అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించాల్సొచ్చింది.
భారత్ సైతం ఎయిర్‌పోర్ట్‌లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్‌ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.
ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్‌ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి.
పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట.
మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్‌కూ జనం భయపడుతున్నది అందుకే!
ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్‌పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు.
ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్‌కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్‌లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది.
అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!
మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి.
రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్‌ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్‌ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్‌లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం.
సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది.
అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్‌ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి.
టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్‌లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్!
మాయరోగం... మరోసారి!
Published Wed, Aug 28 2024 4:38 AM | Last Updated on Wed, Aug 28 2024 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment