ఉంటాయో... ఊడుతాయో! | Suspicions of political differences would be canceled | Sakshi
Sakshi News home page

ఉంటాయో... ఊడుతాయో!

Published Sat, Sep 20 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

ఉంటాయో... ఊడుతాయో!

ఉంటాయో... ఊడుతాయో!

- సరికొత్త షరతులతో పింఛన్‌దారుల ఆందోళన
- పింఛన్ పెంపు ఆనందాన్ని ఆవిరి చేసిన ఆంక్షలు
- సర్వే కమిటీల్లో రాజకీయులకే ప్రాధాన్యం
- రాజకీయ విభేదాలతో రద్దు చేస్తారన్న అనుమానాలు
- జిల్లాలో 15 శాతం వరకు కోత పడే సంకేతాలు
- కమిటీల నియామకం పూర్తి చేయని అధికారులు
- శుక్రవారం ప్రారంభం కాని సర్వే ప్రక్రియ
శ్రీకాకుళం పాత బస్టాండ్, నరసన్నపేట రూరల్: ఎన్నికల హామీ మేరకు సామాజిక పింఛన్ మొత్తాలను వచ్చే నెల రెండో తేదీ నుంచి పెంచనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. అంతకుముందే ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలను కుదించేందుకు సమాయత్తం కావడం పింఛనుదారులను ఆందోళనకు గురి చేస్తోంది. అనర్హులను గుర్తించే సర్వే కమిటీల్లో ఎక్కువగా అధికార పార్టీకి చెందినవారే ఉండటం, అర్హతలపై పలు ఆంక్షలు విధించడంతో  ఎవరి పాపం ఎవరికి చుట్టుకుంటుందో.. ఎవరు బలైపోతారోనన్న ఆందోళన వేలాది పెన్షనర్లను కుదిపేస్తోంది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాధారణ పింఛను మొత్తాన్ని రూ. 75 నుంచి రూ. 200కు పెంచారు. వికలాంగులకు రూ. 500 చేశారు. అర్షులందరికీ ఉదారంగా మంజూరు చేశారు. ఈ మొత్తాలను వరుసగా రూ.1000, రూ.1500కు పెంచనున్నట్లు టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ పార్టీయే అధికారంలోకి రావడంతో పింఛను పెరుగుతుందని ఆశించిన లబ్ధిదారులకు, ప్రస్తుత సర్వే ఆందోళన కలిగిస్తోంది. గత ఏడేళ్లుగా నిరంతరాయంగా పింఛను పొందుతున్న వారిలో అభద్రతాభావం నెలకొంది.
 
వైఎస్ అనంతరం క్రమంగా కుదింపు
ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి పింఛన్ రద్దు చేసేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 135 ద్వారా  జిల్లాలో ఉన్న సామాజిక పెన్షన్లలో 15 శాతం వరకు కోత వేయనున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2010 తర్వాత నుంచి ఏదో రకంగా పెన్షనర్లను తగ్గిస్తూ వస్తున్నారు. అప్పట్లోనే 20 వేల వరకు తగ్గాయి. ఇక గత మూడు నాలుగేళ్లలో ‘సదరం’ పేరిట వికలాంగ  పింఛన్లలో దాదాపు సగం కోత వేశారు. ఇప్పుడు మళ్లీ కోతకు సిద్ధమవుతున్నారు. లబ్ధిదారుల అర్హతలను నిర్థారించేందుకు ఈ జీవోలోనే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. వాటిని తలచుకుని పింఛనుదారులు అభద్రతకు లోనవుతున్నారు. ముఖ్యంగా  ఆధార్ అంశం వృద్ధులను ఆందోళనకు గురి చేస్తోంది. వయోభారంతో వేలిముద్రలు పడక చాలా మంది ఆధార్ కార్డులు పొందలేకపోయారు. ఇప్పుడు ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇటువంటివారి పెన్షన్లు రద్దయ్యే ప్రమాదముంది.
 
కమిటీల ఏర్పాటులో ఎంపీడీవోలు
పెన్షన్ల సర్వేకు ప్రభుత్వ నిర్దేశించిన విధంగా వివిధ స్థాయిల కమిటీల  ఏర్పాటు పనిలో ఎంపీడీవోలు నిమగ్నమయ్యారు. గ్రామాల్లో సర్పంచులు, మున్సిపాలిటీల్లో కమిషన ర్లు కీలకపాత్ర పోషిస్తారు. వాస్తవానికి కమిటీల ఏర్పాటు పూర్తి చేసి, శుక్రవారం నుంచే  సర్వే ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోవడంతో సర్వే ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ కమిటీల్లో  గ్రామ రెవెన్యూ ఆధికారి సభ్యుడు కాదు. అలాంటప్పుడు భూముల వివరాలు ఎవరు నిర్థారిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆధికారుల కంటే రాజకీయ నాయకులకే ప్రాధాన్యత కల్చించడంతో రాజకీయ కక్షలు రేగే ప్రమాదం కూడా ఉంది.
 
కొత్త దరఖాస్తులకు అవకాశమిచ్చినా..
కొత్తవారి నుంచి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ఇకనుంచి ఇప్పుడున్న లబ్ధిదారుల్లో  మరణించిన లేదా రద్దయిన పెన్షనర్ల స్థానంలోనే కొత్తవారికి అవకాశం ఇస్తారు. దీంతో ముందు ముందు పింఛన్లకు డిమాండ్ పెరగనుంది. ఇప్పటికే టీడీపీ నాయకులు తమ అనుయాయులకు, పార్టీ వారికి పింఛన్తు మంజూరూ చేయిస్తామంటూ దరఖాస్తుల సేకరణకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులోనూ రాజకీయ ప్రమేయంతోనే పెన్షన్లు మంజూరయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
 
గ్రామస్థాయి కమిటీ సభ్యులు
గ్రామస్థాయిలో చేపట్టే సర్వేకు పంచాయతీ యూనిట్‌గా కమిటీ ఉంటుంది. ఇందులో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, డ్వాక్రా సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, వీఆర్వో లేదా పంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఏదైనా గ్రామంలో 250 మందికి మించి పింఛనుదారులు ఉంటే రెండో కమిటీని వేస్తారు.
 
విధిగా ఆధారాలు చూపాల్సిందే
ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు సర్వేకు వచ్చే బృందాలు కోరిన ఆధారాలను తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు సర్వే జరిగే రెండు రోజుల పాటు లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి. అందుబాటులో లేకపోయినా, ఆధారాలు చూపకపోయినా ప్రస్తుతం అందుతున్న పింఛన్ రద్దవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement