చికెన్‌ఫాక్స్ లాంటి ఆటలమ్మ, పొంగు, తట్టు తరహా చర్మ వ్యాధులను చూశాం. గ్రామాల్లో మాత్రం ఈ వ్యాధిని అమ్మవారు చూపింది అంటారు. ఓ వారం రోజుల్లో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇప్పటికీ చాలా చోట్ల దీనికి మందులు వాడరు ప్రజలు. వేపాకు, పసుపుతో తగ్గించుకుంటారు. అయితే దీనికి కూడా టీకాలు వంటివి వచ్చేశాయి ఇప్పుడు. కానీ కొత్తగా ఇదేంటీ..? చికెన్ స్కిన్ .. అంటే.. ఇది కూడా ఒక విధమైన చర్మ వ్యాధే. గానీ తీవ్రత ఎక్కువ. వచ్చిందంటే ఓ పట్టాన తగ్గదు. శోభి తర్వాత భయానకమైన చర్మవ్యాధి ఇదే. ముఖ్యంగా వేసవికాలంలో పలువురిని వేధించే సమస్య ఇది. అయితే కొందరికి నయం అయినా, మరికొందరికి మాత్రం జీవితాంతం వేధిస్తుంది. అసలేంటి వ్యాధి? ఎలా వస్తుంది ? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!
వైద్య పరిభాషలో చికెన్ స్కిన్ను కెరటోసిస్ పిలారిస్ అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి వచ్చిన రోగి చర్మంపై చిన్న చిన్న కురుపులు ఏర్పడతాయి. రాను రాను గులాబీ లేదా ఎరుపు రంగు మచ్చలుగా మారతాయి. ఇవి ఎక్కువగా చేతులు, ముఖం, తొడలు, చెంపలు, వీపు పైభాగంలో ఎక్కువగా ఏర్పడతాయి. ఆ మచ్చలు చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వాటి వల్ల దురద కూడా ఏర్పడుతుంది. నలుగురిలో అదే పనిగా శరీరాన్ని గోకుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ.. ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. పైగా నలుగురిలో తిరగలేక నానాఅవస్థలు పడతారు.
దీనికి ప్రధాన కారణం చర్మంపై కెరాటిన్ ఏర్పడటం. ఎందుకంటే..? ఈ కెరాటిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. చర్మంపై వెంట్రుకల కుదుళ్ళు పెరగకుండా చేస్తుంది. ఫలితంగా చర్మంపై చిన్న పరిమాణంలో ఎర్రటి గడ్డలు ఏర్పడతాయి. ఈ కెరాటోసిస్ అనేది జన్యు మార్పుల వల్ల వస్తుందని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ. తామర, మధుమేహం కెరాటోసిస్ పిలారిస్ కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది. ఉబ్బసం, అలర్జీ, అధిక బరువు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ
చికెన్ స్కిన్ వల్ల ఏర్పడే గడ్డలు కొందరిలో వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అయితే జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. చికెన్ స్కిన్ నుంచి బయటపడాలంటే .. ముందుగా పొడి చర్మాన్ని నివారించాలి. కెరాటో లిటిక్ ఏ వంటి మాయిశ్చరైజింగ్ లోషన్లను వాడాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అయితే చికెన్ స్కిన్ బారిన పడ్డవారు చర్మంపై వచ్చిన ఆ గడ్డలను గిచ్చడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.
అంతేకాదు కొంతమంది రాపిడితో కూడిన ఎక్స్ ఫోలీయేటర్తో గడ్డల మీద స్క్రబ్ చేస్తుంటారు. దీనివల్ల చర్మం మరింత ప్రమాదంలో పడుతుంది. అంతేగాదు బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ఈ వ్యాధి బారనే పడ్డట్టు ఇన్‌స్టాగ్రాం వేదికగా తెలిపింది. ఈ వ్యాధి ఏంటో ఎలా బయటపడాలి అనే దాని గురించి కుణ్ణంగా తెలుసుకునే పనిలో ఉన్నాని కన్నీటిపర్యంతమయ్యింది. అందువల్ల సమస్య ఆదిలో ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించి సత్వరమే సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. దీని గురించి మరింత క్షుణ్ణంగా వ్యక్తిగత వైద్యులను, నిపుణులను సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
(చదవండి: బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!)
Comments
Please login to add a commentAdd a comment