Sanofi
-
సనోఫీ హెల్త్‌కేర్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న ఫ్రెంచ్ సంస్థ సనోఫీ భారత్‌లో సుమారు రూ.3,655 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ) కోసం 2030 నాటికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సనోఫీ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాడలిన్ రోచ్ వెల్లడించారు. ఇందులో రూ.914 కోట్లు వచ్చే ఏడాదికల్లా వ్యయం చేస్తామని చెప్పారు. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సనోఫీ జీసీసీ నూతన భవనాన్ని బుధవారం ప్రారంభించిన సందర్భంగా రోచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంలో ప్రస్తుతం 1,000 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కొత్త ఫెసిలిటీకి 2,600 మంది ఉద్యోగులు కూర్చునే సామర్థ్యం ఉందన్నారు. -
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
Corona Vaccine: సనోఫీ–జీఎస్కే వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్
న్యూఢిల్లీ: సనోఫీ పాయిశ్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–జీఎస్కే ఫార్మాస్యూటికల్ కంపెనీ సంయుక్తంగా కొవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది ప్రోటీన్ ఆధారితం. తాజాగా ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఈ దశలో టీకా భద్రత, సమర్థత, కరోనా వైరస్‌పై పనితీరును క్షుణ్నంగా పరీక్షించనున్నారు. భారత్‌తోపాటు అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో 35,000కు పైగా వలంటీర్లపై తమ టీకా ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సనోఫీ సంస్థ కంట్రీ హెడ్ అన్నపూర్ణ దాస్ చెప్పారు. ఇందుకోసం 18 ఏళ్లు పైబడిన వలంటీర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక టీకా అభివృద్ధి విషయంలో మూడో దశ ట్రయల్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌లో మార్పులు కొనసాగుతున్నాయని, కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు. -
కరోనా టీకా కోసం రూ.15,725 కోట్లు
లండన్: కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధపడుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తి, సరఫరా కోసం 2.1 బిలియన్ డాలర్లు(రూ.15,725 కోట్లు) వెచ్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్కే), సనోఫీ పేశ్చర్‌లతో ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఈ ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని జీఎస్కే, సనోఫీ ప్రకటించాయి. దీర్ఘకాలంలో మరో 50 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచుకోవాలని అమెరికా సర్కారు యోచిస్తోంది. బ్రిటన్‌కు చెందిన జీఎస్కే, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 6 కోట్ల కరోనా డోసుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం గత వారం ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉందని, ఒక్క సంస్థ మాత్రమే ఈ డిమాండ్‌ను తీర్చలేదని సనోఫీ కంపెనీ ప్రతినిధి థామస్ ట్రియోంఫ్ చెప్పారు. చాలా కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కరోనా సోకిన తొలి శునకం మృతి అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారినపడ్డ మొదటి శునకం ‘బడ్డీ’ శుక్రవారం చనిపోయింది. జర్మన్ షెఫర్డ్ డాగ్ అయిన బడ్డీకి కరోనా సోకినట్లు జూన్‌లో ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. దేశంలో కరోనా బాధిత తొలి శునకం ఇదేనని ప్రకటించారు. అంతకంటే ముందు దాని యజమాని రాబర్ట్ మహనీకి కరోనా సోకింది. ఈ వైరస్ వ్యాప్తికి జంతువులు వాహకాలుగా మారుతాయనడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పారు. అయితే, మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వియత్నాంలో ‘తొలి’ కరోనా మరణం హనోయ్: వియత్నాంలో తొలిసారిగా ఓ వృద్ధుడు(70) కరోనాతో మరణించాడు. అతడికి కరోనా సోకడంతోపాటు కిడ్నీవ్యాధితో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డా నాంగ్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశాడని మీడియా ప్రకటించింది. అయితే, ఈ మరణాన్ని వియత్నాం అధికారికంగా గుర్తించలేదు. వరుసగా 99 రోజులుపాటు కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని దేశంగా వియత్నాం రికార్డ్ సృష్టించింది. కరోనాపై పోరాటంలో ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వియత్నాంలో గత వారం రోజుల్లో 90కిపైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య శాఖ అధికారి తెలిపారు. -
కేటీఆర్‌తో సనోఫి బృందం భేటీ..
సాక్షి, హైదరాబాద్: నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సనోఫి వంటి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా రూపాంతరం చెందిందని, ఇక్కడ వ్యాక్సిన్ తయారీ, సంబంధిత రంగా ల్లో అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్‌లను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను మంత్రి వివరించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న సాంకేతికత, అద్భుత మైన మానవ వనరుల నేపథ్యంలో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి వినూత్న రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గురువారం ప్రగతిభవన్‌లో ప్రముఖ ఫార్మా కంపెనీ సనోఫి అంతర్జాతీయ భాగస్వామ్యాల అధిపతి (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైట్స్, పార్టనర్షిప్స్) ఫాబ్రయ్స్ జెఫ్రాయ్, భారత్, దక్షిణాసియా జనరల్ మేనేజర్ అన్నపూర్ణ దాస్‌లు మంత్రితో సమావేశమయ్యారు. వీరితో పాటు శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి కూడా ఉన్నారు. 2021 సంవత్సరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు చేపడుతోందని, ఇప్పటికే అనేక ఫార్మా కంపెనీలు తమతో భాగస్వాములు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. భవిష్యత్తులో సనోఫి కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. తెలంగాణలో సనోఫి కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై సనోఫి సానుకూలత వ్యక్తం చేసింది. సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
మరో కొనుగోలుకు టొరెంటో..
ముంబై : ఇటీవలే యూనికెమ్ ల్యాబోరేటరీస్‌ను కొనుగోలు చేసి, టాప్-5 ఫార్మా దిగ్గజంగా పేరు తెచ్చుకున్న టోరెంటో ఫార్మాస్యూటికల్స్, మరో యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ యూనిట్ కొనుగోలుకు సిద్ధమైంది. సనోఫి యూరోపియన్ జనరిక్స్ బిజినెస్ జెంటివా ఎన్.వీని రూ.16వేల కోట్లకు టోరెంటో కొనుగోలు చేస్తున్నట్టు న్యూస్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ కొనుగోలులో టోరెంటో విజయం సాధిస్తే, కంపెనీకి అతిపెద్ద లావాదేవీ ఇదే కానుంది. ఫండింగ్ కోసం ఇప్పటికే టోరెంటో పలు దేశీయ, విదేశీ బ్యాంకులతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. 28 మార్చి వరకు అన్ని ఫండింగ్ అరెంజ్మెంట్లు కూడా పూర్తి కానున్నాయి. జెంటివాను సనోఫి 2009లో కొనుగోలు చేసింది. జెంటీవా ప్రస్తుతం యూరప్‌లో మూడో అతిపెద్ద జనరిక్స్ కంపెనీ. 50 మార్కెట్లలో జెంటివా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈబీఐటీడీఏల తర్వాత జెంటివా ఆదాయాలు 150 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. టోరెంటో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న విలువ తన ఈబీఐటీడీఏల కంటే 13 సార్లు ఎక్కువగా ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ సేల్ ప్రక్రియను విజయవంతంగా ముగించడానికి సనోఫి, జేపీ మోర్గాన్, రోథ్స్చైల్డ్ అండ్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీని నియమించుకుందని తెలుస్తోంది. -
అయిదేళ్లలో రూ.500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న పిల్లల్లో డిఫ్తీరియా తదితర వ్యాధుల నివారణకు ఉపయోగపడే శాన్5 టీకాల విక్రయాల ద్వారా.. వచ్చే అయిదేళ్లలో దాదాపు రూ. 500 కోట్ల ఆదాయాన్ని శాంతా బయోటెక్నిక్స్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాక్సిన్లకు ఏటా 200 మిలియన్ డోసుల మేర డిమాండ్ ఉంటోంది. శాన్5 పెంటావాలెంట్ వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యూహెచ్వో) ప్రీ-క్వాలిఫైడ్ గుర్తింపును పునరుద్ధరించడంతో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. ఈ గుర్తింపుతో మరోసారి ఐక్యరాజ్యసమితి పరిధిలోని యూనిసెఫ్ తదితర ఏజెన్సీలు, వివిధ దేశాలకు ఈ టీకాలను సరఫరా చేసేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా శాంతా బయో నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేఐ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. డిఫ్తీరియా, కోరింత దగ్గు, టెటనస్, హెపటైటిస్-బి మొదలైన వాటి అయిదు వ్యాధుల నివారణకు ఈ టీకాలు ఉపయోగపడతాయని వరప్రసాద్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి శాన్5ని శాంతా బయో 2008లోనే ప్రవేశపెట్టింది. అయితే, 2010లో స్వల్ప సాంకేతిక సమస్యల కారణంగా ఈ 5-ఇన్-1 టీకా ప్రీ-క్వాలిఫైడ్ గుర్తింపు కోల్పోయిందని వరప్రసాద రెడ్డి తెలిపారు. దీని వల్ల సుమారు రూ. 1,500 కోట్ల విలువ చేసే ఆర్డర్లు కోల్పోయినట్లయిందన్నారు. అలాంటి కీలక తరుణంలో సనోఫీ సంస్థ శాంతా బయోకు గణనీయమైన తోడ్పాటు అందించిందని వరప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్నుంచి సనోఫీ దాదాపు రూ. 1,000 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేసిందని, ప్రస్తుతం శాంతా బయోలో సనోఫీకి 98 శాతం మేర వాటాలు ఉన్నాయని ఆయన వివరించారు. దాదాపు నాలుగేళ్ల పాటు శ్రమించి శాన్5కి మళ్లీ డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు సాధించగలిగామని శాంతా బయో సీఈవో హరీశ్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ వ్యవధిలో నాణ్యతా ప్రమాణాల వ్యవస్థను మరింత పటిష్టం చేసుకున్నామని, ఉద్యోగుల సంఖ్యను 550 నుంచి సుమారు 850కి పెంచుకున్నామని ఆయన తెలిపారు.