దొంగ ముద్ర
► అధికారికంగా విధులకు డుమ్మా కొడుతున్న వైద్య సిబ్బంది
► ఒక చోట హాజరు..మరో చోట విధులు
► పట్టించుకోని ఉన్నతాధికారులు
► ఇబ్బందులు పడుతున్న రోగులు
బయోమెట్రిక్‌తో డ్యూటీలకు డుమ్మా కొట్టే డాక్టర్లకు చెక్ పెట్టొచ్చని భావించింది సర్కార్. అయితే అదే బయోమెట్రిక్‌ను ఉపయోగించుకొంటూ తమ పనులను తాపీగా చేసుకుంటున్నారు కొందరు వైద్యులు. అదెలా అంటే ఉదాహరణకు... రాము అనే వైద్యుడు యల్లనూరు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తుంటాడు. కానీ ఆయన ఉండేది మాత్రం తాడిపత్రిలో.. ఉదయమే తాడిపత్రి పరిధిలోని ఆస్పత్రికెళ్లి సమయానికి బయోమెట్రిక్‌లో అటెండెన్స్ వేసేస్తాడు. తన పనులన్నీ చూసుకొని ఏ మధ్యాహ్నమో తాను పనిచేసే యల్లనూరు పీహెచ్‌సీకెళ్లి కాసేపుండి మళ్లీ తాడిపత్రికి వచ్చేస్తాడు. తిరిగి సాయంత్రం తాడిపత్రిలోనే బయోమెట్రిక్‌లోనే అటెండెన్స్ వేస్తున్నాడు. ఇలా దర్జాగా ప్రభుత్వ విధులకు తమదైన శైలిలో డుమ్మా కొట్టేస్తున్నారు ఎంతో మంది వైద్యులు.
అనంతపురం సిటీ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలో సుమారు 2000 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారిలో ఉన్నత క్యాడర్ నుంచి స్వీపర్ దాకా పలు విభాగాల్లో పని చేస్తున్నారు. సుమారు 550 మందికి పైగా సిబ్బంది తప్పుడు హాజరు వేస్తూ విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. తాడిపత్రి, ఉరవకొండ, పెనుకొండ, ధర్మవరం, గుంతకల్లు, మడకశిర, హిందూపురం ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులే ఎక్కువగా ఇలా చేస్తున్నట్లు సమాచారం.
రెక్టరేట్ నుంచి హెచ్చరికలు
బయోమెట్రిక్‌లో ఈ తరహా తప్పులు చేసేందుకు అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల అధికారులను హెచ్చరించారు. కాగా అధికారులు ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో వైద్యులు ఆడింటే ఆట పాడిందే పాటగా మారింది.
సర్వజన ఆస్పత్రిలోనూ అంతే..!
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఉదయం 10 గంటలకు హాజరు వేసిన వైద్యులు వచ్చిన దారినే క్లినిక్‌ల బాట పడుతున్నారు. సీసీ కెమెరాల నిఘాను కూడా వారు తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆస్పత్రి అవుట్ గేటు వద్ద లోపలి నుంచి బయటక వెళ్లే వ్యక్తుల ముఖాలు కనిపించకుండా కెమెరాలను ఏర్పాటు చేయించుకున్నారు. ఫలితంగా ఎవరు బయటకు వెళ్తున్నారో తెలుసుకోవడం కష్టంగా మారింది. తిరిగి వారు విధులకు వచ్చే ద§ృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇంతా జరుగుతున్నా ఏ అధికారుల్లో చలనం లేదు.
అలాంటి వారిని ఉపేక్షించం
బయోమెట్రిక్ విధానాన్ని ఉల్లంఘించినా, బా«ధ్యతా రాహిత్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తాం. అక్కడక్కడా తప్పులు జరుగుతున్న విషయం వాస్తవమే... మా §ృlష్టికీ వచ్చింది. త్వరలో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కేటాయిస్తాం.
– వెంకటరమణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి