11 Years Old Child Died Due To Snake Bite In Kurnool, Details Inside - Sakshi
Sakshi News home page

Kurnool: పాముకాటుకు తల్లడిల్లి తనువు చాలించిన చిట్టితల్లి

Published Tue, Jun 28 2022 12:58 PM | Last Updated on Tue, Jun 28 2022 4:01 PM

Child Dies Of Snake Bite In kurnool - Sakshi

కర్నూలు (వెల్దుర్తి) : తనకేం జరిగిందో తెలీదు. ఊపిరాడని స్థితిలో తీవ్ర బాధను అనుభవించింది. చెప్పేందుకు నోరురాక, శరీరం సహకరించక.. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించిందో చిట్టితల్లి. పదకొండేళ్ల ఆ బాలిక పేరు అంజలి. వెల్దుర్తి మండలంలో జరిగిన సంఘటన వివరాల్లోకి వెళితే... పుల్లగుమ్మి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, లక్ష్మీదేవిలకు నలుగురు కుమార్తెలు సంతానం. మూడవ కుమార్తె అంజలి. కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మీదేవి తన ఆఖరు కూతురుతో కలిసి రెండేళ్ల నుంచి పుట్టిల్లు బలపాలపల్లెలో ఉంటోంది. తండ్రి బ్రహ్మయ్య ఆ సమయం నుంచే పక్షవాతంతో మంచం పట్టాడు. దీంతో ఇంట్లో ఉన్న ముగ్గురు కుమార్తెలు కుటుంబ భారం మోస్తూ తండ్రికి చేదోడుగా ఉంటున్నారు.

 మూడవ కుమార్తె అంజలి స్థానిక ఎంపీపీ స్కూల్‌లో 5వ తరగతి పూర్తి చేసుకుంది. సెలవులు కావడంతో తన అక్కలతో కలిసి కూలి పనులకు వెళ్లేది. ఆదివారం రాత్రి రోజూ మాదిరిగానే ఇంట్లో (రేకుల షెడ్డు) నిద్రించింది అంజలి. 11 గంటల సమయంలో మూత్ర విసర్జనకు బయటకు వచ్చిన సమయంలో కాలికి ఏదో కరిచినట్లు గుర్తించింది. అబ్బా అనుకుంటూనే వెళ్లి పడుకుంది. రెండు గంటల సమయానికి గొంతు, మొహం వాచిపోయి, శరీరంలోను, కాలి వద్ద తీవ్ర నొప్పి మొదలైంది. చెప్పుకోవడానికి తల్లి లేకపాయె. 

తండ్రి పక్షవాతంతో ఉన్నాడు. అక్కలు గాఢ నిద్రలో ఉన్నారు. ఎలాగోలాగ తడబడుతూ బయటకు వచ్చి పక్క ఇంట్లో నివాసముంటున్న జేజినాయన చిన్నమారెన్న వద్దకు వెళ్లింది. అక్కడ జేజినాయన, జేజి, చిన్నాన్నకు విషయం తెలుపలేక అప్పటికే మూగబోతున్న గొంతుతో కొద్దికొద్దిగా చెబుతూ, చివరకు సైగలు చేసింది. నోరు మెదపలేని స్థితిలో, ఊపిరి ఎగదోసుకుంటూ వచ్చిన బాలికను చూసి వారు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలీదు, బాలిక చెప్పలేకపోతోంది. చివరకు అచేతనావస్థకు చేరుకుంటోంది. పాముకాటు వేసినట్లు నిర్ధారించుకుని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయన సూచన మేరకు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పాముకాటుకు తగిన చికిత్స అందించేలోగా సోమవారం తెల్లవారుజామున  అంజలి కన్నుమూసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement