ఆహారంతో ఆరోగ్యం | health With food | Sakshi
Sakshi News home page

ఆహారంతో ఆరోగ్యం

Published Sat, Nov 14 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

ఆహారంతో ఆరోగ్యం

ఆహారంతో ఆరోగ్యం

ఫ్యాట్స్ ఉండాల్సిందే  వ్యాయామంతో మేలు
 

సిటీబ్యూరో:  చలి గాలుల వల్ల ఎక్కువ శాతం చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ వంటి వ్యాధులు పెట్టే ఇబ్బందులను ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. ఈ కాలంలో ఉన్ని దుస్తులతో పాటు, వేడిని, శక్తిని ఇచ్చే ప్రత్యేక ఆహారం విషయాన్నిమరచిపోవద్దని చెబుతున్నారు జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు. దైనందిన ఆహారంతో పాటు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ప్రత్యేకంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్‌తో పాటు, శక్తిని ఇచ్చే ఫ్యాట్స్ కూడా అవసరమే. ఈ కాలంలో పొగలు గక్కే సూపులు, వేడి వేడి కమ్మని కాఫీలు తాగేటప్పుడు పొందే అనుభూతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎక్కువ వేడిగా ఉండే పదార్ధాల కంటే ఒక మోతాదులో ఉండేవే ఆరోగ్యదాయకం.
 వ్యాయామం చాలా అవసరం
 శరీరానికి శక్తిని ఇచ్చే పదార్ధాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో... విసర్జకాలను వెలువరించడం కూడా అంతే ముఖ్యం. అందుకు వ్యాయామం ఒక్కటే సాధనం. ఉదయాన్నే నడక , ఏరోబిక్ ఎక్సర్‌సైజులు, యోగాసనాలు వంటివి విధిగా చేసే వాళ్లు ఆహారంపై  పెద్దగా ఆంక్షలు పెట్టవలసిన పని లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేనప్పుడే ఆహారంపై ఆంక్షలు తప్పనిసరి. ఆహారంలో ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 పాల కూర...
 ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. రోజూ పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి దోహదం చేస్తుంది.

జొన్నలు
అన్నం, రొట్టెలు వంటి ఆహార పదార్ధాలతో పాటు, వారానికి ఒక్కసారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కండరాల కదలిక బాగా ఉంటుంది. శీతాకాలంలో బాధించే ఒళ్లు నొప్పులను జొన్న ఆహారం ద్వారా సమర్ధంగా ఎదుర్కోవచ్చు. జొన్నతో చేసిన పదార్ధాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దూరంగా ఉంటాయి.

నువ్వులు...
దైనందిన ఆహారంతో పాటు నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే చలికాలంలో శరీరానికి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్ధాలను తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. నువ్వుల వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. చలికాలంలో  ఇబ్బంది పెట్టే అనేక చర్మ సమస్యలకు నువ్వులు దివ్యౌషధం.

 వేరుసెనగలు...
 వేరుసెనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. గుండెకు మేలు చేసే మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు ఎంతో మంచిది. వేరు సెన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది.

 దానిమ్మ ...
 సకల పోషకాల నిధి దానిమ్మ. రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్‌లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి... అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతాయి. హృద్రోగాల నుంచి దానిమ్మ రక్షిస్తుంది.

 డ్రైఫ్రూట్స్...
 వివిధ రకాల ఆహార పదార్ధాలతో పాటు చలికాలంలో డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవడం మరిచిపోవద్దు. అన్ని రకాల డ్రైఫ్రూట్స్ తీసుకోవచ్చు. చలి కాలంలో కావలసిన శక్తి వీటి వల్ల లభిస్తుంది. ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు స్రవించేందుకు కావలసిన వనరులు వీటిలో పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ సహజంగానైనా, ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు.

 ఆహారం ఎంపికలో జాగ్రత్తలు అవసరం
 చలికాలంలో తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి కొవ్వులు అవసరం కదా అని అధికంగా తీసుకుంటే ఇబ్బందే. అలాగని వాటికి దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. అధిక కేలరీలనిచ్చే పిజ్జాలు, బర్గర్‌ల కంటే మిల్లెట్స్ నుంచి  శక్తివంతమైన, బలవర్ధకమైన ఆహారాన్ని పొందవచ్చు. పిల్లలు,పెద్దలు మిల్లెట్స్‌ను విధిగా తీసుకోవడం మంచిది.
 -లీలాప్రసాద్, పోషకాహార నిపుణులు
 
 చిలగడ దుంపలు

 చిలగడ దుంపలు చాలా చక్కటి పోషకాహారం. ఇవి శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని ఇస్తాయి. పిల్లలు, వయోధికులకు ఎంతో అవసరం. వీటిలోని పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, సి లు, ఖనిజ లవణాలు, మాంగనీస్, రాగి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తింటే ఆ మజాయే వేరు. దీంతో చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలను దూరంగా ఉంచవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement