రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న రోగులు
నాటు, భూతవైద్యులనుసంప్రదించడమే కారణం
అవగాహన కల్పించడంలో వలంటీర్లు విఫలం
రూ.కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం
సాక్షి, ముంబై: కుష్టు వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా లాభం లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కుష్టు నివారణకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. రోజు రోజుకు రోగుల సంఖ్య తగ్గాల్సి ఉన్నా, పరిస్థితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. ఒక్క నగరంలోనే 2013 ఏప్రిల్ ఒకటి నుంచి 2013 డిసెంబర్ 31 తేదీ వరకు తొమ్మిది నెలల కాలవ్యవధిలో ఏకంగా 459 మంది కుష్టు రోగులు ఉన్నట్టు గుర్తిం చామని ఆరోగ్య శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ (కుష్టు వ్యాధి) ముంబై కార్యాలయం వర్గాలు వెల్లడిం చాయి. ఇందులో 58 మంది పిల్లలు ఉన్నారని తెలిపాయి.
రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు దూరం
ఈ వ్యాధి సోకిన వారు వైద్యం చేయించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రావడం లేదు. దాదాపుగా అందరూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలు నాటు, భూత వైద్యులను సంప్రదిస్తున్నారు. దీంతో ఈ వ్యాధి నయం కాకపోగా, మరింత ముదురుతోంది. అప్పటికిగానీ ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించడం లేదు.
వేలాది మంది వలంటీర్లు ఉన్నా..
కుష్టు వ్యాధిపై పల్లెలు, గ్రామీణ, గిరిజన ప్రాం తాల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వేల మంది వలంటీర్లను నియమించినా వారి నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు వ్యాధి గురించి తెలియడం లేదు. ఒకవేళ వ్యాధి సోకినా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వెళ్లాల్సిన ఆస్పత్రుల గురించి తెలియడం లేదు. అవగాహన కల్పించాల్సిన వలంటీర్లు పత్తాలేకుండా పోయారు. దీంతో ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయలు వృథాగా మారుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి హామీలు నీటి మూటలేనా?
కుష్టు రోగుల సంఖ్య ముంబైలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ‘కుష్టు రోగుల పునరావాసం సమితి’ని ఏర్పాటు చేయనున్నట్టు నాలుగు నెలల క్రితం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కుష్టు రోగులకు వివిధ సేవలు అందించేందుకు వివిధ స్వయం సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో సరైన సంఖ్య తెలవడం లేదని ఆరోగ్య శాఖ కార్యాలయవర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా కుష్టు రోగుల సంఖ్యను చూస్తే ముంబైలో 4.87 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, గడ్చిరోలి జిల్లాలో అతి తక్కువ శాతం నమోదు కాగా, అత్యధిక శాతం చంద్రపూర్ జిల్లాలో కుష్టు రోగులు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
కంగారెత్తిస్తున్న కుష్టు
Published Tue, Feb 4 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement