ఏ బాధ మృత్యువై తరిమిందో?!
నరసన్నపేట: అప్పుల బాధలు లేవు.. కుటుంబ సమస్యలు అంతకన్నా లేవు.. మరి ఏ కారణం వారిని మృత్యు సాగరం వైపు తరిమిందో గానీ.. ఒక కుటుంబం సముద్రంలో కలిసిపోవడానికి చేసిన ప్రయత్నంలో అభం శుభం తెలియని ఇద్దరు పసిపిల్లలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన వారు నరసన్నపేటకు చెందిన వారు కావడంతో పట్టణంలో విషాదం అలుముకుంది. నరసన్నపేటకు చెందిన తంగుడు శ్రీనివాసరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద శ్రీనివాస స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు చరణ్‌దేవ్(3), చేతన్‌కుమార్(1) ఉన్నారు. ఈయనకు ఒక సోదరుడు ఉన్నాడు.
ఈ రెండు కుటుంబాలు కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నాయి. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన శ్రీనివాసరావు యజమానితో వివాదం ఏర్పడటంతో ఉద్యోగం మానేసి నరసన్నపేట వచ్చేశాడు. అప్పటినుంచి స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నాడు. కాగా చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్‌కు చూపించేందుకు శ్రీకాకుళం వెళుతున్నానని చెప్పి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో శ్రీనివాసరావు భార్యాబిడ్డలతోపాటు ఇంటి నుంచి బయలుదేరాడు. శ్రీకాకుళం చేరుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేస్తామని తన వదినతో చెప్పాడు.
భోజన సమయం గడిచిపోయినా వారు రాకపోవడంతో తాను ఫోన్ చేసి వాకబు చేయగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్నామని, తమ గురించి ఎదురుచూడవద్దని శ్రీనివాసరావు చెప్పాడని అతని వదిన వివరించారు. అయితే ఆ తర్వాత సాయంత్రం, రాత్రి ఫోనులో వారితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం ఉదయానికైనా వారు తిరిగి వస్తారనుకుంటే.. వారి మరణ సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. సముద్రంలో దూకి శ్రీనివాసరావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని.. వారిలో వెంకటలక్ష్మిని స్థానికులు రక్షించడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉందని స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం చనిపోయారని తెలుసుకుని ఆ వీధిలోనివారు సైతం కన్నీరు పెట్టారు. తమ కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని కుటుంబ సభ్యులు చెబుతుండగా.. శ్రీనివాసరావు చాలా మంచివాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని మరి ఎందుకు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. కొన ఊపిరితో చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మి కోలుకుంటే గానీ ఈ సంఘటనకు కారణాలు వెల్లడయ్యే అవకాశం లేదు.