టీకా వేయకున్నా వేసినట్టుగా ఎస్సెమ్మెస్‌లు! | Telangana: Vaccination Certificate Generated Without Getting Vaccinated | Sakshi
Sakshi News home page

టీకా వేయకున్నా వేసినట్టుగా ఎస్సెమ్మెస్‌లు!

Published Sat, Dec 11 2021 4:23 AM | Last Updated on Sat, Dec 11 2021 12:55 PM

Telangana: Vaccination Certificate Generated Without Getting Vaccinated - Sakshi

ఇది ఇద్దరి సమస్య కాదు.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలకు ఇలా వ్యాక్సిన్‌ వేసుకోకున్నా వేసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. ఉత్త మెసేజీలే కాదు.. అందులోని లింకును క్లిక్‌ చేస్తే వ్యాక్సినేషన్‌ పూర్తయినట్టు సర్టిఫికెట్లు కూడా డౌన్‌లోడ్‌ అవుతుండటం కలకలం రేపుతోంది. తొలిడోసు తర్వాత నిర్దేశిత గడువు పూర్తయినా రెండో డోసు తీసుకోని వారితోపాటు ఇంకా గడువు ఉన్నవారికి, అసలు ఒక్క డోసు కూడా వేసుకోని వారికీ.. ఇలా ‘వ్యాక్సినేషన్‌’ మెసేజీలు, సర్టిఫికెట్లు రావడం ఆందోళనకరంగా మారింది.

ప్రభుత్వం పెట్టిన 100% వ్యాక్సినేషన్‌ లక్ష్యం కోసం కొందరు వైద్య సిబ్బంది ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ‘ఫేక్‌ వ్యాక్సినేషన్‌’ వ్యవహారంపై ‘సాక్షి’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో కీలక అంశాలు వెలుగు చూశాయి. దీనిపై ప్రత్యేక కథనం..    
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌  

రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్‌ చేపడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని వైద్యారోగ్య శాఖకు లక్ష్యంగా నిర్దేశించింది. తక్కువగా వ్యాక్సినేషన్‌ జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్వయంగా పర్యటిస్తున్నారు.

ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు కూడా. కానీ టీకాలు వేసుకోకున్నా వేసుకున్నట్టుగా మెసేజీలు వస్తుండటం, సర్టిఫికెట్లు కూడా డౌన్‌లోడ్‌ అవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకిలా జరుగుతోందన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవడంతో.. జనంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

రెండో డోసు వేసుకోని వారివే.. 
రాష్ట్రవ్యాప్తంగా టీకా వేసుకునేందుకు 18ఏళ్లు పైబడిన అర్హులు 2,77,67,000 మంది ఉన్నారు. ఇందు లో ఇప్పటివరకు 94 శాతం మంది తొలి డోసు తీసుకున్నారని, రెండు డోసులూ తీసుకున్నవారు 51 శాతమేనని  వైద్యారోగ్య శాఖ లెక్కలు చెప్తున్నాయి. ఒక్కడోసు కూడా వేసుకోని వారు ఆరు శాతం, రెండో డోసు వేసుకోనివారు 49శాతం మంది ఉండటం.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ముంచుకొస్తుందనే అంచనాలతో.. రాష్ట్రం వంద శాతం వ్యాక్సినేషన్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది.

ఈ మేరకు వైద్యారోగ్య శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రెండో డోసు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడంతో జిల్లాల్లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది అడ్డదారి పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి, రెండో డోసు మధ్య గడువు (కోవాగ్జిన్‌ టీకాకు 6 నుంచి 8 వారాలు, కోవిషీల్డ్‌ టీకాకు 12 నుంచి 16 వారాలు) దాటినా వ్యాక్సిన్‌ వేసుకోని వారిని గుర్తించి.. వారికి టీకా వేసినట్టుగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్టు సమాచారం. 

ఒక్కోచోట ఒక్కో సమాధానం: రెండో డోసు తీసుకోకున్నా వేసుకున్నట్టు మెసేజీలు వచ్చినవారు అయోమయానికి గురవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వారికి ఒక్కోచోట ఒక్కో సమాధానం వస్తోందని చెప్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ పీహెచ్‌సీ సిబ్బంది దీనిపై స్పందిస్తూ..‘‘ఆటోమేటిక్‌ అప్‌డేట్‌ చేశాం.. రెండో డోసు వేసుకోలేదా.. ఇప్పుడు వేసుకో..’’ అని సమాధానం ఇచ్చినట్టు బాధితుడు తెలిపారు.

మరోచోట వైద్య సిబ్బందిని అడిగితే.. ‘‘టీకా వేసుకోని వారిని అలర్ట్‌ చేసేందుకే ఇలా మెసేజీలు పెడుతున్నాం’’ అని పేర్కొనడం గమనార్హం. ‘‘రెండో డోసు వేసుకోకున్నా మెసేజీ వచ్చిన వారికి మళ్లీ రెండో డోసు ఇస్తాం. తప్పిదాన్ని సవరిస్తాం..’’ అని నిజామాబాద్‌ జిల్లాలోని ఓ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది చెప్పారు.  


జనగామ జిల్లా కేంద్రంలోని కుర్మవాడకు చెందిన పన్నీరు మంజుల ఈమె. జూన్‌ 28న జిల్లా ఆస్పత్రిలో మొదటి డోసు టీకా వేసుకున్నారు. రెండో డోసు ఇంకా తీసుకోలేదు. కానీ నవంబర్‌ 11న రెండో డోసు తీసుకున్నట్టు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. ఇదేమిటని వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. మరి తనకు రెండో డోసు టీకా వేస్తారో తెలియడం లేదని మంజుల ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


ఈ చిత్రంలోని వ్యక్తి నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన తోట చంద్రశేఖర్‌. ఈ ఏడాది ఆగస్టు 2న స్థానిక పీహెచ్‌సీలో కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాడు. నిర్దేశిత గడువు పూర్తయినా.. వ్యవసాయ పనులు ఉండటంతో రెండో డోసు తీసుకోలేదు. అయితే నవంబర్‌ 18న ఆయన రెండో డోసు తీసుకున్నట్టుగా ఎస్సెమ్మెస్‌ రావడంతో ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి, రెండో డోసు వేస్తారా, లేదా అని వాపోతున్నాడు.  


వ్యాక్సిన్‌ తీసుకోకున్నా.. 
నేను ఇప్పటివరకు మొదటి డోసు వ్యాక్సిన్‌ కూడా తీసుకో లేదు. కానీ గత నెల 11న నేను టీకా తీసుకున్నట్టు మెసేజ్‌ వచ్చింది. పీహెచ్‌సీలో ఉన్న వైద్య సిబ్బందిని కలిసి అడిగితే.. ఎవరూ సమాధానం చెప్పలేదు. 
– కొండ్ర వెంకటేశ్, పోతారం, జనగామ జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement