ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కుష్ఠు వ్యాధి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. అవగాహనలేమితో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 96 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వ్యాధిగ్రస్తుల నిర్ధారణ కోసం వైద్యారోగ్య శాఖ లెప్రసీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 22 నుంచి నవంబర్ 4 వరకూ జిల్లా వ్యాప్తంగా ఇంటింటా ఈ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాలతో పోల్చితే ఆదిలాబాద్‌లో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేటి నుంచి ఇంటింటా సర్వే చేపట్టనుంది. ఇందుకు గానూ 1062 బృందాలను ఏర్పాటు చేశారు.
ఒక్కో బృందంలో ఆశా కార్యకర్త, వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి వయస్సుతో సంబంధం లేకుండా ఒంటిపైన ఏవైన స్పర్శలేని మచ్చలు ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తారు. కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి సమాచారం అందించి వైద్య పరీక్షలు చేయిస్తారు. గతంలో కుష్ఠు వ్యాధికి సంబంధించి ప్రత్యేక వైద్యం కోసం కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం సాధారణ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయడంతో చాలా మంది పరీక్షలు చేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. పదివేల జనాభాలో ఒకరికంటే తక్కువ వ్యాధిగ్రస్తులు ఉంటే కుష్టు వ్యాధి అదుపులో ఉన్నట్లు. అయితే ప్రస్తుతం జిల్లాలో 1.37శాతం వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
అవగాహన లేమితోనే..
కుష్ఠు వ్యాధిపై అవగాహన లేకపోవడంతోనే వ్యాధి ప్రబలుతుందని తెలుస్తోంది. అంటు వ్యాధి అని ప్రజల్లో అవగాహన కల్పిస్తే ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన సర్వేలో జిల్లాలో 60 మందికి కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాగా, ప్రస్తుతం ఈసారి 96 మందికి వ్యాధి సోకినట్లు అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా దాదాపు 500ల వరకూ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఉంటుందని భావిస్తున్నారు.
కుష్ఠు వ్యాధి అంటే..
కుష్ఠు వ్యాధి మైకోబ్యాక్టీరియం లెప్రీయ అనే బ్యాక్టీరియాతో సోకుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాప్తి చెందుతోంది. సరైన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ఒకరినుంచి మరొకరికి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. శరీరంపై ఒకటి నుంచి ఐదు స్పర్శలేని మచ్చలుంటే పాసిబ్యాసెల్లరింగ్ అని పేర్కొంటా రు. దీని నివారణకు ఆరు నెలల వరకూ చికిత్స అందిస్తారు. ఆరు కంటే ఎక్కువ మచ్చలుండి, నరాలు ఉబ్బితే మల్టీ బ్యాసిలరిగా నిర్ధారిస్తారు. దీని నివారణకు సంవత్సరం వరకూ చికిత్స అందిస్తారు. ఈ వ్యాధి సోకిన తర్వాత 3 నుంచి 15 సంవత్సరాల తర్వాత దుష్పరిణామాలు బయటపడతాయి. తొలి దశలో వ్యాధిని నిర్ధారించుకుని చికిత్స పొందితే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. శరీరంలో ఎరుపు రంగు, రాగి రంగు మచ్చలు స్పర్శ లేకుండా ఉంటే వ్యాధి ఉన్నట్లు నిర్ధారిస్తారు.
జిల్లాలోని జైనథ్ మండలంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. ఇది వరకూ చికిత్స పొందిన వారు దాదాపు 2వేలకు పైగా ఉన్నారని వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ, గిమ్మ, మేడిగూడ, కౌట, దీపాయిగూడ, ఆనంద్‌పూర్, బేల మండలంలో దహెగాం, బాధి, సాంగిడి, తలమడుగు మండలంలో పల్లి(బి), పల్లి(కె), ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని చాందా(టి), యాపల్‌గూడ, మామిడిగూడ, ఇచ్చోడ మండలంలో గేర్జం, ఉట్నూర్ మండల కేంద్రంలో, ఆదిలాబాద్ పట్టణ ంలోని ఖుర్షీద్‌నగర్, హమాలీవాడల్లో ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 36వేల మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో 15వేల మంది ఉన్నారంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
నేటి నుంచి ఇంటింటా సర్వే..
కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నవంబర్ 4వ తేది వరకూ కొనసాగుతుంది. ఆశా కార్యకర్త, వాలంటీర్ ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఒంటిపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వాటిని గుర్తించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమాచారం అందిస్తారు. ఆ తర్వాత వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 1062 బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతిఒక్కరూ ఈ బృందం సభ్యులకు సహకరించాలి. జిల్లాలో ప్రస్తుతం 96 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. – శోభ పవార్,
జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ అధికారి
Comments
Please login to add a commentAdd a comment