‘కల్తీ’గాళ్లు | Adulteration Oils Nizamabad | Sakshi
Sakshi News home page

‘కల్తీ’గాళ్లు

Published Sun, Jan 13 2019 11:44 AM | Last Updated on Sun, Jan 13 2019 11:44 AM

Adulteration Oils Nizamabad - Sakshi

కల్తీ వ్యాపారాలకు కామారెడ్డి జిల్లా అడ్డాగా మారింది.. కొందరి అక్రమ సంపాదన యావ సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది!. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం మానేసిన ఫలితంగా కల్తీ మాఫియా జూలు విదుల్చుతోంది. కల్తీ కారణంగా ఆహార పదార్థాలన్నీ విషతుల్యంగా మారుతున్నాయి. నిత్యావసర వస్తువులు సహజత్వాన్ని కోల్పోయి ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నాయి. ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్ల యవ్వారం తాజాగా మరోమారు జిల్లాలో వెలుగు చూసింది. బాన్సువాడలో నకిలీ నెయ్యి తయారు చేసి, విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.  

కామారెడ్డి క్రైం: సరిగ్గా ఏడాది క్రితం.. వంటనూనె కొనేందుకు ఓ దినసరి కూలీ జిల్లా కేంద్రం లోని ఓ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి, వంటనూనె కావాలని అడిగితే సదరు వ్యాపారి కల్తీ నూనె అంటగట్టాడు. దాంతో వంట చేసుకుని భోజనం చేసిన ఆ కుటుంబం మొత్తం వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయింది. కల్తీ నూనె వ్యవ హారం బయటకు రావడంతో అధికారులు అప్ప ట్లో హడావుడి చేశారు. కల్తీ వంటనూనె విక్రయిం చిన దుకాణంతో పాటు మరికొన్ని దుకాణాల్లో తనిఖీలు చేసి, చేతులు దులుపుకున్నారు. అన్నీ తెలిసినా ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తేగానీ కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం అప్పట్లో దాడులు నిర్వహించి తామేదో మొత్తం కల్తీలను అరికట్టినట్లు ఫోజులిచ్చేసింది.

ఇక ఆ వ్యవహారాన్ని అక్కడితో ముగించేసింది. అయితే, వాస్తవాల్లోకి వెళితే మార్కెట్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. తినే తిండి, వస్తువులన్నీ కల్తీమయం గా మారాయి. కల్తీ ఆహార పదార్థాలు, వస్తువుల వినియోగంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపం లా మారుతున్నాయి. పాలు, నూనె, నెయ్యి, పప్పు దినుసులు, పండ్లు ఇతర నిత్యావసరాలన్నీ కల్తీ అవుతున్నాయి. నియంత్రించే వారు లేకపోవడంతో కల్తీగాళ్ల వ్యాపారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది. మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడం మానేశారనే ఫిర్యా దులున్నాయి. తాజాగా బాన్సువాడలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం.

విషతుల్యంగా నిత్యావసరాలు.. 
బాన్సువాడ పట్టణంలో వెలుగుచూసిన నకిలీ నెయ్యి తరహాలోనే జిల్లా కేంద్రంలోనూ కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నట్లుగా సమాచారం. కొత్త బస్టాండ్‌ ప్రాంతంలోని ఓ కిరాణ దుకాణం, గంజ్‌ ప్రాంతంలోని పలు కిరాణ దుకాణాల నుంచి నిత్యం పెద్ద మొత్తంలో వనస్ప తి (డాల్డా) ప్యాకెట్లు వెళ్తుంటాయి. వాటిని నకిలీ నెయ్యి తయారీకే ఉపయోగిస్తారనే విషయం బహిరంగ రహస్యం. జిల్లా కేంద్రంలో గల్లీ గల్లీలోనూ పాల విక్రయ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో పాలు చిక్కగా, ఆకర్షణీయంగా ఉండేందుకు పలు రకాల రసాయనాలు, పౌడర్లు కలుపుతున్నారనే ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నా యి. కారంపొడి, పసుసులను కల్తీ చేయడానికి తక్కువ ధరలో వచ్చే పిండి పదార్థాలు, రంగు కోసం పౌడర్లు, చెక్క పొడి వాడుతున్నారు.

కంది పప్పులో సోయా పప్పు, మిరియాలలో బొప్పా యి విత్తులు కలిపేస్తారు. ఇక, కామారెడ్డి కల్తీ నూనెల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ 3–4 వంట నూనెల తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటి నుంచి ఐదారు జిల్లాలకు వివిధ రకాల కంపెనీల పేర్లతో మంచి నూనె ప్యాకెట్లు సరఫరా అవుతున్నాయి. నాసిరకం నూనె పదార్థాలను కలుపుతూ అనుమానం రాకుండా ఉండేందుకు రసాయనాల ను వినియోగిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇవే కాకుండా కిరాణ దుకాణాల్లో చిన్న పిల్లలు కొనుక్కునే తినుబండారాలు తయారు చేసే కేంద్రాలు కామారెడ్డిలో రెండు,మూడు చోట్ల ఉన్నాయి. వా టిపై అధికారుల కనీస పర్యవేక్షణ లేదు. అపరిశుభ్ర వాతావరణంలో తినుబండరాలు తయారు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

మామూళ్ల మత్తులో అధికారులు! 
కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి లాంటి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ నిత్యం పెద్ద మొత్తంలో వ్యాపారాలు సాగుతుంటాయి. ప్రతి రోజు రూ.కోట్లల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రధాన పట్టణాల్లో, ముఖ్యంగా కామారెడ్డిలో జీరో దందా ఎక్కువగా నడుస్తోంది. అధికారుల కనుసన్నల్లోనే నకిలీ వ్యాపారాలు నడుస్తున్నాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు మిగతా సమయాల్లో నకిలీ ఆహార పదార్థాలు, వస్తువులపై కనీస పర్యవేక్షణ చేపట్టడం లేదు. మాముళ్లే అందుకు కారణమనేది బహిరంగ సత్యం. ఈ వ్యవహారంపై జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి నాగరాజు వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

అన్నింటా కల్తీయే..! 
జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీ వ్యాపారాలు జోరుగా నడుస్తున్నాయి. తాగే పాలను, తినే తిండిని సైతం వదలడం లేదు. ఉప్పులు, పప్పులు, పసుపు, కారంపొడి, చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, టీపొడి, నూనెలు.. ఇలా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు. గతంలో వంటకు ఉపయోగించే ఆహార పదార్థాలకు ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న ఆహార పదార్థాలకు వ్యత్యాసం ఎంతగానో ఉంది. ఎంత ప్రయత్నించినా వంటలు రుచిగా కావడం లేదు అని మాత్రమే వినియోగదారులు ఆలోచిస్తున్నారు. దానికి కారణం ఆహార పదార్థాల్లో కల్తీలేనని గుర్తించినా ఏమీ చేయలేని పరిస్థితి వారిది. రుచి మాట పక్కన పెడితే విలువైన ఆరోగ్యానికి హాని జరుగుతుందనేది వాస్తవం. ధనార్జనే లక్ష్యంగా నడుస్తున్న నకిలీ వ్యాపారాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement