
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మారుతీ నగర్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రాడ సురేష్, ప్రమీల దంపతుల కవలలు ప్రార్ధన, సాధన నాలుగు రోజుల వ్యవధిలో మూడు బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఔరా అనిపించారు. నాలుగేళ్ల నాలుగు నెలల వయసు కలిగిన వీరి జ్ఞాపక శక్తిని 22 నెలల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. వర్చువల్ పద్ధతిలో వీరి జ్ఞాపక శక్తిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన ప్రతినిధులు పరిశీలించారు.
ఈ బాలికలు 118 రసాయనిక శాస్త్ర మూలకాల పేర్లు, 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు నిమిషాల వ్యవధిలో చెప్పడంతో ఈ మూడు రికార్డులను సాధించారని తండ్రి సురేష్ తెలిపారు. ఈ నెల 21న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, 22న కలాం వరల్డ్ రికార్డ్స్, 24న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు ఆయా సంస్థలు సమాచారం ఇచ్చాయని సురేష్ తెలిపారు. వేమన పద్యాలు, గణిత గుర్తులు, ఆకృతులు, చరిత్రకు సంబంధించిన కట్టడాలు, వ్యక్తుల పేర్లు కూడా వారు చెప్తారని తెలిపారు. కన్నడ, గుజరాతీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో అంకెలు చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment