narsannapeta
-
‘జగన్ జైత్రయాత్రను ఆపేశక్తి ఎవరికీ లేదు’
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన.. దేశానికే ఆదర్శమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆయన అండగా ఉన్నారని.. సామాజిక న్యాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారాయన. బుధవారం శ్రీకాకుళం నరసన్నపేటలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ‘‘ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు?. చంద్రబాబు అడుగడుగునా దళితుల్ని అవమానించారు. అధికారం కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు జగన్. అందుకే వెనుకబడిన వర్గాల వాళ్లు ఇవాళ తలెత్తుకుని బతుకుతున్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. రైతు భరోసాతో కర్షకులకు ఆర్థిక భరోసా లభించింది. విత్తనాలు రైతుల ముంగిటకే వస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు అండగా ఉంటూ.. సామాజిక న్యాయం పాటిస్తూ.. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ జైత్రయాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదు అని తమ్మినేని అన్నారు. అంతకు ముందు.. మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు ప్రసంగించారు. బహిరంగ సభకు ముందు.. నరసన్నపేటలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే లు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు. -
ముద్దులొలికే చిన్నారులు.. మూడు రికార్డులు!
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మారుతీ నగర్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రాడ సురేష్, ప్రమీల దంపతుల కవలలు ప్రార్ధన, సాధన నాలుగు రోజుల వ్యవధిలో మూడు బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఔరా అనిపించారు. నాలుగేళ్ల నాలుగు నెలల వయసు కలిగిన వీరి జ్ఞాపక శక్తిని 22 నెలల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. వర్చువల్ పద్ధతిలో వీరి జ్ఞాపక శక్తిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. ఈ బాలికలు 118 రసాయనిక శాస్త్ర మూలకాల పేర్లు, 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు నిమిషాల వ్యవధిలో చెప్పడంతో ఈ మూడు రికార్డులను సాధించారని తండ్రి సురేష్ తెలిపారు. ఈ నెల 21న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, 22న కలాం వరల్డ్ రికార్డ్స్, 24న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు ఆయా సంస్థలు సమాచారం ఇచ్చాయని సురేష్ తెలిపారు. వేమన పద్యాలు, గణిత గుర్తులు, ఆకృతులు, చరిత్రకు సంబంధించిన కట్టడాలు, వ్యక్తుల పేర్లు కూడా వారు చెప్తారని తెలిపారు. కన్నడ, గుజరాతీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో అంకెలు చెబుతారన్నారు. -
పాసులు సరే.. బస్సుల మాటేమిటి?
సాక్షి, నరసన్నపేట : విద్యార్థులకు ఆర్థికభారం తగ్గించేందుకు రాయితీ బస్ పాసులను మంజూరు చేస్తున్న ఆర్టీసీ.. దీనికి తగిన విధంగా బస్ సర్వీసులు నడపడం లేదు. గతంలో ప్రవేశ పెట్టిన స్టూడెంట్ స్పెషల్ సర్వీసులను డిమాండ్‌కు అనుగుణంగా నడపక పోవడంతో రెగ్యులర్ బస్‌లు నిండుతున్నాయి.దీంతో విద్యార్థులు ఫుట్‌పాత్‌లపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుంది. మరోవైపు అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గంటల తరబడి కాంపెక్స్‌లో బస్‌ల కోసం చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు నరసన్నపేట కాంప్లెక్స్ వద్ద గురువారం ఆందోళనకు దిగారు. బస్‌పాస్‌లకు తగినట్లుగా స్టూడెంట్స్ స్పెషల్ బస్‌లు నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. ఇలా అయితే తమ ఇళ్లకు ఎలా చేరుకోవాలని ప్రశ్నించారు. గత వారం రోజులుగా రోజూ కాంప్లెక్స్‌లో ఎస్‌ఎంకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో వారంతా బస్‌లు కదలకుండా ఆందోళనకు దిగారు. ప్రధానంగా బోరుబద్ర, పిన్నింటిపేట, పోలాకి, ప్రియాగ్రహారం రూట్లో అధికంగా సమస్య ఉందన్నారు. వయా పోలాకి రూట్లో ఉండాల్సిన బస్‌లు గత ప్రభుత్వం హయాంలో నిమ్మాడ మీదుగా మార్చారని తెలిపారు. దీంతో అవసరం మేరకు రెగ్యులర్ బస్‌లు లేక, స్పెషల్ సర్వీసులు అరకొరగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు వివరించారు. స్టూడెంట్స్ స్పెషల్ బస్‌లు మరిన్ని నడపాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన ఆర్టీసీ ఎస్ఎం మూర్తి.. అక్కడకు చేరుకుని, విద్యార్థులతో మాట్లాడారు. 1, 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. -
మగబిడ్డ పుట్టాడని ఆనందం..కానీ అంతలోనే
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం) : స్థానిక 50 పడకల ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన పుట్టిన బిడ్డ (నవజాత శిశువు) వెంటనే మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆపరేషన్ చేయడంలో జాప్యం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే మృతి చెందాడని, వెంటనే ఆపరేషన్ చేసుంటే మా బాబు బతికే వాడని కొత్తూరు మండలం గూనబద్రకు చెందిన రుగడ ఏసుబాబు, లక్ష్మి అన్నారు. పుట్టబోయే బిడ్డ కోసం 9 నెలలు ఎంతో ఆతృతగా ఎదురు చూశామని, మగ బిడ్డ పుట్టాడని ఆనందించామని అయితే తమ ఆనందం కొన్ని క్షణాలు కూడా ఉండలేదని ఏసుబాబు చెప్పారు. వైద్యులు వెంటనే స్పందించి ఉంటే తమకు న్యాయం జరిగేదని, బాబు బతికేవాడని ఏసుబాబు అన్నారు. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏడాదిన్నర కిందట ఏసుబాబుతో పోలాకి మండలం ముప్పిడికి చెందిన లక్ష్మితో వివాహమైంది. భార్య లక్ష్మి గర్భం దాల్చిన తరువాత శ్రీకాకుళంలో ఓ వైద్యురాలి వద్ద నిత్యం తనిఖీలు చేయించామని నెలలు నిండి నొప్పులు రావడంతో 14వ తేదీ రాత్రి 8.30 సమయంలో 108లో ఆసుపత్రికి తీసుకువచ్చామని ఏసుబాబు చెప్పారు. అయితే రాత్రంతా తన భార్య నొప్పులతో ఇబ్బంది పడిందని సాధారణ తనిఖీలు చేసిన సిబ్బంది ఉదయం 10 గంటల వరకూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన గంట కల్లా మృతి చెందాడని అదే ఆపరేషన్ రాత్రి చేసుంటే తమకు న్యాయం జరిగేదని చెప్పారు. ప్రస్తుతం తన భార్య లక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు. అయితే ఈ సంఘటనపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. వైద్యపరమైన కారణాలతోనే మృతి ఈ సంఘటనపై ఆస్పత్రి ప్రధాన వైద్యురాలు ఎన్.పద్మావతి మాట్లాడుతూ వైద్యపరమైన కారణాలతో బిడ్డ మృతి చెందినట్టు చెప్పారు. గుండెజబ్బు ఉన్నట్టు గుర్తించామన్నారు. గర్భిణి ప్రసవానికి వచ్చిన వెంటనే ఆపరేషన్ చేయలేమని సాధారణ ప్రసవానికి ప్రయత్నించి అనుకూలంగా లేకపోతే ఆపరేషన్ చేస్తామని, ఇందులో భాగంగానే సాధారణ ప్రసవానికి ప్రయత్నించి చివరి క్షణంలో ఆపరేషన్ చేశామన్నారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండడం వల్ల బిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోలేక మృతి చెందినట్టు చెప్పారు. చిన్నపిల్లల వైద్యుడు నవీన్ మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటికి ఊపిరి ఉందని, కొద్ది క్షణాల్లోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో తమ ప్రయత్నం చేశామని శ్రీకాకుళం తరలించేందుకు ప్రయత్నించే లోగా మృతి చెందినట్టు తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం
-
ప్రేముంచాడు
నరసన్నపేట(శ్రీకాకుళం): పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని నమ్మించిన ప్రియుడు పెళ్లి ముహూర్తం సమయానికి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన నరసన్నపేటలో గురువారం జరిగింది. దీంతో వధువు బంధువులు, తల్లిదండ్రులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపేటలోని తిరుమలవీధికి చెందిన రాజ్యలక్ష్మి(వధువు)కి ఇదే మండలం నడగాంకు చెందిన పొట్నూరు గాంధీ కుమారుడు ప్రదీప్(స్వామి)తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వీరి ప్రేమకు వధువు వైపు నుంచి బంధువులు అంగీకరించారు. వరుడు బంధువులతో కూడా మాట్లాడారు. చివరికి రెండు కుటుంబాలు అనుకొని గురువారం తెల్లవారుజాము 4.15 గంటలకు వివాహం నిర్ణయించారు. నరసన్నపేటలోని సూర్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల్లో, కల్యాణ మండపం వద్ద బుధవారం ఉదయం నుంచీ అంతా సందడిగా ఉంది. వధువు వైపు నుంచి బంధువులు వచ్చి మధ్యాహ్న విందు ఆరగించారు. వేలాది రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి తంతులో భాగంగా నిర్వహించాల్సిన ఇతర కార్యక్రమాల కోసం వరుడును పురోహితులు పిలిచారు. అయితే ప్రదీప్ కనిపించలేదు. ఆందోళన చెందిన వధువు బంధువులు ఫోను చేస్తే ఇదిగో వస్తా, అదిగో వస్తా అని ఒక గంట కాలం కాలక్షేపం చేశాడు. రాత్రంతా చూశారు, అయినా రాలేదు. పెళ్లి ముహూర్తం సమయానికైనా వస్తాడని అందరూ ఆశించారు. అయినా వరుడు ఆచూకీ లభించలేదు. ఫోను కూడా స్విచ్ఆఫ్ అని వస్తుండటంతో ఇక చేసేదేమీ లేక నరసన్నపేట పోలీసులను వధువు తల్లిదండ్రులు గురువారం ఉదయం ఆశ్రయించారు. మా అమ్మాయిని ప్రేమించి, పెళ్లి వరకూ తీసుకువచ్చిన పొట్నూరు గాంధీ కుమారుడు స్వామి మోసం చేశాడని వధువు తల్లిదండ్రులు విష్ణుమూర్తి, శాంతికుమారి ఎస్ఐ ఎన్.లక్ష్మణకు ఫిర్యాదు చేశారు. స్వామి ఆచూకీని కనిపెట్టి మా అమ్మాయితో వివాహం చేయించాలని వీరు విజ్ఞప్తి చేశారు. పెళ్లి పీటలపై కుమార్తె వివాహం నిలిచి పోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. కాగా నరసన్నపేటలో ఒక హోల్‌సేల్ షాపులో పనిచేస్తున్నప్పుడు మాకు పరిచయం అయిందని, అది ప్రేమగా మారిందని వధువు వివరించారు. ఇన్నాళ్లు నాతో చాలా గౌరవంగా ప్రవర్తించాడని పెళ్లి కూడా ఆయన ఇష్ట ప్రకారమే నిర్ణయించామని తెలిపారు. ఇప్పుడు పెళ్లి సమయానికి ఎందుకు ఇలా చేశాడో అని కంటతడి పెట్టారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
జైళ్లల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు : డీఐజీ
నరసన్నపేట : జిల్లాలోని సబ్‌జైళ్లు, జిల్లా జైళ్లలో ఉన్న ఖైదీలకు, ముద్దారుులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థారుులో సౌకర్యాలు కల్పిస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ ఎం.చంద్రశేఖర్ అన్నారు. నరసన్నపేటలోని సబ్‌జైలును శుక్రవారం ఆయన వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసన్నపేట జైలును రూ.17లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. పాతపట్నం, జిల్లా కేంద్ర జైల్లో కూడా అభివద్ధి పనులు చేశామన్నారు. శిథిలమై ఎత్తివేసిన సోంపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్‌జైళ్లను పునరుద్ధరించే ఆలోచన లేదని చెప్పారు. ఉన్న జైళ్లలోనే సామర్థ్యం మేరకు ముద్దారుులు, ఖైదీలు ఉండడం లేదన్నారు. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉందని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. జైళ్ల శాఖలో 250 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. నరసన్నపేట జైలు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని కితాబునిచ్చారు. ఆయన వెంట జిల్లా జైలర్ బి.కూర్మనాధరావు, స్థానిక సబ్‌జైలర్ కె.రామకృష్ణ ఉన్నారు. -
ఆస్పత్రుల పరిశీలన
నరసన్నపేట: స్థానిక యాభై పడకల ప్రభుత్వాస్పత్రితో పాటు మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీవీపీ విజిలెన్సు అధికారి కనకదుర్గ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు ఒక్కో అధికారిని ప్రభుత్వం పరిశీలన కోసం నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు ఈమెను నియమించారు. పరిశీలనలో భాగంగా వైద్య పరీక్షల తీరు, ఈ ఔషధి పని విధానంపై ఆరా తీశారు. ముందుగా మాకివలస పీహెచ్‌సీకి వెళ్లిన ఆమె సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మోడాల్ సంస్థకు వైద్య పరీక్షలు అప్పగించామని, ఎలా తనిఖీలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు రాస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని, దీనిపై బాధ్యతగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల రక్త పరీక్షల రిపోర్టులు రాకముందే వైద్యులు మందులు రాస్తున్నారని అలాంటప్పుడు రక్త పరీక్షలు రాయడమెందుకని అన్నారు. నరసన్నపేట 50 పడకల ఆస్పత్రిలో కూడా వైద్యుల వారీగా పనితీరును తెలుసుకున్నారు. ఓపీ ఎంత ఉంది, వైద్య పరీక్షలు ఎలా రాస్తున్నారు అనేది పరిశీలించారు. ఈమె వెంట డీఎంహెచ్ఓ శ్యామల , డీసీహెచ్ సూర్యారావు ఉన్నారు. -
బుచ్చిపేట ఇసుక ర్యాంపు మూసివేత
నరసన్నపేట : బుచ్చిపేట ఇసుక ర్యాంపును అధికారులు మంగళవారం మూసివేశారు. నరసన్నపేట ఎస్ఐ ఎన్ లక్ష్మణ తోపాటు రెవెన్యూ సిబ్బంది వెల్లి ర్యాంపును క్లోజ్ చేస్తూ రోడ్డు మార్గంలో ట్రెంచ్‌లు తవ్వించారు. బోర్డులు పెట్టారు. రెండు రోజులుగా గ్రామస్తులు ఇసుక ర్యాంపుపై ఆందోళన చెందుతున్న విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం మైన్స్ అధికారులకు పరిశీలించమని సోమవారం ఆదేశించారు. ర్యాంపులో అనుమతికి మించి ఇసుక తవ్వకాలు జరిగాయని ప్రస్తుతం తవ్వేందుకు అనుకూలంగా లేదని సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమై ర్యాంపును మూసి వేశామని ఎస్ఐ హెచ్చరించారు. -
ఆరు నెలల్లో మళ్లీ దసరా...
ఇళ్లు కట్టి..పండగ చేసుకొందాం - 6 నెలల్లోపే నిర్మాణం పూర్తి: సీఎం - ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన - ఒకేసారి గృహప్రవేశం చేద్దాం.. - అంకాపూర్‌ను మించేలా అభివృద్ధి - డ్రిప్పు ద్వారానే సాగు చేయాలని రైతులకు సూచన జగదేవ్‌పూర్: ఎర్రవల్లి, నర్సన్నపేటలను అద్భుత గ్రామాలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇటు గ్రామాభివృద్ధితో పాటు అటు వ్యవసాయాభివృద్ధి ఒకేసారి జరగాలని ఆకాంక్షించారు. ఐదున్నర నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అందరం ఒకేసారి గృహప్రవేశం చేద్దామన్నారు. గురువారం దసరా పర్వదిన వేళ తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలు అదృష్టవంతులన్నారు. రెండు గ్రామాల ప్రజల చైతన్యం ఎంతో గొప్పదన్నారు. ఐక్యమత్యంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. వ్యవసాయాభివృద్ధి ఎంతో ముఖ్యం గ్రామాల అభివృద్ధి ఎంత ముఖ్యమో వ్యవసాయాభివృద్ధి అంతకంటే ముఖ్యమని సీ ఎం కేసీఆర్ అన్నారు. ప్రతి రైతుకు డ్రిప్పు సౌకర్యం కల్పిస్తామని, బోర్లు వేయిస్తామని చె ప్పారు. అంకాపూర్‌ను మరిపించేలా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను తీర్చిదిద్దుతామన్నా రు. జిల్లాలోని పాములపర్తి రిజర్వాయర్‌కు కొండపోచమ్మసాగర్ అనీ, సిద్ధిపేట ప్రాంతం లో నిర్మించే రిజర్వాయర్‌కు కొమురెళ్లి మల్లన్నసాగర్ అనీ పేర్లు పెట్టామన్నారు. రెండు రిజ ర్వాయర్లను త్వరగా పూర్తి చేసి మెదక్, నల్లగొం డ, రంగారెడ్డి జిల్లాలకు తాగు, సాగునీరందిస్తామన్నారు. ఆరు నెలల్లో ఇంటింటికీ నల్లా కలెక్ష న్ ద్వారా తాగునీరందిస్తామన్నారు. నీటి నిల్వ కోసం కూడవెళ్లి వాగును అభివృద్ధి చేసి అక్కడక్కడా చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పొలాల వద్ద భారీ కుం డీలు ఏర్పాటు చేసుకుని నీరు నిల్వ చేసుకోవాలని సూచించారు. చేబర్తి నుంచి ఇటిక్యాల వర కు వాగును నీటి నిల్వకు అనువుగా పటిష్టం చే స్తామన్నారు. ఈ పనులు వారంలోపు మొదలు పెట్టాలని కలెక్టర్, జేసీలను ఆదేశించారు. వందశాతం డ్రిప్పుతోనే సాగు రెండు గ్రామాల్లో రైతులు వందశాతం డ్రిప్పు సౌకర్యం ద్వారానే పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. బోర్లు లేని ప్రతి రైతుకు బో ర్లు వేయించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. డ్రిప్పును ప్రభుత్వమే అందిస్తుందన్నారు. రెం డు గ్రామాల్లో ఎంత డ్రిప్పు అవసరమో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌లోపు సర్వేలు పూర్తి కావాలని, ప్రతి రైతు పొలం వద్ద కుండీలు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 485 ఇళ్లకు శంకుస్థాపన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో సీఎం కేసీఆర్ 485 ఇ ళ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన శిలాఫ లకాన్ని ఆవిష్కరించారు. ఎర్రవల్లిలో 285, న ర్సన్నపేటలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లను ని ర్మించనున్నారు. ఆరు నెలల్లోపు ప్రాజెక్టును పూ ర్తి చేసి విజయం సాధించాలని, అప్పుడు మళ్లీ దసరా పండుగ చేసుకుందామన్నారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి కంపెనీ ప్రతినిధులను సీఎం ఆదేశించారు. గడువులోగా పూర్తి చేస్తే ఇక్కడే మిమ్మల్ని సన్మానిస్తామన్నారు. దసరా సంబరాల్లో సీఎం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం జమ్మి ఆకులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
'నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా'
జగదేవ్‌పూర్: మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని నర్సన్నపేటను ఎర్రవల్లిలాగానే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం నాడు మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన నర్సన్నపేటలో ఆగారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడుతూ.. త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నష్టం లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నర్సన్నపేటను ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కేసీఆర్ అన్నారు. -
మూడు లారీలు.. 6 లోడులు
గ్రామాల్లో ఇసుక ర్యాంపుల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించామని చెప్పినా.. అనేక చోట్ల తెరవెనుక టీడీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. నరసన్నపేట మండలంలోని గోపాలపెంట ర్యాంపు కూడా ఇందుకు మినహాయింపు కాదు!! నరసన్నపేట : గోపాలపెంటలో ఇసుక ర్యాంపును డ్వాక్రా మహిళలకు అప్పగించినా వారు నామమాత్రంగానే ఉంటున్నారు. అంతా ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన మరో వ్యక్తే చూస్తున్నారు. ఆయ న చెప్పిందే వేదం. ఇసుక లోడు కావాలన్నా, ఆగాల న్నా ఆయన చెప్పినట్టే చేయాలి. డీఆర్డీఏ అధికారులు వచ్చినా ఆయనతోనే సంప్రదింపులు చేస్తున్నారు. ఇలా పెత్తనమంతా టీడీపీ నేతదే కాగా, రసీదులు రాయడానికే డ్వాక్రా మహిళలు పరిమితమవుతున్నారు. అక్రమ లోడులు ఈ ర్యాంపులో నిత్యం వందలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. లారీల్లో అధికంగా ఇసుక లోడ్ చేయాలన్నా, సీరియల్ కాకుండా ముందుగా లోడ్ కావాలన్నా డబ్బు ముట్ట చెప్పాల్సిందే. మూడు నెలలుగా ఇక్కడ ఇసుక ర్యాంపు నిర్వహిస్తుండగా వారం రోజులుగా వాహనాల తాకిడి అధికంగా ఉంది. జిల్లాలో మరెక్కడా లారీలకు ఇసుక లోడ్ చేయక పోవడంతో గోపాలపెంట ర్యాంపునకు వాహనాలు అధికంగా వస్తున్నాయి. ఇక్కడ 9 క్యూబిక్ మీటర్లు ఇసుకనే ఇస్తున్నారు. దీంతో టిప్పర్లు విశాఖ, విజయనగరం. జిల్లాల నుంచి అధికంగా వస్తున్నాయి. ర్యాంపులో రెండు పొక్లెయిన్లు లోడింగ్‌కు ఉపయోగిస్తుండగా ఒకటే నిరంతరంగా లోడ్ చేస్తోంది. మరో పొక్లెయిన్ నిత్యం మొరాయిస్తూ ఉంది. ఒక్కో లారీ మూడు రోజుల వరకూ క్యూలో ఉంటున్నాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ర్యాంపు నిర్వాహకులు లారీల సిబ్బంది నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ ర్యాంపులో 1.80 ల క్యూబిక్ మీటర్లు ఇసుక విక్రయించాలని అధికారులు నిర్ణయించగా సోమవారం ర్యాంపు ముగిసే సరికి 62 వేల క్యూబిక్ మీటర్లు ఇసుకను మాత్రమే విక్రయించినట్లు లెక్కలుచెబుతున్నారు. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానేఅమ్మినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాగా ఈ ర్యాంపు పేరిట లారీలు వచ్చి పోతుండటంతో రోడ్డు పాడైందని, రోడ్డుకు ఆనుకొని ఉన్న ఇళ్లకు చెందిన కుటుంబాలు వాహనాల శబ్దానికి ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను ఉన్నతాధికారులు చక్కదిద్దాలని వారుకోరుతున్నారు. -
కరుణించవా.. వరుణ దేవా!
నరసన్నపేట : వరుణుడి కరుణ కోసం సత్యవరాగ్రహారంలో గురువారం 21 మంది రుత్వికులు వరుణయాగం ఘనంగా నిర్వహించారు. స్థానిక కామేశ్వరి స్వామి ఆలయంలో ఉదయం వరుణయాగాన్ని బుచ్చిరామయ్య వజ్ఞులు ప్రారంభించారు. ముత్తైవులు బిందెలతో నీళ్లు తీసుకుని వచ్చి ఇందులో పాల్గొన్నారు. 1001 బిందెల పవిత్ర జలాలతో ఈ యాగం నిర్వహించారు. కామేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా సత్యవరాగ్రహారం వేద మంత్రాలతో మార్మోగింది. వరుణయాగం ప్రభావం కచ్చితంగా ఉంటుందని వనమాలి బుచ్చిరామయ్య వజ్ఞులు అన్నారు. ఇప్పటికీ 11 యాగాలు నిర్వహించామని అన్నీంటా శుభ ఫలితాలే వచ్చాయనిచెప్పారు. జిల్లాలో మరిన్ని యాగాలు: కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రధానంగా రైతులకు ఖరీఫ్‌లో దేవుడు సహకరించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆకాంక్షించారు. సత్యవరం మాదిరిగా ఆరు చోట్ల యాగాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లాలో పరిస్థితి అంతా ఇబ్బందిగా ఉండేదని, కరువు ఛాయలు కన్పించాయని చెప్పారు. ఇప్పటికీ ఆ పరిస్థితి ఉన్నా రెండు రోజులుగా అల్పపీడనం కారణంగా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురవడం ఆశాజనకంగా ఉందన్నారు. అయినా జిల్లాలో వరుణయాగాలు నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నరసన్నపేట సర్పంచ్ గొద్దు చిట్టిబాబు, జడ్పీటీసీ చింతు శకుంతల, ఎంపీటీసీ ఆరంగి కృష్ణవేణి, చైతన్య భారతి అధ్యక్షుడు చింతు పాపారావు, గ్రామ పెద్ద యగళ్ల చిన్న నర్సునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పనులు అరకొర... సాగేనా వంశధార?
నరసన్నపేట :వంశధార ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు సాగునీరందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 1.48 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో శుక్రవారం ఉదయం 9.10 గంటలకు గొట్టాబ్యారేజి వద్ద కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తారు. గత సీజన్లో ఉన్నమేరకు సక్రమంగా అందించిన అధికారులు ఈ ఏడాదికూడా అదేరీతిలో అందివ్వగలరా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వంశధార నిర్వహణ డివిజన్ పరిధిలో వివిధ పనులకోసం రూ. ఏడుకోట్లతో ప్రతిపాదించగా అందులో 80శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీంట్లో టెండర్పనులు అన్నీ చివరిదశకు వచ్చాయని అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ నరసన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని ఓపెన్‌హెడ్ ఛానల్ పనులు మాత్రం 50 శాతమే పూర్తయ్యాయి. దీనివల్ల శివారు రైతులు తమవరకూ నీరొస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఏటా వారికి కష్టాలే... వంశధార ప్రాజెక్టు పరిధిలోని శివారు భూములకు ఏటా సాగునీరు సమస్యగానే ఉంటోంది. పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, నందిగాం తదితర మండలాల రైతులు సాగు నీటి కోసం ఏటా అవస్థలు పడుతున్నారు. అలాగే నరసన్నపేట, పోలాకి మండలాల్లో కూడా శివారు రైతులు కూడా సాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజనులో ఆ పరిస్థితి రాదని అధికారులు అంటున్నా రైతులు మాత్రం అనుమానిస్తున్నారు. పలుచోట్ల షట్టర్ల మరమ్మతులు చేయలేదని, పలు చానల్స్‌లో పూడిక తీయలేదని రైతులు అంటున్నారు. అలాగే వంశధార చానల్స్‌లో కూడా పనులు ఆశించిన మేరకు జరగలేదని వారు చెబుతున్నారు. అలాంటపుడు నీరెలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పోలాకి, మబగాం ఓపెన్ హెడ్ చానల్స్ పనులు పూర్తి కానేలేదు. వంశధార నది నుంచి జాతీయ రహదారి వరకూ పనులు నిర్వహించారు. మిగిలిన బాగం పనులు చేయక పోతే నీరు పోలాల్లోకి ఎలా వస్తుందని రైతులు అనుమానిస్తున్నారు. అధ్వానంగా షట్టర్సు వంశధార చానల్స్‌తో పాటు ఓపెన్ హెడ్ చానల్స్‌లో ఉన్న ఫట్టర్సు అధ్వానంగా ఉన్నాయి. షట్టర్సు కుంభకోణం వ్యవహారం కొలిక్కి రాక పోవడంతో వాటి మరమ్మతు పనులు నిర్వహించడం లేదు. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ కేసు తేలితే తప్ప పనులు చేయలేమని అధికారులు తేల్చేస్తున్నారు. అయితే వంశధార ఇంజనీర్లు మాత్రం నీటి రెగ్యులేషన్‌కు ఇబ్బంది లేకుండా షట్టర్ల మరమ్మతు చేస్తున్నామని అంటున్నారు. అనుకూలంగా ఇన్‌ఫ్లో.. శుక్రవారం నీటి విడుదలకు వంశధారలో ఇన్‌ఫ్లో అనుకూలంగా ఉంది. రెండు రోజుల క్రితం వరకూ నీటి ఇన్‌ఫ్లో తక్కువగా ఉండగా గురువారం సాయంత్రానికి 1950 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందని అధికారులు తెలిపారు. గొట్టాబ్యారేజి వద్ద నీటి నిల్వ కూడా అనుకూలంగా ఉందని చెబుతున్నారు. -
స్వాతి కేసు ఏమైంది?
ఏళ్లు గడుస్తున్నా వీడని చిన్నారి హత్య కేసు మిస్టరీ కుమార్తెను గుర్తు చేసుకొని రోదిస్తున్న కన్నవారు నరసన్నపేట : అది ఆగస్టు 20.. 2011వ సంవత్సరం.. ఎప్పటిలాగానే చిట్టి స్వాతి పాఠశాలకు వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి చేరలేదు. గుర్తు తెలియని దుండగుడు ఆ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. హత్యోదంతం తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గుర్తించేలోపే పాఠశాల ఆవరణలోనే ప్రాణాలను విడిచింది. ఈ దారుణం తెలుసుకొని నరసన్నపేటతోపాటు జిల్లా మొత్తం నిర్గాంతపోయింది. అయ్యో ఎంత పని చేశాడు.. అభం సుభం తెలియని బాలికను పొట్టన పెట్టుకున్నాడే అని ప్రజలు కంట తడి పెట్టారు. తన కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్లిందని స్వాతిని అల్లారు ముద్దుగా చూసుకొనే తల్లిదండ్రులు రోదించారు. అప్పట్లో ఈ హత్య కేసు సంచలనమైంది. అప్పటికి స్వాతి నరసన్నపేటలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతూ అక్కడికి సమీపంలోని భవానీపురంలో కుటుంబ సభ్యులతో ఉండేది. బాలిక తల్లి పాఠశాల సమీపంలోనే కూరగాయల షాపులో పని చేస్తుండేది. సంఘటన ఎలా జరిగిందంటే.. మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే చేసిన స్వాతి మరో రెండు గంటల్లో ఇంటికి వెల్తుందనగా ఈ దారుణ సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయం అవుతుంది. తోటి పిల్లలతో ఆటాడుకుంటుండగా గోడ దూకి వచ్చిన ఒక అగంతుకుడు (ఉన్మాది) అమాంతంగా స్వాతిని ఒడిసి పట్టుకొని గొంతుపై కత్తితో కోసి అంతే వేగంగా గోడ దూకి పరారయ్యాడు. రక్తం మడుగులో ఉన్న స్వాతి అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. చురుగ్గా దర్యాప్తు వెంటనే తేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికి సీఐగా మూర్తి, ఎస్ఐగా తిరుపతిరావులు ఉండేవారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తిరుపతిరావు ఇచ్చిన ఫఇర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద క్రైమ్ నంబరు 108-11గా కేసు నమోదు చేశారు. సంఘటనపై పూర్తిగా పరిశీలించడంతోపాటు.. అన్ని కోణా ల్లో దర్యాప్తు చేశారు. చివరికి ఒక ఉన్మాది ఈ హత్యకు పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు. అంతే ఆ తరువాత ఇప్పటి వరకూ దీనిపై కనీస పురోగతి లేదు. స్వాతి తల్లిదండ్రులు ఇప్పటికీ కుమార్తెను తలుచుకొని రోదిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక ఉన్మాది చేతిలో హత్యకు గురైన సంఘటనను ఇప్పటికీ నరసన్నపేట పట్టణ వాసులు మరిచిపోలేక పోతున్నారు. కొలిక్కి రాని కేసుస్వాతి హత్య కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేసినప్పటికీ ఆచూకీ లభించలేదు. సుమారు ఏడాది పాటు దర్యాపు చేసిన పోలీసులు ఆ తరువాత నిలిపి వేశారు. బాధగా ఉంది అల్లారు ముద్దుగా పెంచుకున్న స్వాతిని మరచిపోలేకపోతున్నాం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తలచుకొని బాధపడుతున్నాను. పోలీసులు కూడా ఏమీ తేల్చలేక పోయారు. బాధిగా ఉంది. నాకుమార్తె బతికిఉంటే ఎంతో సందడిగా ఉండేది. - లక్ష్మి, స్వాతి తల్లి -
సమర దీక్షకు జిల్లా నేతలు
నరసన్నపేట/ఆమదాలవలస : మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం చేపట్టనున్న దీక్షకు జిల్లా నేతలు బయలు దేరారు. ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు నేతలు ఆమదాలవలస రైల్వేస్టేషన్నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరారు. మరో పది వాహ నాల్లో రోడ్డుమార్గాన వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ధర్మాన కష్ణదాసు ప్రణాళిక రూపొందించారు. -
నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంలు
నరసన్నపేట : జిల్లాలోని 10 నియోజక వర్గ కేంద్రాల్లో మినీ స్టేడియంల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని డీఎస్డీఓ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కో కేంద్రంలో రూ.2.10 కోట్లు వెచ్చించి స్టేడియం నిర్మించనున్నామన్నారు. సోమవారం నరసన్నపేట మండలం మాకిలవలస వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్కలిలో డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. సీతంపేట, పాతపట్నం, నరసన్నపేటల్లో స్థలాలు గుర్తించామన్నారు. నరసన్నపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోనే స్టేడియం నిర్మించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక్కో చోట 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, ప్రత్యేక భవనం, టేబుల్ టెన్నిస్‌తో పాటు వివిధ క్రీడలకు ప్రత్యేకించి కోర్టులు నిర్మిస్తామన్నారు. వీటికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఆయనవెంట ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి సుందరరావు ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
నరసన్నపేట : మండలంలోని రావులవలసలో హిజ్రా (వర్ధిని) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి మృతి చెందింది. రావులవలస గ్రామ శివార్లులో ఈ సంఘటన జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో రాత్రి 10 గంటల వరకూ హిజ్రా శరీరం కాలుతూ ఉంది. రాత్రి 8 గంటల సమయంలో నరసన్నపేట నుంచి స్కూటీపై వచ్చిన హిజ్రా ఒక్కసారి ఈ విధంగా మంటల్లో కాలి మృతి చెందడం గ్రామంలో సంచలనం రేపింది. అయితే గ్రామస్తులు మాత్రం ఈ సంఘటనపై ఏమీ చెప్పలేకపోతున్నారు. కాగా హిజ్రా నరసన్నపేటలోని నక్కవీధిలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు వినియోగించే స్కూటీ సంఘటనకు సమీపంలో పార్కు చేసి ఉంది. దానికి ఆమె చున్నీ ఉంది. -
ఇసుక కరువాయె !
నరసన్నపేట రూరల్ : ఇసుక దొరక్క భవన, గృహ నిర్మాణదారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న ఇసుక ర్యాంపుల విషయంలో అధికారులు అవలంబిస్తున్న విధానాల కారణంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వస్తున్నాయి. వారి తీరు కారణంగానే ర్యాంపుల సంఖ్య రోజురోజుకీ తగ్గుపోతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా కొత్త ర్యాంపుల మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంటుంది. మొత్తం ఇసుక ర్యాంపుల వ్యవహారం గందరగోళంగా మారింది. డబ్బు పెట్టి కొందామన్నా ఇసుక లభించడంలేదని గృహ నిర్మాణదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇసుక పాలసీని నిర్ణయించడంతోపాటు గ్రామాల్లో స్వయంశక్తి సంఘాల మహిళలకు ర్యాంపుల నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. దీంతో సక్రమంగా ఇసుక లభిస్తుందని అంతా ఆశించారు. అయితే కొద్ది రోజుల్లోనే గృహ నిర్మాణదారుల ఆశలు అడుగంటాయి. ఒక్కసారిగా ధరలు ఆకాశాన్ని అంటారుు. ప్రస్తుతం నరసన్నపేట ప్రాంతంలో ట్రాక్టర్ లోడు ఇసుక రూ. 4,500 లనుంచి రూ. 5000 పలుకుతోంది. 10 రోజుల క్రితం 3,500 రూపాయలకు లభించే ఇసుక ధర అమాంతం పెరగడానికి డీఆర్డీఏ అధికారుల తీరే కారణమని పలువురు మండిపడుతున్నారు. కొత్త ర్యాంపుల మంజూరులో తీవ్రజాప్యాన్ని భవన నిర్మాణదారులు తప్పుపడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది తాపీ మేస్త్రీలు, ఇతర భవన నిర్మాణ కార్మికులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక పాలసీ వచ్చిన తరువాత కూడా ఏమిటీ బాధలని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ర్యాంపులు ఎనిమిదే.. జిల్లాలో వంశధార, నాగావళితో పాటు పలు నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నప్పటికీ కేవలం పది ర్యాంపులనే అధికారులు మంజూరు చేశారు. తాజాగా పురుషోత్తపురంలో ర్యాంపు మంజూరైంది. అయితే జలుమూరు మండలం దొంపాక ర్యాంపు 15 రోజుల క్రితం నిలిచిపోరుుంది. అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు ర్యాంపు, శ్రీకాకుళం మండలం కల్లేపల్లి ర్యాంపులు కూడా ఆగిపోయూరుు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కల్లేపల్లి ర్యాంపులో ఇసుక తవ్వేందుకు బిల్లులు రావడంలేదు. ఫలితంగా ఇసుక ధరకు రెక్కలొచ్చారుు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ర్యాంపులు కూడా జాతీయ రహదారికి ఆనుకొని లేకపోవడంతో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సరుబుజ్జిలి మండలం యరగాం, పురుషోత్తపురం, పెద్ద సవలాపురం, బూర్జ మండలం అల్లెన, కకండ్యాంల్లోనూ, సంతకవిటి మండలం తమరాం, వీరఘట్టం మండలం తలవరం, కొత్తూరు మండలం ఆకులతంపరల్లో ర్యాంపులు కొనసాగుతున్నాయి. అయితే నరసన్నపేట, జలుమూరు, గార, శ్రీకాకుళం మండలాల్లో అధికారులు ఇసుక ర్యాంపుల కోసం పరిశీలన చేసినప్పటికీ మంజూరు మాత్రం చేయలేదు. దీంతో నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి, పోలాకి, సారవకోట, జలుమూరు, సంతబొమ్మాళి తదితర మండలాల్లో ఇసుక లభ్యం కాని పరిస్థితి నెలకొంది. అందని రవాణా చార్జీలు ! ఇసుక విక్రయంలో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న శ్రీకాకుళం జిల్లాలో సక్రమమైన విధానం ఇప్పటికీ అమలు కావడంలేదు. రోజుకో నిబంధనను అధికారులు విధిస్తున్నారు. కొత్త పాలసీ ప్రారంభంలో ఇసుక ధరను అధికారులు నిర్ణయించారు. దీంతో ఇసుకను కొనుగోలు చేసుకొని ట్రాక్టర్ యజమానులు గృహనిర్మాణదారులకు విక్రయించే వారు. ఈ పద్ధతి కొన్ని రోజులు కొనసాగింది. తరువాత ట్రాన్స్‌ఫోర్టు చార్జీలు కలుపుకొని ట్రాక్టరు యజమానులు మీ సేవా కేంద్రాల్లో డీడీలు తీసుకొని వెళ్లేవారు. ఇసుక ధరల మినహా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రవాణా చార్జీలను ట్రాక్టరు యజమానులకు తిరిగి చెల్లిస్తామని డీఆర్డీఏ అధికారులు చెప్పారు. దీంతో ట్రాక్టరు సిబ్బంది రవాణా చార్జీలతో కలిపి డీడీలు ర్యాంపుల వద్ద అందజేసేవారు. ఈ విధానం 10 రోజులు కొనసాగింది. అయితే ట్రాక్టరు సిబ్బందికి ఇప్పటికీ రవాణా చార్జీలు తిరిగి రాలేదు. ఒక్కో ట్రాక్టరుకు కనీసం రూ. 20 వేలు చొప్పున్న రావాల్సి ఉంది. తాజాగా ఈ నిబంధనలను సైతం మార్పు చేసి పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు. ఒక్క ఇసుక ధరనే చెల్లిస్తున్నారు. దీంతో అటు గృహనిర్మాణ దారులు, ఇటు ట్రాక్టరు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ‘డబ్బు వెంటనే చెల్లించాలి’ ట్రాక్టర్ యజమానులకు చెల్లించాల్సిన రవాణా చార్జీలు వెంటనే చెల్లించాలని పోతయ్యవలసకు చెందిన ఆదినారాయణ, లుకలాం గ్రామానికి చెందిన వెంకటరమణలు డిమాండ్ చేశారు. 10 రోజల పాటు రవాణా చార్జీలు కూడా చెల్లించి ఇసుకను వినియోదారులకు సరఫరా చేశామన్నారు. రవాణా చార్జీల డబ్బు ట్రాక్టర్ యజమానుల బ్యాంకు ఖాతాలో వెంట వెంటనే పడతాయని డీఆర్డీఏ అధికారులు చెప్పినప్పటికీ ఆ పరిస్థితి లేదన్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు కనీసం రూ. 20 వేల వరకూ రావాల్సి ఉందన్నారు. సంక్రాంతికి ముందు డబ్బులను బ్యాంకులో వేయూలని కోరారు. -
ఉంటాయో... ఊడుతాయో!
- సరికొత్త షరతులతో పింఛన్‌దారుల ఆందోళన - పింఛన్ పెంపు ఆనందాన్ని ఆవిరి చేసిన ఆంక్షలు - సర్వే కమిటీల్లో రాజకీయులకే ప్రాధాన్యం - రాజకీయ విభేదాలతో రద్దు చేస్తారన్న అనుమానాలు - జిల్లాలో 15 శాతం వరకు కోత పడే సంకేతాలు - కమిటీల నియామకం పూర్తి చేయని అధికారులు - శుక్రవారం ప్రారంభం కాని సర్వే ప్రక్రియ శ్రీకాకుళం పాత బస్టాండ్, నరసన్నపేట రూరల్: ఎన్నికల హామీ మేరకు సామాజిక పింఛన్ మొత్తాలను వచ్చే నెల రెండో తేదీ నుంచి పెంచనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అంతకుముందే ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలను కుదించేందుకు సమాయత్తం కావడం పింఛనుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. అనర్హులను గుర్తించే సర్వే కమిటీల్లో ఎక్కువగా అధికార పార్టీకి చెందినవారే ఉండటం, అర్హతలపై పలు ఆంక్షలు విధించడంతో ఎవరి పాపం ఎవరికి చుట్టుకుంటుందో.. ఎవరు బలైపోతారోనన్న ఆందోళన వేలాది పెన్షనర్లను కుదిపేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాధారణ పింఛను మొత్తాన్ని రూ. 75 నుంచి రూ. 200కు పెంచారు. వికలాంగులకు రూ. 500 చేశారు. అర్షులందరికీ ఉదారంగా మంజూరు చేశారు. ఈ మొత్తాలను వరుసగా రూ.1000, రూ.1500కు పెంచనున్నట్లు టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ పార్టీయే అధికారంలోకి రావడంతో పింఛను పెరుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు, ప్రస్తుత సర్వే ఆందోళన కలిగిస్తోంది. గత ఏడేళ్లుగా నిరంతరాయంగా పింఛను పొందుతున్న వారిలో అభద్రతాభావం నెలకొంది. వైఎస్ అనంతరం క్రమంగా కుదింపు ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి పింఛన్ రద్దు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 135 ద్వారా జిల్లాలో ఉన్న సామాజిక పెన్షన్లలో 15 శాతం వరకు కోత వేయనున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2010 తర్వాత నుంచి ఏదో రకంగా పెన్షనర్లను తగ్గిస్తూ వస్తున్నారు. అప్పట్లోనే 20 వేల వరకు తగ్గాయి. ఇక గత మూడు నాలుగేళ్లలో ‘సదరం’ పేరిట వికలాంగ పింఛన్లలో దాదాపు సగం కోత వేశారు. ఇప్పుడు మళ్లీ కోతకు సిద్ధమవుతున్నారు. లబ్ధిదారుల అర్హతలను నిర్థారించేందుకు ఈ జీవోలోనే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిని తలచుకుని పింఛనుదారులు అభద్రతకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఆధార్ అంశం వృద్ధులను ఆందోళనకు గురి చేస్తోంది. వయోభారంతో వేలిముద్రలు పడక చాలా మంది ఆధార్ కార్డులు పొందలేకపోయారు. ఇప్పుడు ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇటువంటివారి పెన్షన్లు రద్దయ్యే ప్రమాదముంది. కమిటీల ఏర్పాటులో ఎంపీడీవోలు పెన్షన్ల సర్వేకు ప్రభుత్వ నిర్దేశించిన విధంగా వివిధ స్థాయిల కమిటీల ఏర్పాటు పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో కమిషన ర్లు కీలకపాత్ర పోషిస్తారు. వాస్తవానికి కమిటీల ఏర్పాటు పూర్తి చేసి, శుక్రవారం నుంచే సర్వే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోవడంతో సర్వే ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ కమిటీల్లో గ్రామ రెవెన్యూ ఆధికారి సభ్యుడు కాదు. అలాంటప్పుడు భూముల వివరాలు ఎవరు నిర్థారిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆధికారుల కంటే రాజకీయ నాయకులకే ప్రాధాన్యత కల్చించడంతో రాజకీయ కక్షలు రేగే ప్రమాదం కూడా ఉంది. కొత్త దరఖాస్తులకు అవకాశమిచ్చినా.. కొత్తవారి నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ఇకనుంచి ఇప్పుడున్న లబ్ధిదారుల్లో మరణించిన లేదా రద్దయిన పెన్షనర్ల స్థానంలోనే కొత్తవారికి అవకాశం ఇస్తారు. దీంతో ముందు ముందు పింఛన్లకు డిమాండ్ పెరగనుంది. ఇప్పటికే టీడీపీ నాయకులు తమ అనుయాయులకు, పార్టీ వారికి పింఛన్తు మంజూరూ చేయిస్తామంటూ దరఖాస్తుల సేకరణకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులోనూ రాజకీయ ప్రమేయంతోనే పెన్షన్లు మంజూరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామస్థాయి కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో చేపట్టే సర్వేకు పంచాయతీ యూనిట్‌గా కమిటీ ఉంటుంది. ఇందులో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, డ్వాక్రా సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఏదైనా గ్రామంలో 250 మందికి మించి పింఛనుదారులు ఉంటే రెండో కమిటీని వేస్తారు. విధిగా ఆధారాలు చూపాల్సిందే ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు సర్వేకు వచ్చే బృందాలు కోరిన ఆధారాలను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సర్వే జరిగే రెండు రోజుల పాటు లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేకపోయినా, ఆధారాలు చూపకపోయినా ప్రస్తుతం అందుతున్న పింఛన్ రద్దవుతుంది. -
ఇక ఎన్టీఆర్ కూపన్లు
నరసన్నపేట రూరల్ : కొత్త ప్రభుత్వం కొలవుదీరింది ఇంకేముంది ఇప్పటి వరకు అందని రేషన్ కార్డులు అందేస్తారుులే అని ఎదురు చూసిన లబ్దిదారులకు నిరాశే ఎదురవుతోంది. పాత ప్రభుత్వ విధానంలోనే కొత్తగా ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పేరుతో కూపన్లు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. పథకం పేరు మార్చి ఆరు నెలలకు సరిపడా కొత్త కూపన్లు అందిస్తుడడంతో లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రచ్చబండ వన్‌లో కూపన్లు అందించిన వారికి ఇప్పటి వరకు కొత్త కార్డులు జారీ కాలేదు. కుటుంబ సభ్యుల గ్రూపు ఫొటో, ఆధార్ కార్డులతో డిక్లరేషన్ సమర్పించినప్పటికీ హైదరాబాద్ నుంచి కార్డుల ప్రింటింగ్ కాలేదని చెబుతూ వీరికి కార్డులు అందించలేదు. ఈ విధంగానే నరసన్నపేట నియోజకవర్గంలో 3 వేల మంది వరకూ లబ్దిదారులు ఉన్నారు.కొత్తగా కార్డుల కోసం మరో 6 వేల దరఖాస్తులు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి పనికి రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరి కావడంతో కొత్త కార్డులు అందించాల్సిందే అంటూ లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే బియ్యం, ఇతర నిత్యవసర సరుకులు ఇస్తున్నాం కదా కార్డు కోసం అంత తొందర ఎందుకు అని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. కార్డుల్లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని లబ్దిదారులు వాపోతున్నారు. కాగా గత నెలలో నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 3 వేల మంది లబ్దిదారులకు కూపన్లు అందించారు. డిసెంబర్ వరకూ సరిపడా కూపన్లు లబ్దిదారులకు మంజూరు చేశారు. ఆగష్టు నుంచి ఈ కూపన్లు వినియోగంలోకి వచ్చాయి. కాగా రచ్చబండ -3లో వచ్చిన దరఖాస్తులు పరిశీలన అనంతరం కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ దశలో మళ్లీ కూపన్లు మాత్రమే సరఫరా చేయడంతో లబ్దిదారులు నిరశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందంచి కూపన్లు స్థానంలో కార్డులు మంజూరు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. -
దారి చూపిన ఊరు
స్ఫూర్తి కొత్తదారి ఎప్పుడు కనిపిస్తుంది? ఏ ఇబ్బందో, కష్టమో వచ్చినప్పుడో... ప్రత్యామ్నాయం కోసం వెదుకుతాం. కొత్త దారి ఒకటి కనుక్కుంటాం. కొందరు మాత్రం కష్టాలు, నష్టాలు దరి చేరక మునుపే ప్రత్యామ్నాయాలను వెదుకుతారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. కంబకాయ గ్రామం అలాంటి ముందు చూపుతోనే వ్యవహరించింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. ‘గ్యాస్ ధరల కష్టాలు’ అనే మాట వినిపించక ముందే ఊళ్లోకి బయోగ్యాస్‌ను ఆహ్వానించింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం గా నిలవడమే కాదు తెలుగునాట అగ్రస్థానంలో నిలిచింది. ఇంట్లోకి వంటగ్యాస్ రాగానే పండగ కాదు. రోజురోజూకు పెరుగుతున్న ధరను తట్టుకునే శక్తి ఉండాలి. అలాంటి శక్తి ఎంతమందికి ఉంది? కంబకాయ గ్రామంలో చాలామందికి గ్యాస్ధరల పెరుగుదలతో సంబంధం లేదు. ‘గ్యాస్ ధర మళ్లీ పెరిగింది’లాంటి వార్తలు చదివి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితమే ఆ గ్రామానికి ‘బయో గ్యాస్’ రూపంలో ఒక వరం లభించింది. ఇక భయమెందుకు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉంది కంబకాయ గ్రామం. రెండు దశాబ్దాల క్రితం అప్పటి గ్రామ సర్పంచ్ పాగోటి రాజారావునాయుడు పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేశారు. అప్పటికది ఊరికి కొత్త. దాని ప్రయోజనాల గురించి కూడా ఎక్కువమందికి తెలియదు. అయితే కాలక్రమంలో బయోగ్యాస్ విలువ తెలుసుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు ఒక్క కంబకాయ గ్రామంలోనే 320కి పైగా బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. చుట్టుపక్కల 70 గ్రామాల వరకు ఈ ఊరిని స్ఫూర్తిగా తీసుకొని బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాయి, నిర్మిస్తున్నాయి. ఎలా తయారుచేస్తారు? మొదట ట్యాంకు నిర్మిస్తారు. ఈ ట్యాంకు భూమి అడుగు భాగంలో ఉంటుంది. ట్యాంకుకు ప్రక్కన కానీ, ట్యాంకు పైన కానీ ఒక కుండీ నిర్మిస్తారు. ఆ కుండీ ద్వారా పేడ, నీరు కలిపి బాగా చిక్కటి ద్రవ పదార్థంలా తయారు చేసి ట్యాంకులోకి విడిచిపెడతారు. ట్యాంకులో ప్రవేశించిన పేడ మూడు రోజులకి (ప్రారంభంలో) గ్యాస్‌గా మారుతుంది. ఆ ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్ సహాయం తో గ్యాస్ పొయ్యి వరకు సరఫరా అవుతుంది. మరో వైపు ట్యాంకు లోపల వ్యర్థపదార్థం రెండవ వైపు ఏర్పాటు చేసిన ఔట్లెట్ ద్వారా బయటకు వెళుతుంది. దీన్ని ‘స్లర్రీ’ అంటారు. ప్రతిరోజూ పశువుల పేడను ద్రవపదార్థంగా మార్చి ట్యాంకులో వేస్తుండాలి. ప్రయోజనం ఏమిటి? ‘‘బయోగ్యాస్ వినియోగం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది’’ అంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్ పి.కుసుమకుమారి. గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయమనే కాకుండా, బయోగ్యాస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంట చేసే మహిళలకు కళ్ల జబ్బులు, ఇతర హానికరమైన సమస్యలు ఉండవు. బయోగ్యాస్ వినియోగం అనంతరం విడుదలయ్యే వ్యర్థ పదార్థం ‘స్లర్రీ’ని పంట పొలాలలో ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ సేంద్రియ ఎరువు వినియోగం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. గ్యాస్ వృథా అవుతుందనిగానీ, ప్రమాదాలు సంభవిస్తాయనే భయం కానీ గృహిణులకు ఉండదు. బయోగ్యాస్‌ద్వారా విద్యుద్దీపాలనూ వెలిగించుకోవచ్చు. ప్రభుత్వ చేయూత... ఒక ప్లాంట్ నిర్మాణానికి సుమారు ఇరవైవేల రూపాయల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ (నెడ్కాప్) ద్వారా ఒక్కో ప్లాంట్‌కు ఎనిమిదివేల రూపాయల సబ్సీడి ఇస్తోంది. సబ్సీడీలో భాగంగా పొయ్యి, ఇతర పరికరాలను కూడా సరఫరా చేస్తారు. పర్యావరణ మిత్ర... బయోగ్యాస్‌కు ముందు వంటచెరుకు కోసం చెట్లను నరికేసేవారు. దీని ప్రభావం పర్యావరణంపై పడేది. బయోగ్యాస్ పుణ్యమా అని చెట్లకు ముప్పు తప్పింది. దోమల బెడద తప్పింది. రసాయనిక ఎరువులు కొనే అవసరం తప్పింది. ఒక్కటా రెండా... బయోగ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ్యాస్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ తెలుగునాట అగ్రస్థానంలో నిలిచి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న కంబకాయ బాటలో ప్రయాణించడానికి ఎన్నో గ్రామాలు స్ఫూర్తి పొందుతున్నాయి. - సదాశివుని కృష్ణ, సాక్షి, నరసన్నపేట ఫొటోలు: చల్ల మల్లేశ్వరరావు 1. ట్యాంక్‌లో పేడ కలుపుతున్న దృశ్యం 2. స్లర్రీ వినియోగించిన పొలంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం 3. బయోగ్యాస్ ద్వారా వంట చేస్తున్న గృహిణి ఎలాంటి సమస్యా లేదు... ఇరవై సంవత్సరాల నుంచి బయోగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాం. ఇప్పటికి వరకు ఏ విధమైన సమస్య రాలేదు. ప్లాంట్ నిర్మాణానికి స్వామిబాబు వజ్రమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (ఎస్వీసిటీ) స్వచ్ఛంద సంస్థ సహకరించింది. - పాగోటి లక్ష్మి, గృహిణి, కంబకాయ వంటతో పాటు వ్యవసాయోత్పత్తికీ... బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్లర్రీని సేంద్రియ ఎరువుగా వినియోగించడం వల్ల అధిక దిగుబడి, భూమి సారవంతంగా తయారవడం వంటి మంచి ఫలితాలు ఉన్నాయి. వంట ప్రయోజనం కంటే వ్యవసాయోత్పత్తికి ఇది మరీ ప్రోత్సాహంగా ఉంది. - గుజ్జిడి నాగేశ్వరరావు, రైతు -
ఏ బాధ మృత్యువై తరిమిందో?!
నరసన్నపేట: అప్పుల బాధలు లేవు.. కుటుంబ సమస్యలు అంతకన్నా లేవు.. మరి ఏ కారణం వారిని మృత్యు సాగరం వైపు తరిమిందో గానీ.. ఒక కుటుంబం సముద్రంలో కలిసిపోవడానికి చేసిన ప్రయత్నంలో అభం శుభం తెలియని ఇద్దరు పసిపిల్లలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన వారు నరసన్నపేటకు చెందిన వారు కావడంతో పట్టణంలో విషాదం అలుముకుంది. నరసన్నపేటకు చెందిన తంగుడు శ్రీనివాసరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద శ్రీనివాస స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు చరణ్‌దేవ్(3), చేతన్‌కుమార్(1) ఉన్నారు. ఈయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నాయి. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన శ్రీనివాసరావు యజమానితో వివాదం ఏర్పడటంతో ఉద్యోగం మానేసి నరసన్నపేట వచ్చేశాడు. అప్పటినుంచి స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నాడు. కాగా చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్‌కు చూపించేందుకు శ్రీకాకుళం వెళుతున్నానని చెప్పి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో శ్రీనివాసరావు భార్యాబిడ్డలతోపాటు ఇంటి నుంచి బయలుదేరాడు. శ్రీకాకుళం చేరుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేస్తామని తన వదినతో చెప్పాడు. భోజన సమయం గడిచిపోయినా వారు రాకపోవడంతో తాను ఫోన్ చేసి వాకబు చేయగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్నామని, తమ గురించి ఎదురుచూడవద్దని శ్రీనివాసరావు చెప్పాడని అతని వదిన వివరించారు. అయితే ఆ తర్వాత సాయంత్రం, రాత్రి ఫోనులో వారితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం ఉదయానికైనా వారు తిరిగి వస్తారనుకుంటే.. వారి మరణ సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. సముద్రంలో దూకి శ్రీనివాసరావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని.. వారిలో వెంకటలక్ష్మిని స్థానికులు రక్షించడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉందని స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం చనిపోయారని తెలుసుకుని ఆ వీధిలోనివారు సైతం కన్నీరు పెట్టారు. తమ కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని కుటుంబ సభ్యులు చెబుతుండగా.. శ్రీనివాసరావు చాలా మంచివాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని మరి ఎందుకు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. కొన ఊపిరితో చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మి కోలుకుంటే గానీ ఈ సంఘటనకు కారణాలు వెల్లడయ్యే అవకాశం లేదు. -
రైతు తృప్తిగా జీవించాలన్నదే లక్ష్యం
- సాగునీరు సక్రమంగా అందాలి - తాగునీటి సమస్య పరిష్కరించా - నరసన్నపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణదాస్ నరసన్నపేట, న్యూస్‌లైన్: రైతులంతా తృప్తిగా జీవించాలని, పేదవాడి ముఖంలో నిరంతరం చిరునవ్వు కని పించాలన్నదే లక్ష్యమని నరసన్నపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించానని చెప్పారు. సక్రమంగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నానన్నారు. ‘న్యూస్‌లైన్’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. న్యూస్‌లైన్: రైతులకు ఏమి చేయాలనుకుంటున్నారు? కృష్ణదాస్: వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కోట్లాది రూపాయలతో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించాను. వీటిలో కొన్ని మరమ్మతులకు గురై పని చేయడం లేదు. వీటన్నింటిని బాగు చేయించి రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చూస్తాను. న్యూస్‌లైన్: వంశధార ఓపెన్ హెడ్ చానల్స్ విషయంలో ఏమి చేయాలని అనుకుంటున్నారు..? కృష్ణదాస్: నరసన్నపేట, పోలాకి, జలుమూరులో కొంత ప్రాంతం రైతులకు సాగునీరు సరఫరా చేసేందుకు వంశధార ఓపెన్‌హెడ్ చానల్స్ నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపాను. వైఎస్ హయాంలో దీన్ని మంజూరు చేయించాను. అప్పట్లో రూ. 25 కోట్లతో పూర్తి కావాల్సిన ఈ పథకాలు ఆ తరువాత వచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ. 90 కోట్లు బడ్జెట్‌కు చేరుకుంది. జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే వీటి కోసం ఒత్తిడి చేసి నిధులు మంజూరు చేయించి ఓపెన్‌హెడ్ చానల్స్ నిర్మాణం తొందరగా జరిగేలా చూస్తా. న్యూస్‌లైన్: తాగునీటి సమస్యపై మీరు ఏమంటారు? కృష్ణదాస్: చాలా వరకు తాగునీటి సమస్య పరిష్కరించాను. ప్రధానంగా తీర ప్రాంత ప్రజలకు ఈ సమస్య ఎదురు కాకుండా వైఎస్ హయాంలో 40 గ్రామాలకు ప్రత్యేక పథకం రూపొందించా. ఈ పథకాన్ని మరింత మెరుగు పరిచి ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా చూస్తా. న్యూస్‌లైన్: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి? కృష్ణదాస్: ప్రతీ గ్రామానికి రోడ్డు నిర్మాణం జరిగింది. ఉడా నిధులతో టౌన్లో, నాబార్డు నిధులతో గ్రామీణ ప్రాంతాలకు లింక్ చేస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది. మరిన్ని రోడ్ల పూర్తికి కృషి చేస్తా. న్యూస్‌లైన్: పేదలకు ఇళ్ల మంజూరుపై ఏమంటారు? కృష్ణదాస్: తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిలోపలే దివంగత నేత వైఎస్‌ని నరసన్నపేటకు ఆహ్వానించాను. నరసన్నపేట, సత్యవరం సభల్లో 800 ఇళ్లు మంజూరు చేశారు. 70 శాతం వరకు నిర్మాణం పూర్తయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు గృహ నిర్మాణాలపై శ్రద్ధ చూపకపోవడంతో ఇప్పటికీ చాలామంది ఇళ్ల కోసం తిరుగుతున్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాను. న్యూస్‌లైన్: నరసన్నపేటలో ఇండోర్‌స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలిపోయింది? కృష్ణదాస్: ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. ప్రభుత్వం కూడా స్పందించి స్థల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేసింది. న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో ప్రజాస్పందన ఎలా ఉంది? కృష్ణదాస్: ప్రజా స్పందన చాలాబాగుంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎప్పుడు వేయాలా అని జనం ఎదురు చూస్తున్నారు. -
పేరు ‘పెద్ద’..!
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: మునుపెన్నడూ లేని దుర్భర పరిస్థితిని జాతీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయి. వరుస ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర విభజన సెగ కాంగ్రెస్, బీజేపీలకు తాకింది. దీంతో రెండింటికీ..అభ్యర్థులు కరువవుతున్నారు. బీజేపీ పరిస్థితి గతానికి భిన్నంగా ఏమీ లేకపోగా..మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం అతి దారుణంగా తయారైంది. మున్సిపల్ ఎన్నికల్లో వల వేసినా.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకడం లేదు. పరువు నిలుపుకునేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నా.. వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలకూ అభ్యర్థుల కొరత ఏర్పడింది. దీంతో చాలా చోట్ల బల మైన అభ్యర్థులు పోటీలో ఉండకపోవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నరసన్నపేట మండలంలో ఒక్క చెన్నాపురం మినహ మరెక్కడా ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు లేరు. జలుమూరు, సారవకోట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు.. వారి గుర్తులను మున్సిపల్ ఎన్నికలకు కేటాయించింది. స్వతంత్రులకు కోసం 82 గుర్తులను ఖరారు చేసింది. కాంగ్రెస్‌కు హస్తం, బీజేపీకి కమలం, సీపీఐకి కంకి, సీపీఎంకు సుత్తి,కత్తి నక్షత్రం, బీఎస్పీకి ఏనుగు గుర్తులను కేటాయించగా..వైఎస్సార్ సీపీకి ఫ్యాన్ గుర్తును కేటాయించింది. అలాగే..టీడీపీతో ఇతర పార్టీలకు ఆయా గుర్తులను నిర్ధారించింది. గడ్డు పరిస్థితి.. విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను ఆపార్టీ సీనియర్ నాయకులు వీడటంతో..గతంలో ఎప్పుడూ లేని దుస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఏళ్లు గడుస్తున్నా.. బీజేపీ మాత్రం బలం పుంజుకోవడం లేదు. దీంతో రెండు జాతీయ పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఐదు ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని జాతీయ పార్టీలకు అంత సీన్ లేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో అధిక శాతం ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ప్రాంతీయ పార్టీల గుర్తులే ఉండనున్నాయి.