కుష్ఠు వ్యాధిగ్రస్తుల తాత్కాలిక చికిత్స కేంద్రం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో కుష్టు వ్యాధి నివారించబడిందని అందరూ భావించే వేళ.. కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. చాపకింద నీరులా వ్యాధి వ్యాప్తిచెందుతుండడం, పిల్లలకూ వ్యాధి సోకుతుండడం ప్రస్తుతం ఆందోళన కలిగి స్తోంది. కుష్టువ్యాధి నివారణ పక్షోత్సవాల్లో కొత్తగా కేసులు నమోదుకావడంతో వైద్యులు, సిబ్బంది అమ్రత్తమయ్యారు. జనవరి నెలఖారు నాటికి జిల్లాలో 349 కుష్ఠువ్యాధి కేసులు నమోదయ్యాయి. ఇందులో పిల్లలు 26 మంది ఉన్నారు.
349 కేసుల్లో పాసీబ్యాసిల్లరీ(పీబీ) కేసులు 211 కాగా, మల్టీ బ్యాసిల్లరీ కేసులు 138 నమోదయ్యాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి నెలాఖారు వరకు జిల్లా కుష్టునివారణ శాఖ ఆధ్వర్యంలో పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వేలో కొత్త 12 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎంబీ కేసులు 8 కాగా, పీబీ కేసులు నాలుగు ఉన్నాయి. అయితే, చాలా మందికి కుççష్టు వ్యాధిపై అవగాహన లేక పోవడం వల్ల వ్యాధి తీవ్రత పెరిగి అంగవైకల్యంవచ్చే వరకు గుర్తించలేక పోతున్నట్టు సిబ్బంది గుర్తించారు. కొంతమంది శరీరంపై మచ్చలు ఉన్నా సోపు మచ్చలు అనుకుని తేలికగా తీసుకుంటున్నట్టు నిర్ధారించారు.
కుష్టు వ్యాధి సోకేదిలా..
కుష్టు వ్యాధి మైకో బాక్టీరియం లెప్రే అనే బాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి చర్మానికి, నరాలకు సోకుతుంది. కుష్టు వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి కుష్టు వ్యాధిసోకే అవకాశం ఉంది.
వ్యాధిని గుర్తించడం ఇలా: శరీరంలోని ఏభాగంలోనైనా ఒకటి లేదా ఎక్కువ చిన్నవి లేదా పెద్ద మచ్చలు పాలిపోయిన రాగి లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఆ మచ్చలపై స్పర్శ జ్ఞానం లేనప్పడు, నొప్పి తెలియనప్పుడు మచ్చలపై చెమట పట్టదు. వెంట్రుకలు కూడా రాలి పోతాయి. చర్మంపై బుడిపెలు ఏర్పడతాయి. చెవి తమ్మెలు, ముఖం, చేతులు కాళ్లపై బుడిపెలు ఏర్పడతాయి. కాళ్లు, చేతులు, పాదాల్లో నిస్సత్తువ ఏర్పడి అంగవైకల్యానికి దారితీస్తాయి. పాదాలలో గాయాలు ఏర్పడతాయి. కనురెప్ప పూర్తిగా మూయలేరు.
రెండు రకాలుగా చికిత్స..
కుష్టు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ(పీబీ)గా గుర్తిస్తారు. వారికి ఆరు నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదు మచ్చలు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ(ఎంబీ)గా గుర్తిస్తారు. వారికి 12 నెలలు చికిత్స ఉంటుంది. కనీసం 15 నెలల్లో కోర్సును పూర్తి చేయాలి.బహుళ ఔషధ చికిత్సతో కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. దాదాపు రూ.15 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఖర్చయ్యే మందులను పూర్తిగా ఉచితంగా వ్యాధి గ్రస్తులకు అందిస్తారు. 6 నెలలు నుంచి 12 నెలల వరకు చికిత్స తీసుకుంటే కుష్టు వ్యాధి పూర్తిగా నయం అవుతుంది.
వైద్యులను సంప్రదించాలి
కుష్టువ్యాధి వ్యాప్తి నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి. వ్యాధిని గుర్తించకపోవడమే వ్యాధి వ్యాప్తికి కారణం. కుష్టు వ్యాధిపై ప్రతీ గురువారం పీహెచ్‌సీ పరిధిలో ఒక వైద్యుడు సర్వే చేస్తారు. అక్కడ కుష్టు వ్యాధి అనుమానితులు ఉంటే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే చికిత్స ప్రారంభిస్తాం. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారు తక్షణమే సమీపంలో ఉన్న పీహెచ్‌సీ వైద్యులను సంప్రదించాలి.– జె.రవికుమార్,జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి
Comments
Please login to add a commentAdd a comment