ఇటీవల భూత్పూర్‌లో జరిగిన సర్వేను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర బృందం సభ్యులు
సాక్షి, పాలమూరు: జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న కుష్టు వ్యాధి(లెప్రసీ) సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమానించినట్లే వేగంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. అంతరించి పోయిందనుకున్న తరుణంలో చాపకింద నీరులా వ్యాధి విస్తరిస్తున్నట్లు తేలుతుండడంతో గమనార్హం. గతనెల 28వ తేదీన సర్వే ప్రారంభించగా ఇప్పటివరకు(గురువారం వరకు) 3,89,602 గృహాలకు గాను 2,70,885 గృహాల్లో సిబ్బంది సర్వే పూర్తి చేశారు. ఈ సందర్భంగా 2,648 అనుమానిత కేసులను గుర్తించడం గమనార్హం. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే నిరక్షరాస్యులు, అవగహన లేని వారి కారణంగా వ్యాధి జిల్లాలో పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అనుమానితుల కేసులన్నీ కుష్టు వ్యాధిగా భావించలేమని.. ప్రత్యేక వైద్యపరీక్షల్లో ఇందులో ఎక్కువ శాతం సాధారణ చర్మ వ్యాధులుగా తేలే అవకాశముందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
నిఘా కరువవడంతో...
కుష్టు వ్యాధి నివారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం 2010 ముందు వరకు పని చేసింది. ప్రపంచ దేశాల్లోకెల్లా మన దేశంలోనే అధికంగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా వెల్లడైంది. దీంతో నివారణకు కేంద్ర ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతో వ్యాధి విస్తృతి గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి పది వేల మందిలో ఒక్క శాతానికి వ్యాధి(ప్రివిలెన్స్ రే టు) తగ్గింది. దీంతో రాష్ట్రంలో కుష్టు వ్యాధి విభాగాన్ని ప్రజారోగ్య శాఖలో విలీనం చేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలో నిఘా లేక నివారణ చర్యలు కొరవడ్డాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ లెప్రసీ బృందం ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న సర్వేలో వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించారు. దేశ ప్రివిలెన్స్ రేటు 2.3 శాతానికి చేరడంతో మేల్కొన్న కేంద్రం తాజాగా సర్వేకు ఆదేశించింది.
వందల్లో అనుమానిత కేసులు
జిల్లాలో వందల సంఖ్యలో కుష్టు వ్యాధి అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. సర్వే ఈనెల 4 వరకు కొనసాగించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 70శాతం కుటుంబాల్లో ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించాయి. జిల్లాలో సగటున రోజుకు 100నుంచి 120మధ్యలో అనుమానిత కేసులు నమోదవుతున్నట్లు తెలిసింది. వీటిలో సగానికి పైగా చర్మవ్యాధులు, పుండ్లు, గాయాలైన మచ్చలు ఉంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వెనుకబడిన మండలాల్లో వ్యాధి తీవ్రత బాగా ఉన్నట్లు గుర్తించారు. కాగా, ఈ సర్వే ద్వారా తేలిన అనుమానిత కేసులను ఈనెల 5నుంచి లెప్రసీ వైద్యుల బృందం ప్రత్యేకంగా పరిశీలించనుంది.
పెరగనున్న రోగుల సంఖ్య
అక్టోబర్ 22నుంచి ప్రారంభమైన సర్వే ఈనెల 4వ తేదీతో ముగుస్తుంది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఏఎన్‌ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఉదయం 6 నుంచి ఉదయం 9గంటల వరకు సర్వే చేస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 20 ఇల్లు, అర్భన్ ప్రాంతాల్లో 25ఇళ్లను పరిశీలించడానికి 3,891 మందితో 1,510 బృందాలను ఏర్పాటుచేశారు. ఇంట్లో ఉన్న ప్రతీ ఒక్కరిని శరీరంపై ఏమైనా తెల్లమచ్చలు, రాగివర్ణపు మచ్చలు ఉంటే గుర్తిస్తు న్నారు. చర్మం రంగు మారడం, మొద్దుబారి పోవడం, స్పర్శ తెలియకపోవడం వంటి సమస్యలు ఉంటే ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు.
సర్వేలో భాగంగా మహిళ, పురుష సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు ప్రతీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేస్తున్నారు. అక్టోబర్ 22నుంచి నిర్వహిస్తున్న కుష్టు గుర్తింపు సర్వేకు ముందు ఈ వ్యాధి బాధితులు జిల్లాలో 74మంది ఉండగా ఈ సర్వే అనంతరం గణనీయంగా పెరిగే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 2,648 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరికీ ఈనెల 5న వైద్య బృందాలు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేయనున్నాయి. ఈ పరీక్షల సందర్భంగా ఎక్కువ శాతం సాధారణ చర్మవ్యాధులుగా తేలుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే మంచిదే కానీ.. వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే మాత్రం నివారణ చర్యల్లో వేగం పెంచాల్సి ఉంటుంది.
ఇలా వ్యాపిస్తుంది
కుష్టు వ్యాధి ‘మైక్రో బ్యాక్టీరియం లెప్రీ’ సూక్ష్మ క్రిమి ద్వారా సంక్రమిస్తోంది. ఇది చాలా సందర్భాల్లో అంటువ్యాధి. వ్యాధి సోకిన తర్వాత దాని ప్రభావం రెండు నుంచి మూడేళ్ల వరకు కనిపించదు. వచ్చిన వెంటనే గుర్తించకపోతే నష్టం జరుగుతుంది. వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లాలాజలం తుంపర్ల ద్వారా ఇతరులకు కూడా సోకుతుంది. రోగితో సన్నిహితంగా మెలిగినా వచ్చే అవకాశముంది. వయస్సు భేదం లేకుండా అందరికీ వ్యాపించే కుష్టు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి త్వరగా వ్యాపి చెందే అవకాశముంది.
విస్తృత ప్రచారం చేస్తాం
జిల్లా వ్యాప్తంగా కుష్టు వ్యాధి పై విస్తృతంగా ప్రచారం చేసి అపోహలను తొలగించడానికి కృషి చేస్తాం. ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆదివారంతో ముగియనుంది. ఎన్ని అనుమానిత కేసులు వస్తాయి, వాటిలో ఎన్ని నిర్ధారణ అయితాయో చూడాల్సి ఉంది. అనుమానిత కేసులు అధికంగా వస్తున్నా ప్రత్యేక పరిశీలనలో అవి సాధారణ చర్మవ్యాధులుగా వెల్లడవుతాయని నమ్మకం. – డాక్టర్ రజిని, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment