
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో ఇప్పటివరకూ 780 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కోవిడ్ కథ ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసుస్ హెచ్చరించారు. మహమ్మారిని జయించేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సరైన చర్యల ద్వారా కోవిడ్‌ను కట్టడి చేయవచ్చని గత కొంత కాలంగా నిరూపితమైందని చెప్పారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి ఉన్న శక్తిమంతమైన ఆయుధం వ్యాక్సిన్ ఒక్కటే కాదన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, వైరస్ సోకిన వారిని ట్రాక్ చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ద్వారా కూడా కరోనాను కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు.
జనవరి, ఫిబ్రవరిలో దాదాపు 6 వరుస వారాల పాటు కరోనా కేసులు తగ్గాయని, అనంతరం ఇప్పుడు ఏడు వరుస వారాల పాటు కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. అంతేగాక గత నాలుగు వారాల నుంచి మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించారు. ఆసియా, మధ్యాసియాలోని పలు ప్రాంతాల్లో కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. కోవిడ్ కేవలం పెద్దవారిని మాత్రమే కాదని, యువతీయువకులను సైతం అది కబళిస్తోందని తెలిపారు. దాన్ని కేవలం జలుబు అని కొట్టిపారేయవద్దని హెచ్చరించారు. వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడం, సరైన కరోనా నిబంధనలను పాటించడం ద్వారా కొద్ది నెలల్లోనే మహమ్మారి నుంచి బయటపడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.