్టు వ్యాధి ‘మైక్రో బ్యాక్టీరియం లెప్రీ’ సూక్ష్మ క్రిమి ద్వారా సంక్రమిస్తోంది. ఇది చాలా సందర్భాల్లో అంటువ్యాధి. వ్యాధి సోకిన తర్వాత దాని ప్రభావం రెండు నుంచి మూడేళ్ల వరకు కనిపించదు. వచ్చిన వెంటనే గుర్తించకపోతే నష్టం జరుగుతుంది. వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లాలాజలం తుంపర్ల ద్వారా ఇతరులకు కూడా సోకుతుంది. రోగితో సన్నిహితంగా మెలిగినా వచ్చే అవకాశముంది. వయస్సు భేదం లేకుండా అందరికీ వ్యాపించే కుష్టు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాపి చెందే అవకాశముంది. విస్తృత ప్రచారం చేస్తాం జిల్లా వ్యాప్తంగా కుష్టు వ్యాధి పై విస్తృతంగా ప్రచారం చేసి అపోహలను తొలగించడానికి కృషి చేస్తాం. ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆదివారంతో ముగియనుంది. ఎన్ని అనుమానిత కేసులు వస్తాయి, వాటిలో ఎన్ని నిర్ధారణ అయితాయో చూడాల్సి ఉంది. అనుమానిత కేసులు అధికంగా వస్తున్నా ప్రత్యేక పరిశీలనలో అవి సాధారణ చర్మవ్యాధులుగా వెల్లడవుతాయని నమ్మకం. – డాక్టర్ రజిని, డీఎంహెచ్ఓ -
చాపకింద నీరులా కుష్ఠు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. అవగాహనలేమితో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 96 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వ్యాధిగ్రస్తుల నిర్ధారణ కోసం వైద్యారోగ్య శాఖ లెప్రసీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకూ జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఈ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్‌లో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేటి నుంచి ఇంటింటా సర్వే చేపట్టనుంది. ఇందుకు గానూ 1062 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆశా కార్యకర్త, వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి వయస్సుతో సంబంధం లేకుండా ఒంటిపైన ఏవైన స్పర్శలేని మచ్చలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి సమాచారం అందించి వైద్య పరీక్షలు చేయిస్తారు. గతంలో కుష్ఠు వ్యాధికి సంబంధించి ప్రత్యేక వైద్యం కోసం కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం సాధారణ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయడంతో చాలా మంది పరీక్షలు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. పదివేల జనాభాలో ఒకరికంటే తక్కువ వ్యాధిగ్రస్తులు ఉంటే కుష్టు వ్యాధి అదుపులో ఉన్నట్లు. అయితే ప్రస్తుతం జిల్లాలో 1.37శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అవగాహన లేమితోనే.. కుష్ఠు వ్యాధిపై అవగాహన లేకపోవడంతోనే వ్యాధి ప్రబలుతుందని తెలుస్తోంది. అంటు వ్యాధి అని ప్రజల్లో అవగాహన కల్పిస్తే ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 60 మందికి కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాగా, ప్రస్తుతం ఈసారి 96 మందికి వ్యాధి సోకినట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా దాదాపు 500ల వరకూ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఉంటుందని భావిస్తున్నారు. కుష్ఠు వ్యాధి అంటే.. కుష్ఠు వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రీయ అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతోంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలుంటే పాసిబ్యాసెల్లరింగ్ అని పేర్కొంటా రు. దీని నివారణకు ఆరు నెలల వరకూ చికిత్స అందిస్తారు. ఆరు కంటే ఎక్కువ మచ్చలుండి, నరాలు ఉబ్బితే మల్టీ బ్యాసిలరిగా నిర్ధారిస్తారు. దీని నివారణకు సంవత్సరం వరకూ చికిత్స అందిస్తారు. ఈ వ్యాధి సోకిన తర్వాత 3 నుంచి 15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడతాయి. తొలి దశలో వ్యాధిని నిర్ధారించుకుని చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధి ఉన్నట్లు నిర్ధారిస్తారు. జిల్లాలోని జైనథ్ మండలంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఇది వరకూ చికిత్స పొందిన వారు దాదాపు 2వేలకు పైగా ఉన్నారని వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ, గిమ్మ, మేడిగూడ, కౌట, దీపాయిగూడ, ఆనంద్‌పూర్, బేల మండలంలో దహెగాం, బాధి, సాంగిడి, తలమడుగు మండలంలో పల్లి(బి), పల్లి(కె), ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా(టి), యాపల్‌గూడ, మామిడిగూడ, ఇచ్చోడ మండలంలో గేర్జం, ఉట్నూర్ మండల కేంద్రంలో, ఆదిలాబాద్ పట్టణ ంలోని ఖుర్షీద్‌నగర్, హమాలీవాడల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 36వేల మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో 15వేల మంది ఉన్నారంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. నేటి నుంచి ఇంటింటా సర్వే.. కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నవంబర్ 4వ తేది వరకూ కొనసాగుతుంది. ఆశా కార్యకర్త, వాలంటీర్ ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఒంటిపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వాటిని గుర్తించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమాచారం అందిస్తారు. ఆ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 1062 బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతిఒక్కరూ ఈ బృందం సభ్యులకు సహకరించాలి. జిల్లాలో ప్రస్తుతం 96 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. – శోభ పవార్, జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ అధికారి -
కుష్ఠుపై సమరం
ఖమ్మంవైద్యవిభాగం: కుష్ఠు వ్యాధి నిర్మూలన ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 4వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందు కోసం 1470 బృందాలను సిద్ధం చేశారు. గ్రామాల్లో ఇంటింటి సర్వేలో భాగంగా ఏఎన్ఎం పర్యవేక్షణలో ఆశ, మేల్ వలంటీర్ వివరాలు నమోదు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9వరకు నిర్వహించి..ఆ ఇంటికి ఎల్ మార్క్ పెడతారు. సదరు గృహంలో వివరాలు తెలపని వారు ఎవరైనా మిగిలి ఉంటే..ఎక్స్ గుర్తు పెడతారు. పూర్తి సమాచారాన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అధికారులు నేరుగా వెళ్లి వారికి మందులిచ్చే ప్రక్రియ చేపట్టనున్నారు. కుష్ఠువ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకే ఇంటింటి సర్వే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి లోపువారికి ఈ నెల 24న వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఈ ఏడాది 81కేసులు నమోదు ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం..81 కుష్ఠు కేసులు నమోదయ్యాయి. గతేడాది 131 కేసులు ఉన్నాయి. ముఖ్యంగా తిరుమలాయపాలెం మండలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఖమ్మంఅర్బన్, ఖమ్మం రూరల్....కూసుమంచి మండలాల్లో కూడా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ప్రజల్లో అవగాహన లేమి కూడా కారణంగా కనిపిస్తోంది. ఎక్కువగా వ్యాప్తి చెందుతుందడటంతో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల జాబితాలో ఖమ్మంను చేర్చింది. వ్యాధివ్యాప్తిని అరికట్టేందుకు పలుసార్లు సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు. కుష్ఠు అంటే..? కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రే లనే సూక్ష్మ క్రిమి వల్ల సంక్రమిస్తుంది. ప్రధానంగా ఇది చర్మం, నరాలకు సోకుతుంది. నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం అయ్యేందుకు సగటున 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి ఎవరికైనా రావచ్చు. దీనికి వయస్సు, లింగభేదం ఉండదు. వంశపరంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6 నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు. వ్యాధి రకాలు.. కుష్ఠు వ్యాధిని రెండు రకాలుగా పిలుస్తారు. మొదటిది పాసీ బేసిలరీ లెప్రసీ(పీబీ). శరీరంపై ఒకటి నుంచి ఐదు మచ్చలు వస్తాయి. మలీ బేసిలరీ లెప్రసీ(ఎంబీ) రెండో రకానికి చెందినది. శరీరంపై మచ్చలు ఆరు కంటే ఎక్కువగా కనిపిస్తాయి. అంతే కాకుండా ఒకటి కంటే ఎక్కువ నరాలకు సోకడం దీని లక్షణం. కుష్ఠు లక్షణాలు.. కుష్ఠు వ్యాధి మచ్చలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ, ఎరుపు లేదా రాగి రంగు కలిగి ఉంటాయి. మచ్చపై స్పర్శ ఉండదు. నొప్పి ఉండదు. ఇవి..దేహంలోని ఏ ప్రదేశంలోనైనా రావచ్చు. చికిత్స విధానం. కుష్ఠువ్యాధి రెండు లేక మూడు ఔషధాల కలయిక గల బహుళ ఔషధ చికిత్స(ఎండీటీ)తో పూర్తిగా నయమవుతుంది. ప్రారంభదశలోనే వ్యాధిని గుర్తించడం, వ్యాధి సోకిన వారికి పూర్తి ఎండీటీ చేయించటం ద్వారా అరికట్టవచ్చు. ఎండీటీ చికిత్స అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. తక్కువ తీవ్రత కలిగిన వ్యాధిగ్రస్తునికి 6 నెలలు, ఎక్కువ తీవ్రత కలిగిన వ్యక్తులు 12 నెలల పాటు మందులు వాడాలి. మందులు సక్రమంగా వాడితే ఏదశలో ఉన్న కుష్టు వ్యాధి అయినా..నయం అవుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే..అంగవైకల్యాన్ని కూడా నివారించవచ్చు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్ఠు వ్యాధికి చికిత్స ఉచితంగా లభిస్తుంది. మైక్రో సెల్యూలార్ రబ్బర్ పాదరక్షలు ఉచితంగా అందిస్తున్నారు. అంగవైకల్యం ఉన్న అర్హులైన వ్యాధి గ్రస్తులకు రీ కన్సట్రక్టివ్ సర్జరీ ఉచితం. రూ.8000 ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు. వందశాతం సర్వే పూర్తి చేస్తాం.. కుష్ఠు వ్యాధి గ్రస్తుల సర్వే వందం శాతం పూర్తి చేస్తాం. రెండు వారాలపాటు ఆశ, మేల్ వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కరి వంటిపైనా ఏమైనా మచ్చలు ఉన్నాయా అని పరీక్షిస్తారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన తర్వాత మచ్చలు ఉన్నవారికి పరీక్షలు చేసి కుష్ఠు వ్యాధి గ్రస్తులను గుర్తిస్తారు. కుష్ఠు రహిత జిల్లాగా తీర్చిదిద్దే వరకు కృషి చేస్తాం. –కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
ప్రమాద ఘంటికలు
రాకూడదని కోరుకునే రోగం జడలు విప్పుతోంది. కనుమరుగవుతోందనుకున్న కుష్టు వ్యాధి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు తేలింది. దేశమంతా తగ్గుముఖం పడుతుంటే... మన జిల్లాలో మాత్రం పెరగడం చర్చనీయాంశమైంది. గతేడాదే ఈ విషయాన్ని గుర్తించి కొన్ని నివారణా చర్యలు చేపట్టినప్పటికీ ఈ ఏడాది మరో నాలుగు జిల్లాలతో పాటు మన జిల్లా కూడా వ్యాధి ప్రబలుతున్న జిల్లాగా నమోదు కావడం యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. విజయనగరం, బొబ్బిలి: జిల్లాలో మళ్లీ కుష్టువ్యాధి ప్రబలుతోంది. ఒక్క ఈ ఏడాదే 343మంది వ్యాధిబారిన పడినట్టు గుర్తించారు. ఇందులో ఒక సంవత్సరం కోర్సు వాడితే తగ్గే వారు 128 మంది, ఆరునెలల పాటు కోర్సు వాడాల్సినవారు 161 మందిని గుర్తించారు. మొత్తంగా 289 మంది మందులు వాడాలని గుర్తించారు. మిగతా వారిని పరిశీలించాల్సి ఉంది. జిల్లాతో పాటు పొరుగునే ఉన్న శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో తేల్చా రు. సరైన అవగాహన కార్యక్రమాలు, నివారణా చర్యలు చేపట్టకపోతే మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని గుర్తించింది. కేంద్రప్రభుత్వం అప్రమత్తమై సమాచార మంత్రిత్వ శాఖ ద్వారా ఆయా జిల్లాల్లో ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించింది. దీని ప్రకారం జిల్లాలోని బొబ్బిలి తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు వైద్యాధికారులు పరిశీలనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకా రం చేపట్టిన సర్వే ప్రకారం అధికారికంగా జిల్లాలో 343 కేసులు ఉండగా వాస్తవానికి అవి వెయ్యి కి పైగా ఉండొచ్చనేది అంచనా! రోగుల్లో భ యం, అనుమానం, బిడియం వంటి కారణాలతో పాటు సాధారణ పనులకు ఆటంకం కలగక పోవడంతో వ్యాధిని గుర్తించి మందులు వాడట్లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కుష్టు వ్యాధి నివారణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆయా రోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటి స ర్వేలు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడా చర్యలు కానరావడం లేదు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో కొన్నే ళ్ల కిందట కుష్టు వ్యాధి గుర్తింపు పరీక్షలు ప్రతీ గురువారం నిర్వహించేవారు. దీనివల్ల వ్యాధి అదుపులో ఉండేది. ఇప్పుడు ఆ పరీక్షలు లేవు. ప్రత్యేక విభాగాలు కాకుండా పీహెచ్‌సీల్లోని ఏఎన్‌ఎంలకే కొద్దిపాటి శిక్షణ ఇచ్చి వదిలేస్తున్నారు. అవి రోగ నివారణకు ఏమాత్రం ఉపయోగపడటంలేదు. ఖాళీ పోస్టుల భర్తీ లేదు జిల్లాలో 12 డీపీఎంల పోస్టుల పరిధిలో నాలుగు ఏపీఎంఓ పోస్టులు ఉండేవి. ఇప్పుడు ఆయా పోస్టుల్లో ఉన్న వారు పదవీ విరమణ చేస్తున్నా వాటిని భర్తీ చేయడంలో చొరవ చూపడంలేదు. గతంలో కుష్టు వ్యాధి నిర్మూలన కేంద్రాల్లో పలు సేవలందేవి. ఇప్పుడంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా సేవలు మృగ్యమయ్యాయి. జిల్లా అధికారుల పరిశీలన: బొబ్బిలిలోని అభిమాని ఫౌండేషన్ ద్వారా కుష్టువ్యాధిపై అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించేం దుకు వైద్యాధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా వైద్యాధికారులు బొబ్బిలిలో పరిశీలించారు. అదనపు వైద్యాధికారి ఎస్.రవికుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అచ్యుతవల్లి, కమిషనర్ శంకరరావు, స్థానిక వైద్యాధికారి విజయమోహన్‌తో చర్చించారు. ర్యాలీ, అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలియజేశారు. -
చాపకింద నీరులా కుష్ఠు
ఆదిలాబాద్‌టౌన్: కుష్ఠు వ్యాధి జిల్లాలో విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కావడంతో ఆందోళనకు గురి చేస్తోంది. తగిన సమయంలో చికిత్స తీసుకోకుంటే దుష్పరిణామాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అవగాహన లేమి, నిరక్షరాస్యత కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గత నెల 20 నుంచి డిసెంబర్ 3 వరకు జిల్లాలో ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది కుష్ఠు వ్యాధి నిర్ధారణ కోసం ఇంటింటా సర్వే చేపట్టారు. జిల్లాలో కొత్తగా 35 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు నిర్ధారించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా గతంలో వ్యాధి సోకిన వారిని కలుపుకొని 88 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇతర జిల్లాలతో పోల్చితే కుష్ఠు వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7,89,052 మంది జనాభా ఉన్నారు. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్ణణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశ కార్యకర్తలు 6,71,995 మందికి కుష్ఠు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇంకా 36 వేల మందికి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. ఇంటింటి సర్వేలో 35 మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. 19 మందికి మల్టీ బాసిల్లరీ, 16 మందికి పాసిబాసిల్లరీ ఉందని అధికారులు తెలిపారు. 8,585 మందికి స్పర్శలేని మచ్చలు ఉండడంతో వ్యాధి ఉన్న అనుమానితులుగా ఆశ కార్యకర్తలు గుర్తించారు. వారికి వైద్య పరీక్షలు చేస్తే ఎంతమందికి వ్యాధి ఉందో తెలుస్తుంది. శరీరంలో కుష్ఠు సంబంధించిన మచ్చలు 1–5 వరకు ఉంటే పాసిబాసిల్లరీ అని, దీని నివారణకు 6 నెలలపాటు చికిత్స అందిస్తారు. 6 కంటే ఎక్కువ మచ్చలు ఉండి నరాలు ఉబ్బినట్లైతే మల్టీ బాసిల్లరీగా నిర్ధారిస్తారు. దీని నివారణకు ఒక సంవత్సరంపాటు చికిత్స అందిస్తారు. కొత్తగా 35 మందికి వ్యాధి.. ఇంటింటి సర్వేలో జిల్లాలో కొత్తగా 35 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వారికి కుష్ఠు నివారణ మందులను పంపిణీ చేస్తున్నట్లు కుష్ఠు నివారణ ఆధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగుల సంఖ్య పరిశీలిస్తే, తలమడుగు పీహెచ్సీ పరిధిలో 10 మందికి, ఝరి పీహెచ్సీలో ఐదుగురు, తాంసిలో నలుగురు, ఖుర్షీద్‌నగర్‌లో ఇద్దరు, హస్నాపూర్‌లో ఇద్దరికి, హమాలీవాడలో ఒక్కరికి, శాంతి నగర్, ఇంద్రవెల్లి, దంతన్‌పల్లి, నేరడిగొండ, అంకోలి, గిమ్మ, జైనథ్‌లో ఒక్కొక్కరు చొప్పన వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బోథ్‌లో నలుగురు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో గుర్తించిన కేసుల్లో అత్యధికంగా ఆదిలాబాద్ మండలంలో 21 మంది ఉన్నారు. గుడిహత్నూర్‌లో ముగ్గురు, ఒచ్చోడలో ఇద్దరు, బోథ్‌లో ముగ్గురు, తాంసిలో ఒకరు, భీంపూర్‌లో ఇద్దరు, తలమడుగులో నలుగురు, జైనథ్‌లో ఐదుగురు, బేలలో ముగ్గురు, ఉట్నూర్‌లో ఐదుగురు, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడలో ఒక్కరు చొప్పన వ్యాధిగ్రస్తులు ఉన్నారు. కుష్ఠు వ్యాధి అంటే.. కుష్ఠు వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రి అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సోకుతుంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరి నుంచి మరోకరి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. వ్యాధి సోకిన తర్వాత 3 నుంచి 15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడుతాయి. తొలిదశలో వ్యాధిని నిర్ధారించుకుని యండీటీ చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధి ఉన్నట్లు నిర్ధారిస్తారు. 35 మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించాం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 35 మందికి కుష్ఠు ఉన్నట్లు నిర్ధారించాం. వారికి మందులు పంపిణీ చేశారు. కొత్త వారిని కలిపి మొత్తం 88 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 6.71 లక్షల మందికి వైద్య పరీక్షలు చేశాం. ఇంకా 36 వేల మందికి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంది. 8,585 వ్యాధి ఉన్న అనుమానితులుగా గుర్తించాం. వారికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. – శోభపవార్, జిల్లా కుష్ఠు నివారణ అధికారి -
పెరుగుతున్న కుష్టు రోగులు
సాక్షి, హైదరాబాద్: ప్రమాదకరమైన కుష్టు వ్యాధి మళ్లీ పడగవిప్పుతోంది. దశాబ్దాలుగా చికిత్సా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మహమ్మారి మాత్రం అంతరించిపోవడంలేదు. కుష్టు వ్యాధి నివారణకోసం కేంద్ర ప్రభుత్వం 1955 నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. 1983 నుంచి బహుళ ఔషధాలతో నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నా వ్యాధి తీవ్రత మాత్రం తగ్గడంలేదు. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 2,658 మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో 76 మంది పాఠశాల విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కుష్టు వ్యాధి నియంత్రణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నవంబర్ 13 నుంచి 26 వరకు కుష్టు రోగుల గుర్తింపు కార్యక్రమం జరిగింది. పల్స్ పోలియో తరహా లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగతంగా పరిశీలించారు. ప్రతిఏటా రెండుసార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాధి కొత్తగా సోకిన వారిని గుర్తించేందుకు చేసిన ఈ ప్రక్రియలో అనుమానాస్పద కేసుల వివరాలను నమోదు చేశారు. వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. తాజా గుర్తింపు కార్యక్రమంలోనూ రాష్ట్రంలో 400 కేసులు నమోదయ్యాయి. లక్షణాలు... వయసుతో సంబంధం లేకుండా కుష్టు వ్యాధి సోకుతుంది. శరీరంపై తెల్లని, రాగి రంగు మచ్చలతో పాటు శరీరంపై కంతులు ఏర్పడతాయి. చర్మం మొద్దుబారిపోతుంది. నరాల వాపు వస్తుంది. అరిచేతులు, అరికాళ్లు స్పర్శ కోల్పోతాయి. కళ్ల నరాలు దెబ్బతింటాయి. కుష్టు వ్యాధి బాధితులు కళ్లు సగం మూసుకుని నిద్రపోతారు. వేడి, చల్లదనం తెలియదు. స్పర్శ లేని మచ్చలు ఉంటాయి. స్పర్శ లేకపోవడంతో దెబ్బలు తాకి కాళ్లు, చేతి వేళ్లు ఊడిపోవడం జరుగుతుంటుంది. అవగాహనే ముఖ్యం: అవగాహనతోనే కుష్టు వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించవచ్చు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది. -డాక్టర్ డి.జాన్‌బాబు, కుష్టు నిర్మూలన విభాగం జాయింట్ డైరెక్టర్ -
ఆరేళ్ల తర్వాత ఊరిలోకి లింగుబాయి
జన్నారం : కుష్టువ్యాధి కారణంగా గ్రామ బహిష్కరణకు గురైన మహిళ ఆరేళ్ల తర్వాత గ్రామంలోకి చేరింది. మానవహక్కుల సంఘం ఉభయ రాష్ట్రాల కార్యదర్శి ఆత్రం భుజంగరావు, లీగల్ సర్వీసెస్ సొసైటీ వ్యవస్థాపకుడు మదాసు మధుకర్ శ్రమ ఫలించి ఇల్లు చేరింది. మురిమడుగు గ్రామ పంచాయతీ పరిధి కొమ్ముగూడెంకు చెందిన పెంద్రం లింగుబాయి(40) ఆరేళ్ల క్రితం కుష్టుబ్యాధి బారిన పడింది. ఈ విషయం గ్రామస్తులకు వ్యాధి తమకూ అంటుకుంటుదనే అపోహాతో లింగుబాయిని గ్రామం నుంచి పంపించారు. గ్రామ శివారులోని ఓ పాకలో ఉంచారు. అప్పటి నుంచి ఆమె ఒక్కరే అక్కడ ఉంటోంది. కొడుకు తీసుకొచ్చిన అన్నం తిని అక్కడ నివసిస్తోంది. ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న భుజంగరావు, మధుకర్ ఆ గ్రామానికి వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకున్నారు. వివరాలు తెలుసుకుని గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. విషయూన్ని అధికారుల దృష్టికీ తీసుకెళ్లారు. బుధవారం వారితోపాటు లెప్రా సొసైటీ సభ్యులు, సర్పంచ్ రాంచందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు శోభ, వైద్యాధికారి శ్రీనివాస్ గ్రామాన్ని సందర్శించి లింగుబాయికి వైద్య పరీక్షలు చేశారు. కుష్టువ్యాధి అంటువ్యాధి కాదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. గ్రామస్తులు అంగీకరించడంతో లింగుబాయి తన సొంత ఇంటికి చేరింది. అధికారులు స్వయంగా ఆమెను గ్రామంలోకి తీసుకొచ్చారు. కాగా, ఇందన్పల్లి గొండుగూడలో కూడా మడావి మారుబాయి అనే వృద్ధురాలికి కుష్టువ్యాధి సోకింది. ఆమెనూ గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామస్తులు నిర్ణయించినట్లు తెలుసుకుని వారు వెళ్లి నచ్చజెప్పారు. కార్యక్రమంలో లిప్రా సొసైటీ ప్రాజెక్ట్ అధికారి రామనుజాచారి, సభ్యులు కిషన్రావ్, పోతన, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కంగారెత్తిస్తున్న కుష్టు
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న రోగులు నాటు, భూతవైద్యులనుసంప్రదించడమే కారణం అవగాహన కల్పించడంలో వలంటీర్లు విఫలం రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం సాక్షి, ముంబై: కుష్టు వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా లాభం లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కుష్టు నివారణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. రోజు రోజుకు రోగుల సంఖ్య తగ్గాల్సి ఉన్నా, పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. ఒక్క నగరంలోనే 2013 ఏప్రిల్ ఒకటి నుంచి 2013 డిసెంబర్ 31 తేదీ వరకు తొమ్మిది నెలల కాలవ్యవధిలో ఏకంగా 459 మంది కుష్టు రోగులు ఉన్నట్టు గుర్తిం చామని ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ (కుష్టు వ్యాధి) ముంబై కార్యాలయం వర్గాలు వెల్లడిం చాయి. ఇందులో 58 మంది పిల్లలు ఉన్నారని తెలిపాయి. రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు దూరం ఈ వ్యాధి సోకిన వారు వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రావడం లేదు. దాదాపుగా అందరూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు నాటు, భూత వైద్యులను సంప్రదిస్తున్నారు. దీంతో ఈ వ్యాధి నయం కాకపోగా, మరింత ముదురుతోంది. అప్పటికిగానీ ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించడం లేదు. వేలాది మంది వలంటీర్లు ఉన్నా.. కుష్టు వ్యాధిపై పల్లెలు, గ్రామీణ, గిరిజన ప్రాం తాల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వేల మంది వలంటీర్లను నియమించినా వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు వ్యాధి గురించి తెలియడం లేదు. ఒకవేళ వ్యాధి సోకినా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వెళ్లాల్సిన ఆస్పత్రుల గురించి తెలియడం లేదు. అవగాహన కల్పించాల్సిన వలంటీర్లు పత్తాలేకుండా పోయారు. దీంతో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు వృథాగా మారుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి హామీలు నీటి మూటలేనా? కుష్టు రోగుల సంఖ్య ముంబైలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ‘కుష్టు రోగుల పునరావాసం సమితి’ని ఏర్పాటు చేయనున్నట్టు నాలుగు నెలల క్రితం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కుష్టు రోగులకు వివిధ సేవలు అందించేందుకు వివిధ స్వయం సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సరైన సంఖ్య తెలవడం లేదని ఆరోగ్య శాఖ కార్యాలయవర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా కుష్టు రోగుల సంఖ్యను చూస్తే ముంబైలో 4.87 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, గడ్చిరోలి జిల్లాలో అతి తక్కువ శాతం నమోదు కాగా, అత్యధిక శాతం చంద్రపూర్ జిల్లాలో కుష్టు రోగులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.