వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది.
అనంతపురం న్యూసిటీ: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన సంఘటన గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే... హిందూపురం సంజీవరాయనిపల్లికు చెందిన నాగరత్నమ్మ (33) పురిటి నొప్పులతో 12న హిందూపురం ఆస్పత్రిలో చేరింది. గర్భిణి పరిస్థితిని గమనించిన వైద్యులు అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆమెను అర్థరాత్రి 12 గంటల సమయంలో సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు కాస్త జాప్యం చేయడం పెద్ద సమస్యగా మారింది. ఓ గైనిక్ వైద్యురాలు, అనస్టీషియా వైద్యురాలు 13న రాత్రి సిజేరియన్ చేశారు.
ఆపరేషన్ జరిగే సమయంలోనే బాలింతకు ఫిట్స్ వచ్చాయి. అప్పటికే గుండె ఫంక‌్షనింగ్ తక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. సిజేరియన్ చేయగా బాబు జన్మించాడు. అప్పటికే నాగరత్నమ్మ గుండె ఫెయిలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అనస్తీషియా వైద్యులు బాలింతను ఏఎంసీ (అక్యూట్ మెడికల్ కేర్)కు తరలించి వెంటిలేటర్ ద్వారా శ్వాసనందించారు. ఉదయం 8.30 గంటల సమయంలో బాలింత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో భర్త సురేష్‌తో పాటు వారి బంధువులంతా కన్నీరు మున్నీరయ్యారు. సాధారణ డెలివరీ కోసం వైద్యులు ప్రయత్నించారనీ.. కాకపోవడంతోనే సిజేరియన్ చేశారని గైనిక్ హెచ్‌ఓడీ షంషాద్‌బేగం చెప్పారు. నాగరత్నమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు.