ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : స్థానిక 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన పుట్టిన బిడ్డ (నవజాత శిశువు) వెంటనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆపరేషన్ చేయడంలో జాప్యం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే మృతి చెందాడని, వెంటనే ఆపరేషన్ చేసుంటే మా బాబు బతికే వాడని కొత్తూరు మండలం గూనబద్రకు చెందిన రుగడ ఏసుబాబు, లక్ష్మి అన్నారు. పుట్టబోయే బిడ్డ కోసం 9 నెలలు ఎంతో ఆతృతగా ఎదురు చూశామని, మగ బిడ్డ పుట్టాడని ఆనందించామని అయితే తమ ఆనందం కొన్ని క్షణాలు కూడా ఉండలేదని ఏసుబాబు చెప్పారు. వైద్యులు వెంటనే స్పందించి ఉంటే తమకు న్యాయం జరిగేదని, బాబు బతికేవాడని ఏసుబాబు అన్నారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏడాదిన్నర కిందట ఏసుబాబుతో పోలాకి మండలం ముప్పిడికి చెందిన లక్ష్మితో వివాహమైంది. భార్య లక్ష్మి గర్భం దాల్చిన తరువాత శ్రీకాకుళంలో ఓ వైద్యురాలి వద్ద నిత్యం తనిఖీలు చేయించామని నెలలు నిండి నొప్పులు రావడంతో 14వ తేదీ రాత్రి 8.30 సమయంలో 108లో ఆసుపత్రికి తీసుకువచ్చామని ఏసుబాబు చెప్పారు. అయితే రాత్రంతా తన భార్య నొప్పులతో ఇబ్బంది పడిందని సాధారణ తనిఖీలు చేసిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన గంట కల్లా మృతి చెందాడని అదే ఆపరేషన్ రాత్రి చేసుంటే తమకు న్యాయం జరిగేదని చెప్పారు. ప్రస్తుతం తన భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు. అయితే ఈ సంఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
వైద్యపరమైన కారణాలతోనే మృతి
ఈ సంఘటనపై ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎన్.పద్మావతి మాట్లాడుతూ వైద్యపరమైన కారణాలతో బిడ్డ మృతి చెందినట్టు చెప్పారు. గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించామన్నారు. గర్భిణి ప్రసవానికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయలేమని సాధారణ ప్రసవానికి ప్రయత్నించి అనుకూలంగా లేకపోతే ఆపరేషన్ చేస్తామని, ఇందులో భాగంగానే సాధారణ ప్రసవానికి ప్రయత్నించి చివరి క్షణంలో ఆపరేషన్ చేశామన్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోలేక మృతి చెందినట్టు చెప్పారు. చిన్నపిల్లల వైద్యుడు నవీన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటికి ఊపిరి ఉందని, కొద్ది క్షణాల్లోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో తమ ప్రయత్నం చేశామని శ్రీకాకుళం తరలించేందుకు ప్రయత్నించే లోగా మృతి చెందినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment