మద్యం మత్తులో.. తలుపు వేసి, కొడవలితో అతి కిరాతకంగా.. | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో.. తలుపు వేసి, కొడవలితో అతి కిరాతకంగా..

Published Sat, Aug 12 2023 12:12 AM | Last Updated on Sat, Aug 12 2023 1:33 PM

- - Sakshi

భద్రాద్రి: మద్యానికి బానిసైన వ్యక్తి.. భార్యతో గొడవ పడుతూ ఆవేశంతో ఆమైపె కొడవలితో దాడి చేసి హతమార్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామపంచాయతీ పరిధి తాటి నాగులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మొడియం పాపారావు – వెంకటలక్ష్మి(45)కి ఇద్దరు కుమార్తెలుండగా వివాహాలు జరిగాయి.

కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన పాపారావు గురువారం అర్ధరాత్రి దాటాక భార్యతో మత్తులో గొడవపడ్డాడు. మద్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోని విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరగగా ఆయన వెంకటలక్ష్మిని కర్రతో కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వచ్చి పాపారావును అడ్డుకునేందుకు యత్నించారు. అయినా సరే పాపారావు ఆగకపోగా, ‘నా భార్యను కొడతా, తిడతా.. మీకెందుకు’అనడంతో రోజూ జరిగే గొడవే కదా అని వారు వెళ్లిపోయారు.

తలుపు వేసి, కొడవలితో దాడి చేసి..
ఇరుగుపొరుగు వెళ్లాక ఇంటి తలుపులు వేసిన పాపారావు మరోసారి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కొడవలితో తలపై మోది, తల, ముఖంపై దాడి చేయగా తీవ్ర రక్తస్రావమై మృతి చెందింది.

శుక్రవారం ఉదయం కూలీ పనులకు పిలిచేందుకు స్థానిక మహిళలు వెళ్లగా ఆమె రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు తెలిపారు. సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ పి.శ్రీకాంత్‌ చేరుకుని కొడవలితో విచక్షణారహితంగా దాడి చేయడంతోనే రక్తస్రావమై ఆమె మృతి చెంది ఉంటుందనే నిర్ధారణకు వచ్చారు. కాగా, పరారీలో ఉన్న పాపారావు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement