సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన.. దేశానికే ఆదర్శమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆయన అండగా ఉన్నారని.. సామాజిక న్యాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారాయన. బుధవారం శ్రీకాకుళం నరసన్నపేటలో జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన.
‘‘ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అన్నది ఎవరు?. చంద్రబాబు అడుగడుగునా దళితుల్ని అవమానించారు. అధికారం కోసం కాదు.. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు జగన్. అందుకే వెనుకబడిన వర్గాల వాళ్లు ఇవాళ తలెత్తుకుని బతుకుతున్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. రైతు భరోసాతో కర్షకులకు ఆర్థిక భరోసా లభించింది. విత్తనాలు రైతుల ముంగిటకే వస్తున్నాయి. వెనకబడిన వర్గాలకు అండగా ఉంటూ.. సామాజిక న్యాయం పాటిస్తూ.. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ జైత్రయాత్రను ఆపే శక్తి ఎవరికీ లేదు అని తమ్మినేని అన్నారు.
అంతకు ముందు.. మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు ప్రసంగించారు. బహిరంగ సభకు ముందు.. నరసన్నపేటలో అంబేద్కర్, వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే లు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment