పోయిన చిన్నారి ప్రాణం
- హృదయ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
- రంగంలోకి దిగిన పోలీసులు
అనంతపురం మెడికల్ : అనంతపురం సాయినగర్‌లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలైంది. తమ బిడ్డ మరణానికి కారణమైన ఆస్పత్రి యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గార్లదిన్నె మండలం పాత కల్లూరుకు చెందిన భాగ్యలక్ష్మీ, ఉదయ్‌కుమార్ దంపతులకు మూడు నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. మంగళవారం ఉదయం జ్వరం రావడంతో అనంతపురం సాయినగర్‌లోని హృదయ చిన్న పిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన డాక్టర్ శ్రీనివాసులు.. నాలుగు రకాల మందులు ఇచ్చారు.
ఇంటికెళ్లి మందులు వేయగానే చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ వెంటనే ఆటోలో అనంతపురానికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. డాక్టర్ ఇచ్చిన మందులు వేయడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రికి వచ్చి డాక్టర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అంతలోనే టూటౌన్ పోలీసులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. ఆస్పత్రి వద్ద గొడవ చేయడం తగదని, ఏదైనా ఉంటే స్టేషన్‌లో కేసు పెట్టాలని సూచించారు. అయినా వారు ససేమిరా అంటూ ఆందోళన కొనసాగించారు. బిడ్డ మృతదేహంతో తల్లి కన్నీరు పెడుతుంటే అక్కడున్న వారి హృదయాలు చలించిపోయాయి. ఘటనపై డాక్టర్ శ్రీనివాసులును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘పాల పొర పోవడం వల్లే బిడ్డ చనిపోయినట్టున్నాడు. పోస్టుమార్టం చేస్తే వాస్తవాలు తెలుస్తాయి’ అని అన్నారు.