కరీంనగర్‌హెల్త్: కుష్ఠు వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంత వరకు తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఇటీవల రోగుల సంఖ్య పెరగడంతో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరముంది. జిల్లాలో 2018–19లో 89 కేసులు నమోదు అయినట్లు కుష్ఠు వ్యాధి నివారణ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి.
గతేడాది జనవరి నుంచి మార్చి వరకు 24 మంది రోగులు ఉండగా, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రోగుల సంఖ్య 89కి పెరిగింది. 2016–17లో 54 కొత్త కేసులు నమోదు కాగా, 2017–18లో 43 కేసులు నమోదు అయ్యాయి. జమ్మికుంట మండలం తనుగులలోని పరిమళ కాలనీలో 67 మంది ఉండగా, వీరికి పరీక్షలు నిర్వహిస్తే 17 కేసులు నమోదు అయినట్లు సమాచారం. కొత్త కేసుల నమోదుతో పాటు వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయడంలో కూడా ఆ శాఖ ముందుంది. ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి 2018లో 28 మందికి వ్యాధిని పూర్తిగా నయం చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 85 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ఒకరికి శస్త్రచికిత్స నిర్వహించి వంకరగా మారిన అవయవాలను సరిచేశారు.
కుష్ఠు వ్యాధి నిర్మూలనకు జిల్లా కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అయితే కుష్ఠు వ్యాధిపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం కోసం ప్రభుత్వం ఈ నెల 30న కుష్ఠువ్యాధి వ్యతిరేక దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వ్యాధి లక్షణాల ఎలా ఉంటాయి? వంటి అంశాలతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో ప్రచారం, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను రూపొందించారు.
వ్యాధి రెండు రకాలు
పాసి బేసిలరీ లెప్రసీ (పీబీ)మొదటిది. దీనివల్ల శరీరంపై ఒకటి నుంచి ఐదు వరకు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు పొడిబారి, నొప్పి లేకుండా ఉంటాయి. మల్టీ బేసిలరీ లెప్రసీ (ఎంబీ) ఇది రెండవ రకం. శరీరంపై మచ్చల సంఖ్య ఆరు అంతకంటే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ నరాలకు కూడా సోకుతుంది.
ఒకటే శస్త్రచికిత్స కేంద్రం
వ్యాధి తీవ్రమై అంగవైకల్యం కలిగినపుడు శస్త్రచికిత్స చేయడానికి రాష్ట్రంలో ఒకే కేంద్రం ఉంది. హైదరాబాద్‌లోని శివానంద (ఎన్‌జీవో) లెప్రసీ రిహాబిలిటేషన్ సెంటర్‌లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మందులు, పౌష్టికాహారం కోసం రూ.8వేలు అందిస్తారు.
- వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మెత్తని చెప్పులు ధరించి స్పర్శలేని పాదాలకు బొబ్బలు, పుండ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రతిరోజు కాళ్లు, చేతులు, శరీర భాగాలను పండ్లు రాకుండా గమనిస్తుండాలి
- పొడిబారిన చేతులు, కాళ్లును ప్రతిరోజు 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పగుళ్లు, గాట్లు ఉన్న చోట మొద్దుగా ఉన్న అంచులు గల రాయితో తోమాలి. ఆ తర్వాత వంటనూనె పూసుకోవాలి.
- బొబ్బలు, పండ్లు ఉన్నపుడు సబ్బుతో శుభ్రం చేసుకొని గుడ్డను కట్టాలి. యాంటీ బయాటిక్ మాత్రలు వాడాలి.
- కండరాలు పని చేయనపుడు నూనెతో మర్ధన చేసి కీళ్లు గట్టిపడకుండా వ్యాయామం చేయాలి.
- సూర్యరశ్మిని భరించలేని పరిస్థితిలో కళ్లకు అద్దాలు వాడాలి. నిద్రపోయే సమయంలో కళ్లను కంటి ప్యాడ్స్‌తో మూసుకోవాలి.
కుష్ఠు వ్యాధి లక్షణాలు..
కుష్ఠు వ్యాధి మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మజీవి వల్ల సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా నరాలు, చర్మానికి సోకుతుంది. రోగి చర్మం రంగు కంటే తక్కువ రంగు, లేదా ఎరుపు రంగు, స్పర్శ లేని మచ్చలు, ముఖంపై మెరిసే చర్మం ఉన్నపుడు కుష్ఠుగా అనుమానించాలి. అరిచేతులు, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం, కన్ను ఎగువ రెప్పలపై బలహీనతగా అనిపిస్తుంది.
ఉచితంగా చికిత్స..
కుష్ఠు వ్యాధి రెండు మూడు రకాల ఔషధాల వల్ల (బహుళ ఔషద చికిత్స) పూర్తిగా నయం అవుతుంది. ఇది 28 రోజులకు సరిపడా ప్యాక్‌లో లభిస్తుంది. దీనిని ప్రారంభ దశలోనే తీసుకుంటే అంగవైకల్యం అరికట్టువచ్చు. రోగులకు నిర్ధేశించిన కాలం వరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి 12 నెలలపాటు ఖచ్చితంగా మందులు వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చు.
నెలకు రూ.1500 పింఛన్
కుష్ఠు వ్యాధితో బాధపడి పని చేసుకోలేని స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరికి పింఛన్ అందిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 232 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నారు.
ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స
కుష్ఠు వ్యాధి నివారణకు అవసరమైన అన్ని రకాల మందులు, చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి నివారణకు ప్రచారం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ సుజాత, జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment