మృత శిశువు, డాక్టర్ తిరుపాలుతో వాగ్వాదానికి దిగిన బాధితులు
చీరాల రూరల్: చీరాల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు చేసే పనిని నర్సులు చేస్తుండడంతో పుట్టిన పండంటి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రసవం కోసం వచ్చిన నిండు గర్భిణికి నర్సులు వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి పండంటి మగబిడ్డ మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక ఏరియా వైద్యశాలలో జరిగింది. న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ప్రాంగణంలో బాధితులు ఆందోళనకు దిగారు.
ఇదీ..జరిగింది
స్థానిక జాన్‌పేటకు చెందిన జొన్నలగడ్డ స్పందన, అశోక్‌కుమార్ దంపతులు. స్పందన నిండు గర్భిణి. మూడో కాన్పు కోసం ఆమె భర్త, బంధువులు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. గతంలో ఆమె మొదటి కాన్పు కూడా ఇదే ఆస్పత్రిలో చేశారు. అప్పుడు వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. రెండో కాన్పు కూడా గతంలో ఇదే ఆస్పత్రిలో జరిగింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమెను గుంటూరు తరలించారు. అక్కడే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతవరకూ ఓకే.. మూడో కాన్పు కోసం ఆమెను భర్త, బంధువులు కలిసి ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న నర్సులు కాన్పు చేసేందుకు ప్రయత్నించారు. 10 గంటల సమయంలో
డ్యూటీకి వచ్చిన వైద్యులు ఆమెను గమనించి పరిస్థితి విషమంగా ఉందని, మిమ్మల్ని ఎవరు వైద్యం చేయమన్నారని సిబ్బందిని మందలించారు. వైద్యులు వైద్యం చేసేందుకు ప్రయత్నించిన కొద్ది సేపటికే మగబిడ్డ చనిపోయింది.
బయటకు వెళ్లాలని ఆదేశం
బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. ఆస్పత్రి సిబ్బంది ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డను తీసుకుని త్వరగా బయటకు వెళ్లాలని కేకలేశారు. తన కుమారుడు ఎందుకు చనిపోయాడంటూ తండ్రి అశోక్‌కుమార్‌తో పాటు అతని బంధువులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలు వద్ద వాపోయారు. ఉదయం 6:30 గంటలకు ఆస్పత్రికి వస్తే వైద్యులు రాలేదని, నర్సులు వైద్యం చేసేందుకు ప్రయత్నించారని, దాని కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపించారు. రెండో కాన్పు కోసం తన భార్యకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారని, ఇదే విషయాన్ని నర్సులకు కూడా చెప్పామని, వారు సాధారణ కాన్పు చేసి బిడ్డను తీస్తామని చెప్పి అన్యాయంగా చంపేశారని కన్నీటిపర్యంతమయ్యాడు. బాధితులు తహసీల్దార్ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను విచారించారు. సంఘటన జరిగిన సమయంలో తాను లేనని, విచారించి తగు చర్యలు తీసుకుంటానని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment