న్యూఢిల్లీ: సనోఫీ పాయిశ్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–జీఎస్‌కే ఫార్మాస్యూటికల్ కంపెనీ సంయుక్తంగా కొవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది ప్రోటీన్ ఆధారితం. తాజాగా ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతి మంజూరు చేసింది.
ఈ దశలో టీకా భద్రత, సమర్థత, కరోనా వైరస్‌పై పనితీరును క్షుణ్నంగా పరీక్షించనున్నారు. భారత్‌తోపాటు అమెరికా, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో 35,000కు పైగా వలంటీర్లపై తమ టీకా ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సనోఫీ సంస్థ కంట్రీ హెడ్ అన్నపూర్ణ దాస్ చెప్పారు. ఇందుకోసం 18 ఏళ్లు పైబడిన వలంటీర్లను నియమించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇక టీకా అభివృద్ధి విషయంలో మూడో దశ ట్రయల్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌లో మార్పులు కొనసాగుతున్నాయని, కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment