పెద్దాస్పత్రి కాదు.. నిర్లక్ష్యాస్పత్రి
- నిండు ప్రాణాన్ని బలిగొన్న వైద్యుల ఉదాసీనత
- చిన్నారి మృతితో కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
- సర్వజనాస్పత్రిలో డాక్టర్ల తీరుపై సర్వత్రా విమర్శలు
అనంతపురం న్యూసిటీ: ‘నాన్న.. మదన్ లేయ్ రా బంగారు. పొద్దున్నే అమ్మా నాకు కాయ కావాలా అన్నావ్ కదనాన్నా... అన్నీ ఉన్నాయప్ప లేయ్. పొద్దున్నంతా మాట్లాడావ్... ఇక్కడికొచ్చే వారకూ బాగుంటివి కదప్పా... భగవంతుడా.. అప్పుడే నా బిడ్డకు నూరేళ్లు నిండాయా. ఏం పాపం చేశామయ్యా మేము.. మాకు ఇంత అన్యాయం చేశావు’ అంటూ 19 నెలల బిడ్డను పోగొట్టుకున్న మలకవారిపల్లి(అమడగూరు మండలం, కదిరి)కి చెందిన రమణమ్మ బోరున విలపించింది. కళ్లముందే నవమాసాలు మోసి కన్న బిడ్డ మృతి చెందడంతో ఆ తల్లి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి చిన్న పిల్లల వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డ ప్రాణం పోయిందని ఆ తల్లితో పాటు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
వైద్యుల బాధ్యతారాహిత్యం...
చిన్నారి మృతి చెందిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాల మేరకు... అమడుగూరు మండలం మలకవారిపల్లికు చెందిన సురేష్‌బాబు, రమణమ్మలు దంపతులు. వీరికి మదన్‌కుమార్ అనే 19 నెలల చిన్నారి ఉన్నాడు. మదన్‌కు ఈ నెల 13న వాంతులు అయ్యాయి. దీంతో కదిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మందులు రాసి ఇంటికి పంపారు. కడుపు ఉబ్బడంతో పాటు మూత్రం రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు కదిరి వైద్యుల సూచన మేరకు గురువారం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలోని చిన్నపిల్లల వార్డుకు వెళ్లగా అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్‌ఆర్ (సీనియర్ రెసిడెంట్) బయటకెళ్లండి ఫస్ట్ ఒకరి తర్వాత ఒకరు రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణమ్మ, సురేష్ దంపతులు మేడమ్ కడుపు ఉబ్బరంగా ఉందని చూడాలని వేడుకున్నారు.
ఓపీ టికెట్ తీసుకొనిరావాలని ఎస్‌ఆర్ వారిని ఆదేశించారు. దీంతో సురేష్‌బాబు పరుగన ఓపీ టికెట్ కోసం వెళ్లి అక్కడ అడ్మిషన్ రాయించుకుని వచ్చేందుకు వెళ్లాడు. భర్త వచ్చేలోపు పిల్లాడు కళ్లుమూతలు మూయడంతో రమణమ్మ కేకలు వేసింది. అప్పటికి తేరుకున్న ఎస్‌ఆర్ బాబుకు స్టెత్‌తో పరీక్షించగా హార్ట్ ఫంక్షనింగ్ తక్కువగా వచ్చింది. దీంతో ఊపిరి తీసుకోకపోవడంతో అంబూ ద్వారా కృత్రిమశ్వాస ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి మదన్‌కుమార్ మృతి చెందాడని తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో కుటుంబీకులు బోరున ఏడ్చుకుంటూ ఉండిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నా బిడ్డ మృతి చెందాడని రమణమ్మ ఆరోపించారు. వార్డుకు వెళ్లిన వెంటనే చూసింటే బిడ్డకు ఈ గతి పట్టేది కాదయ్యనని కన్నీరు మున్నీరైంది. చివరికి ఏమీచేయలేక సురేష్‌బాబు, రమణమ్మ దంపతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం టూటౌన్ సీఐ యల్లంరాజు, ఔట్‌పోస్టు పోలీసులు త్రిలోక్, రాము వారిని తమ సొంతూరుకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు.
మా ప్రయత్నం చేశాం - మల్లీశ్వరి ,హెచ్‌ఓడీ, చిన్నపిల్లల విభాగం
బాబు ముందుగానే మృతి చెందాడు. ఎస్‌ఆర్ సకాలంలో స్పందించి అంబూ ద్వారా కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా ప్రయత్నం మేం చేశాం. వైద్యుల తప్పేమీ లేదు.