ఇదేం సర్కారు వైద్యం ! | doctors negligance in government hospital | Sakshi
Sakshi News home page

ఇదేం సర్కారు వైద్యం !

Published Sat, Feb 25 2017 12:19 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఇదేం సర్కారు వైద్యం ! - Sakshi

ఇదేం సర్కారు వైద్యం !

–‘అత్యవసర’ చికిత్స కోసం సర్వజనాస్పత్రికి బాలుణ్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు
– సర్జికల్‌ వార్డులో అడ్మిషన్‌.. పత్తాలేని డాక్టర్‌
– ప్రైవేట్‌కు రెఫర్‌ చేసిన హౌస్‌సర్జన్లు
– కమీషన్‌ కోసం సిబ్బంది, అంబులెన్స్‌ నిర్వాహకుల కక్కుర్తి


ప్రాణాపాయ స్థితిలో బిడ్డ.. అడ్మిషన్‌ పుస్తకం కోసం వెళితే కౌంటర్‌లో పత్తాలేని సిబ్బంది.. ఏం చేయాలో తెలీక రోదిస్తూ నిలబడిపోయిన తల్లి.. కొడుకు పరిస్థితి చూసి ‘ఓరి దేవుడా’ అంటూ కుప్పకూలిన తండ్రి.. వార్డులో  జాడలేని వైద్యుడు.. ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్తామంటూ అంబులెన్స్‌ నిర్వాహకుల హడావుడి.. కమీషన్‌ సంగతేంటని సిబ్బంది గోల.. ఇదీ జిల్లాకే తలమానికంగా ఉన్న సర్వజనాస్పత్రిలో దుస్థితి.

అనంతపురం మెడికల్‌ : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.  ప్రాణాలు కాపాడండయ్యా అని బాధితులొస్తే.. ప్రైవేట్‌కు వెళ్లండయ్యా అంటూ పంపించేస్తున్నారు. శుక్రవారం జరిగిన ఓ ఘటన బాధిత కుటుంబ సభ్యులనే కాకుండా అక్కడున్న వారినీబాధించింది. ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన హసేన్, పర్వీన్‌ దంపతుల కుమారుడు ఇబ్రహీం (8) గురువారం సాయంత్రం ఇంటి వద్ద పిల్లలతో కలిసి ఎద్దుల బండిపై ఆడుకుంటూ కింద పడ్డాడు. ఛాతీ వద్ద చొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయింట్‌మెంట్‌ ఇచ్చి పంపాడు. అయితే.. శుక్రవారం ఉదయం పిల్లవాడికి నొప్పి అధికమైంది.

దీంతో తల్లిదండ్రులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలోకి తీసుకెళ్లి ఆక్సిజన్‌ పెట్టారు.  అడ్మిషన్‌ అవసరమని డ్యూటీ డాక్టర్‌ చెప్పడంతో పుస్తకం కోసం తల్లి కౌంటర్‌ వద్దకు వెళ్లగా..అక్కడ సిబ్బంది లేరు. పది నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఓ ఉద్యోగి పుస్తకం ఇవ్వగానే.. ఆమె అత్యవసర విభాగానికి వెళ్లింది. అక్కడి నుంచి సర్జికల్‌ వార్డుకు పంపారు. వార్డులో డ్యూటీ డాక్టర్‌ పత్తాలేరు. నలుగురు హౌస్‌సర్జన్లు ఉన్నా ఫలితం శూన్యం.  ‘నా బిడ్డను బతికించండయ్యా’ అంటూ తల్లి ప్రాధేయపడింది. దీంతో హౌస్‌సర్జన్లు డ్యూటీ డాక్టర్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. అక్కడి ఉంచి ఏం సమాధానం వచ్చిందో తెలీదు కానీ.. ‘ఇక్కడ వైద్యం చేయడానికి డాక్టర్లు లేరు.. మా మాట విని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి చిరునామాను కూడా పేపర్‌ మీద రాసిచ్చారు. ఇక్కడి పరిస్థితిని చూసి తండ్రి హసేన్‌ వార్డు బయటే కుప్పకూలిపోయి తల కొట్టుకున్నాడు.

కమీషన్‌ కోసం వాగ్వాదం
బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఒకవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా..మరోవైపు వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ నిర్వాహకులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. అత్యవసర విభాగం వద్దకు ఈ కేసు వచ్చినప్పటి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఇద్దరు అంబులెన్స్‌ నిర్వాహకులు నీడలా వెంటాడారు. సర్జికల్‌ వార్డులో హౌస్‌సర్జన్లు ప్రైవేట్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో వైద్యసిబ్బంది బేరం మొదలుపెట్టారు. ఓ ఎఫ్‌ఎన్‌ఓ అయితే ఏకంగా అంబులెన్స్‌ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. ‘వార్డు నుంచి ఎవరు ఫోన్‌ చేశారు.. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నా. అట్ల మీరే వచ్చి తీసుకెళ్తే ఎలా? మా కమీషన్‌ సంగతేంటి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు అంతా కలిసి ఆ బాలుణ్ని ప్రైవేటు ఆస్పత్రికి పంపించివేశారు.

డాక్టర్‌ ఎవరో  తెలియదట!
సర్జికల్‌ వార్డులో డాక్టర్‌ ఎవరూ లేకపోవడంతో ఇబ్రహీం పరిస్థితిని హెచ్‌ఓడీ డాక్టర్‌ రామస్వామినాయక్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. ఆయనకు ఫోన్‌ చేయగా ‘సార్‌ సర్జరీలో ఉన్నారు’ అంటూ అవతల వ్యక్తి సమాధానం ఇచ్చారు. వార్డులో ఉన్న హౌస్‌సర్జన్లను డ్యూటీ డాక్టర్‌ ఎవరని అడగ్గా ‘తెలియదు’ అని చెప్పడం వారి బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement