Dermatological problems
-
చికెన్ స్కిన్ గురించి విన్నారా? వేసవికాలంలో ఇబ్బంది పెట్టే వ్యాధి..!
చికెన్‌ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..! వైద్య పరిభాషలో చికెన్ స్కిన్‌ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు. దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. (చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!) -
టొరంట్ ఫార్మా చేతికి క్యురేషియో: ఏకంగా 2వేలకోట్లు
న్యూఢిల్లీ: చర్మ పరిరక్షణ(డెర్మటాలజీ) విభాగంలో సేవలందిస్తున్న క్యురేషియో హెల్త్‌కేర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రయివేట్ రంగ కంపెనీ టొరంట్ ఫార్మాస్యూటికల్స్ పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను రూ. 2,000 కోట్లుగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున రూ. 115 కోట్లను నగదు రూపేణా చెల్లించనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,885 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో ఒప్పందం కుదిరినట్లు వివరించింది. కాగా.. క్యురేషియోను సొంతం చేసుకోవడం ద్వారా డెర్మటాలజీ పోర్ట్‌ఫోలియోను విభిన్నంగా విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు టొరంట్ ఫార్మా డైరెక్టర్ అమన్ మెహతా తెలియజేశారు. ఇది వ్యూహాత్మక కొనుగోలుగా పేర్కొన్నారు. 50 బ్రాండ్లకుపైగా: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న క్యురేషియో కాస్మెటిక్, పిడియాట్రిక్ డెర్మటాలజీ విభాగాలలో అధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. టెడిబార్, అటోగ్లా, స్పూ, బీ4 నప్పి, పెర్మైట్ తదితర 50 బ్రాండ్లకుపైగా పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. గతేడాది(2021–22)లో రూ. 224 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. క్యురేషియో ప్రమోటర్లతోపాటు.. క్రిస్‌క్యాపిటల్, సీక్వోయా సైతం కంపెనీ నుంచి వైదొలగనున్నట్లు ప్రస్తావించింది. -
కుష్ఠును తరిమేద్దాం..!
కరీంనగర్‌హెల్త్: కుష్ఠు వ్యాధి జిల్లాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంత వరకు తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండేళ్లతో పోల్చితే ఇటీవల రోగుల సంఖ్య పెరగడంతో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరముంది. జిల్లాలో 2018–19లో 89 కేసులు నమోదు అయినట్లు కుష్ఠు వ్యాధి నివారణ శాఖ రికార్డులు తెలుపుతున్నాయి. గతేడాది జనవరి నుంచి మార్చి వరకు 24 మంది రోగులు ఉండగా, ఆ తర్వాత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రోగుల సంఖ్య 89కి పెరిగింది. 2016–17లో 54 కొత్త కేసులు నమోదు కాగా, 2017–18లో 43 కేసులు నమోదు అయ్యాయి. జమ్మికుంట మండలం తనుగులలోని పరిమళ కాలనీలో 67 మంది ఉండగా, వీరికి పరీక్షలు నిర్వహిస్తే 17 కేసులు నమోదు అయినట్లు సమాచారం. కొత్త కేసుల నమోదుతో పాటు వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయడంలో కూడా ఆ శాఖ ముందుంది. ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించి 2018లో 28 మందికి వ్యాధిని పూర్తిగా నయం చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 85 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ఒకరికి శస్త్రచికిత్స నిర్వహించి వంకరగా మారిన అవయవాలను సరిచేశారు. కుష్ఠు వ్యాధి నిర్మూలనకు జిల్లా కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణాల నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అయితే కుష్ఠు వ్యాధిపై ప్రజలను మరింత అప్రమత్తం చేయడం కోసం ప్రభుత్వం ఈ నెల 30న కుష్ఠువ్యాధి వ్యతిరేక దినంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది? అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వ్యాధి లక్షణాల ఎలా ఉంటాయి? వంటి అంశాలతో ప్రజల్లో అవగాహన కల్పించడానికి గ్రామ స్థాయిలో ప్రచారం, ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను రూపొందించారు. వ్యాధి రెండు రకాలు పాసి బేసిలరీ లెప్రసీ (పీబీ)మొదటిది. దీనివల్ల శరీరంపై ఒకటి నుంచి ఐదు వరకు మచ్చలు ఏర్పడుతాయి. మచ్చలు పొడిబారి, నొప్పి లేకుండా ఉంటాయి. మల్టీ బేసిలరీ లెప్రసీ (ఎంబీ) ఇది రెండవ రకం. శరీరంపై మచ్చల సంఖ్య ఆరు అంతకంటే ఎక్కువగా కనిపిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ నరాలకు కూడా సోకుతుంది. ఒకటే శస్త్రచికిత్స కేంద్రం వ్యాధి తీవ్రమై అంగవైకల్యం కలిగినపుడు శస్త్రచికిత్స చేయడానికి రాష్ట్రంలో ఒకే కేంద్రం ఉంది. హైదరాబాద్‌లోని శివానంద (ఎన్జీవో) లెప్రసీ రిహాబిలిటేషన్ సెంటర్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఇక్కడ శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మందులు, పౌష్టికాహారం కోసం రూ.8వేలు అందిస్తారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెత్తని చెప్పులు ధరించి స్పర్శలేని పాదాలకు బొబ్బలు, పుండ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు కాళ్లు, చేతులు, శరీర భాగాలను పండ్లు రాకుండా గమనిస్తుండాలి పొడిబారిన చేతులు, కాళ్లును ప్రతిరోజు 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి పగుళ్లు, గాట్లు ఉన్న చోట మొద్దుగా ఉన్న అంచులు గల రాయితో తోమాలి. ఆ తర్వాత వంటనూనె పూసుకోవాలి. బొబ్బలు, పండ్లు ఉన్నపుడు సబ్బుతో శుభ్రం చేసుకొని గుడ్డను కట్టాలి. యాంటీ బయాటిక్ మాత్రలు వాడాలి. కండరాలు పని చేయనపుడు నూనెతో మర్ధన చేసి కీళ్లు గట్టిపడకుండా వ్యాయామం చేయాలి. సూర్యరశ్మిని భరించలేని పరిస్థితిలో కళ్లకు అద్దాలు వాడాలి. నిద్రపోయే సమయంలో కళ్లను కంటి ప్యాడ్స్‌తో మూసుకోవాలి. కుష్ఠు వ్యాధి లక్షణాలు.. కుష్ఠు వ్యాధి మైక్రోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మజీవి వల్ల సంక్రమిస్తుంది. ఇది ప్రధానంగా నరాలు, చర్మానికి సోకుతుంది. రోగి చర్మం రంగు కంటే తక్కువ రంగు, లేదా ఎరుపు రంగు, స్పర్శ లేని మచ్చలు, ముఖంపై మెరిసే చర్మం ఉన్నపుడు కుష్ఠుగా అనుమానించాలి. అరిచేతులు, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం, కన్ను ఎగువ రెప్పలపై బలహీనతగా అనిపిస్తుంది. ఉచితంగా చికిత్స.. కుష్ఠు వ్యాధి రెండు మూడు రకాల ఔషధాల వల్ల (బహుళ ఔషద చికిత్స) పూర్తిగా నయం అవుతుంది. ఇది 28 రోజులకు సరిపడా ప్యాక్‌లో లభిస్తుంది. దీనిని ప్రారంభ దశలోనే తీసుకుంటే అంగవైకల్యం అరికట్టువచ్చు. రోగులకు నిర్ధేశించిన కాలం వరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ చికిత్స అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి 12 నెలలపాటు ఖచ్చితంగా మందులు వాడితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. నెలకు రూ.1500 పింఛన్ కుష్ఠు వ్యాధితో బాధపడి పని చేసుకోలేని స్థితిలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీరికి పింఛన్ అందిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 232 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్నారు. ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స కుష్ఠు వ్యాధి నివారణకు అవసరమైన అన్ని రకాల మందులు, చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. వ్యాధి నివారణకు ప్రచారం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ సుజాత, జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ శాఖ అధికారి -
ఆహారంతో ఆరోగ్యం
ఫ్యాట్స్ ఉండాల్సిందే వ్యాయామంతో మేలు సిటీబ్యూరో: చలి గాలుల వల్ల ఎక్కువ శాతం చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ వంటి వ్యాధులు పెట్టే ఇబ్బందులను ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఈ కాలంలో ఉన్ని దుస్తులతో పాటు, వేడిని, శక్తిని ఇచ్చే ప్రత్యేక ఆహారం విషయాన్నిమరచిపోవద్దని చెబుతున్నారు జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు. దైనందిన ఆహారంతో పాటు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్‌తో పాటు, శక్తిని ఇచ్చే ఫ్యాట్స్ కూడా అవసరమే. ఈ కాలంలో పొగలు గక్కే సూపులు, వేడి వేడి కమ్మని కాఫీలు తాగేటప్పుడు పొందే అనుభూతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎక్కువ వేడిగా ఉండే పదార్ధాల కంటే ఒక మోతాదులో ఉండేవే ఆరోగ్యదాయకం. వ్యాయామం చాలా అవసరం శరీరానికి శక్తిని ఇచ్చే పదార్ధాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో... విసర్జకాలను వెలువరించడం కూడా అంతే ముఖ్యం. అందుకు వ్యాయామం ఒక్కటే సాధనం. ఉదయాన్నే నడక , ఏరోబిక్ ఎక్సర్సైజులు, యోగాసనాలు వంటివి విధిగా చేసే వాళ్లు ఆహారంపై పెద్దగా ఆంక్షలు పెట్టవలసిన పని లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేనప్పుడే ఆహారంపై ఆంక్షలు తప్పనిసరి. ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాల కూర... ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. రోజూ పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి దోహదం చేస్తుంది. జొన్నలు అన్నం, రొట్టెలు వంటి ఆహార పదార్ధాలతో పాటు, వారానికి ఒక్కసారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కండరాల కదలిక బాగా ఉంటుంది. శీతాకాలంలో బాధించే ఒళ్లు నొప్పులను జొన్న ఆహారం ద్వారా సమర్ధంగా ఎదుర్కోవచ్చు. జొన్నతో చేసిన పదార్ధాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దూరంగా ఉంటాయి. నువ్వులు... దైనందిన ఆహారంతో పాటు నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే చలికాలంలో శరీరానికి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్ధాలను తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. చలికాలంలో ఇబ్బంది పెట్టే అనేక చర్మ సమస్యలకు నువ్వులు దివ్యౌషధం. వేరుసెనగలు... వేరుసెనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచిది. వేరు సెన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది. దానిమ్మ ... సకల పోషకాల నిధి దానిమ్మ. రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి... అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి. హృద్రోగాల నుంచి దానిమ్మ రక్షిస్తుంది. డ్రైఫ్రూట్స్... వివిధ రకాల ఆహార పదార్ధాలతో పాటు చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవడం మరిచిపోవద్దు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్ తీసుకోవచ్చు. చలి కాలంలో కావలసిన శక్తి వీటి వల్ల లభిస్తుంది. ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు స్రవించేందుకు కావలసిన వనరులు వీటిలో పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ సహజంగానైనా, ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు. ఆహారం ఎంపికలో జాగ్రత్తలు అవసరం చలికాలంలో తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి కొవ్వులు అవసరం కదా అని అధికంగా తీసుకుంటే ఇబ్బందే. అలాగని వాటికి దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. అధిక కేలరీలనిచ్చే పిజ్జాలు, బర్గర్ల కంటే మిల్లెట్స్ నుంచి శక్తివంతమైన, బలవర్ధకమైన ఆహారాన్ని పొందవచ్చు. పిల్లలు,పెద్దలు మిల్లెట్స్‌ను విధిగా తీసుకోవడం మంచిది. -లీలాప్రసాద్, పోషకాహార నిపుణులు చిలగడ దుంపలు చిలగడ దుంపలు చాలా చక్కటి పోషకాహారం. ఇవి శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని ఇస్తాయి. పిల్లలు, వయోధికులకు ఎంతో అవసరం. వీటిలోని పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, సి లు, ఖనిజ లవణాలు, మాంగనీస్, రాగి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే ఆ మజాయే వేరు. దీంతో చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలను దూరంగా ఉంచవచ్చు.