
రంజీ ట్రోఫీ (Ranji Trophy) రన్నింగ్ సీజన్‌లో ముంబై ఆల్‌రౌండర్, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) హవా కొనసాగుతుంది. ఈ సీజన్‌లో ఆది నుంచి తనదైన శైలిలో రెచ్చిపోతున్న శార్దూల్.. ప్రస్తుతం మేఘాలయాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత హ్యాట్రిక్ (Hat Trick) తీసిన శార్దూల్.. బ్యాటింగ్‌లో మెరుపు అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన శార్దూల్.. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. శార్దూల్‌తో పాటు మిగతా ఆటగాళ్లంతా తలో చేయి వేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (671/7) చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ముంబై బ్యాటర్లలో సిద్దేశ్ లాడ్ (145), వికెట్ కీపర్ ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (86 బంతుల్లో 100 నాటౌట్; 16 ఫోర్లు) సెంచరీలతో కదంతొక్కగా.. కెప్టెన్ అజింక్య రహానే (96) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సుయాంశ్ షేడ్గే (61) అర్ద సెంచరీతో రాణించాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి ముంబై 585 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు శార్దూల్ ఠాకూర్ బంతితో చెలరేగడంతో మేఘాలయా తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి 3, సిల్డెస్టర్ డిసౌజా 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో 10వ నంబర్ ఆటగాడు హిమాన్ పుఖాన్ చేసిన 28 పరుగులే అత్యధికం. శార్దూల్ దెబ్బకు మేఘాలయా టాపార్డర్‌కు చెందిన ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.
ఈ మ్యాచ్‌లో మేఘాలయా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. కేవలం 2 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రదర్శన నమోదు చేసింది.
90ల్లో ఔటైన ఐదుగురు ఆటగాళ్లు..
ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్‌ల్లో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లు 90ల్లో ఔటయ్యారు. వీరిలో ఇద్దరు పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యారు. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా, ఢిల్లీ కెప్టెన్ ఆయుశ్ బదోని 99 పరుగుల వద్ద ఔట్ కాగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 96, రైల్వేస్ ఆటగాడు ఉపేంద్ర యాదవ్ 95, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 91 పరుగుల వద్ద ఔటయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment