Family commit suicide
-
కృష్ణా నదిలో దూకి జెన్కో ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
సాక్షి, నాగార్జునసాగర్: జెన్కో ఉద్యోగి, ఆయన భార్య, కుమారుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నాగార్జునసాగర్ విద్యుదుత్పాదన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మండాది రామయ్య (36), భార్య నాగమణి (30), కుమారుడు సాత్విక్ (13) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. సాగర్ ప్రాజెక్టు దిగువన కృష్ణానది వంతెనపై రామయ్య బైక్, సెల్‌ఫోన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామయ్య నివాసంలో వెతకగా, సూసైడ్ నోట్ దొరికింది. తర్వాత బైక్ కన్పించిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ల సాయంతో వెతికారు. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. దీంతో పోలీసులు శుక్రవారం ఉదయం మరోసారి గాలించగా, ముగ్గురి మృతదేహాలు నదిలో తేలుతూ కన్పించాయి. నాగార్జునసాగర్ ఆనకట్టకు దిగువన కృష్ణానది తీరంలోని చింతలపాలెంకు చెందిన రామయ్య భూమి సాగర్ ప్రాజెక్టు టెయిల్‌పాండ్‌లో ముంపునకు గురికావడంతో భూ నిర్వాసితుల కింద ఆయనకు జెన్కోలో ఉద్యోగం వచ్చింది. ఆత్మహత్యకు కారణం ఏంటి? మండాది రామయ్య కుటుంబం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనేది స్పష్టం కావట్లేదు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లు రామయ్య సూసైడ్ నోట్లో పేర్కొన్నా.. ఆ విషయాల గురించి తమతో ఎప్పుడూ చర్చించలేదని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆన్లైన్ యాప్‌ల వ్యాపారంలో రామయ్య పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు కొందరు చెబుతున్నారు. -
ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య
-
ఆడపిల్లల్ని కన్నందుకు వేధింపులు.. కుటుంబం ఆత్మహత్య
సాక్షి, కీసర: కుటుంబసభ్యుల వేధింపులు పచ్చని సంసారంలో చిచ్చు రేపాయి. సొంత అమ్మానాన్నలే వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేని ఓ యువకుడు భార్యాపిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కీసరలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మణిపడిగ రమేశ్ (30), మానస (26), గీతశ్రీ (3), దివిజశ్రీ (ఆరు నెలలు)లుగా పోలీసులు గుర్తించారు. అయితే మానస చీర కొంగులోనే చిన్నారి దివిజశ్రీ చనిపోయి ఇద్దరి శరీరాలు అతుక్కొని ఉండటం అందరినీ కలచివేసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... శామీర్‌పేట మండలం ఉద్దెమర్రికి చెందిన శ్యామల అలియాస్ మానస(22)తో రమేశ్‌కు 2014 మార్చి 23న వివాహమైంది. ఘట్కేసర్ మండలం కొండాపూర్‌లో తమకున్న ఎకరం భూమిలో రమేశ్ బర్రెలకు కావాల్సిన దాణా పెంచుతూ, పాల వ్యాపారం చేస్తున్నాడు. మానసకు మూడేళ్ల కిందట ఓ ఆడపిల్ల (గీతశ్రీ) పుట్టింది. మళ్లీ ఆరు నెలల క్రితం రెండోసారి ఆడపిల్ల (దివిజశ్రీ) పుట్టింది. ఆరు నెలలుగా పెరిగిన వేధింపులు రెండో పిల్ల పుట్టినప్పటి నుంచీ ఆమెకు అత్త అంజమ్మ, మామ రాములు వేధింపులు ఎక్కువయ్యాయి. వీరితో పాటు ఆడపడుచులు పద్మ, లక్ష్మి కూడా ఈమెను వేధించసాగారు. అయినా అటు తల్లిదండ్రులకు నచ్చజెబుతూ, ఇటు భార్యను ఓదారుస్తూ రమేశ్ సంసారాన్ని ముందుకు సాగిస్తున్నాడు. అయితే ఆడపడుచు పద్మ సోమవారం మరదలు మానసను కొట్టి, అన్న రమేశ్‌ను అసభ్యపదజాలంతో తిట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లమని గెంటేసింది. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్.. భార్య మానస, ఇద్దరు ఆడపిల్లలు గీతశ్రీ, దివిజశ్రీలను తీసుకొని రెండు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ విషయం తెలిసి అక్కడే సమీపంలో ఉండే మానస బంధువులు వారి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో కీసర పెద్దచెరువు కట్ట సమీపంలో రమేశ్ స్కూటర్‌తో పాటు మానస, గీతశ్రీ చెప్పులు కనిపించాయి. మానస తల్లిదండ్రులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో తేలియాడుతున్న రమేశ్, కొద్దిదూరంలో పడి ఉన్న గీతశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. చెరువు మధ్యలో మానసతో పాటు ఆమె చీర కొంగులోనే ఆరు నెలల పాప దివిజశ్రీ విగతజీవురాలై కనిపించింది. ఈ మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆడపిల్లలు పుట్టారని అత్తింటివారు వేధించడంతోనే ఈ ఆత్మహత్యలు జరిగాయని మృతురాలు మానస తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఏం కష్టమొచ్చిందో.. కుమార్తె పుట్టినరోజు నాడే..!
కుమార్తె పుట్టిన రోజును ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కొత్త బట్టలు కొనాలనుకున్నారు. ఉదయాన్నే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించారు. అంతలోనే ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. స్కూలుకు వెళ్లిన పిల్లల్ని వెంట తీసుకొచ్చి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ముందుగా భర్తకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చింది. ఇది విన్న ఆ భర్త తానూ పురుగుమందు తాగి ప్రాణాలు విడిచాడు. సోమవారం జరిగిన ఈ హృదయ విదారక ఘటన జె.పంగులూరు మండలం రామకూరులో తీవ్ర విషాదం నింపింది. సాక్షి, జె.పంగులూరు: మండలం రామకూరు గ్రామానికి చెందిన పెనుబోతు సోమశేఖర్ (40)కు తొమ్మిదేళ్ల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి (32)తో వివాహం జరిగింది. వ్యవసాయం చేసుకుంటూ జీవించే ఈ దంపతులకు కుమార్తె దిగ్విజయ (7), కుమారుడు గణేశ్‌సాయి (4) ఉన్నారు. సోమవారం దిగ్విజయ పుట్టినరోజు కావడంతో కొత్త బట్టలు తెచ్చేందుకు తండ్రి వద్ద డబ్బులు తెచ్చి భార్యకు ఇచ్చాడు సోమశేఖర్. ఉదయం పిల్లలిద్దరీనీ మార్టూరులోని ప్రైవేటు పాఠశాలకు పంపారు. అనంతరం సోమశేఖర్ మాగాణికి నీరు పెట్టడానికి వెళ్లాడు. విజయలక్ష్మి మధ్యాహ్నం పిల్లలు చదువుతున్న స్కూలుకు వెళ్లింది. వారితో కలిసి భోజనం చేసింది. పిల్లలను తాను తీసుకువెళ్తున్నట్లుగా రిజిస్టర్లో సంతకం పెట్టి వారిని నరసరావుపేటకు తీసుకెళ్లింది. అక్కడో స్టూడియోలో పిల్లలతో కలసి ఫొటో తీయించుకుంది. ఆ ఫొటో వెనుక ముగ్గురి పేర్లతోపాటు అడ్రస్ రాసి హ్యాండ్ బ్యాగ్‌లో పెటుకున్న ఆమె పిల్లలను ఇద్దరినీ తీసుకుని ట్రైన్ వచ్చే సమాయానికి పట్టాలపైకి వెళ్లి, కుమార్తె దిగ్విజయ కాలిని తన కాలికి కలిపి కట్టేసుకుని, కుమారుడు గణేశ్‌సాయిని ఎత్తుకుంది. అదే సమయంలో భర్తకు ఫోన్ చేసి తాను పిల్లలు రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పింది. భార్యాపిల్లలు ఇక లేరని.. ఈ విషయం తెలుసుకున్న సోమశేఖర్ తన తండ్రి వద్ద రూ.200 తీసుకుని వలపర్లకు వెళ్లి, పురుగుల మందు కొనుగోలు చేశాడు. అక్కడికి సమీపంలోని నూలు మిల్లులోనికి వెళ్లి తాగి, కేకలు వేశాడు. అది విన్న స్థానికులు అతన్ని చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి, మృతి చెందినట్లు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు. సోమశేఖర్ మృతదేహం సోమవారం రాత్రి ఇంటికి చేరింది. భార్య పిల్లల మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకే రోజు మృతి చెందడంతో రామకూరులో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో బాధితుల ఇంటి వద్దకు చేరుకున్నారు. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం
వేలూరు:స్థల విక్రయంలో మోసం చేసిన వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆటోడ్రైవర్ కుటుంబసభ్యులతో ఎస్పీ కార్యాలయానికి వచ్చి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాట్పాడి తారాపడవేడు ఇలంగో వీధికి చెందిన మణిగండన్ ఆటోడ్రైవర్. భార్య రేఖ, కుమారుడు నగేష్, తల్లి పొన్ని. వీరు గురువారం ఉదయం 11 గ ంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ వంటిపై కిరోసిన్ పోసుకున్నారు. గమనించిన ఎస్పీ కార్యాలయంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల విచారణలో కాట్పాడి హౌసింగ్ బోర్డు వెనుక వైపున మణిగండన్‌కు సొంతమైన 50 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని విక్రయించాలని కాట్పాడికి చెందిన కేజీ కుమార్, శరవణన్ తరచూ బెదిరించడంతో స్థలాన్ని వారికి విక్రయించాడు. పత్రాలు రాసి న అనంతరం రూ.3.5 లక్షల నగదు ఇచ్చారు. మిగిలిన నగదును ఇవ్వాల ని కోరడంతో చంపేస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీనిపై విరుదంబట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే కోర్టులో పరిష్కరించుకోవాలని చెప్పారన్నా రు. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో తమను తరచూ బెదిరిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు విచారణలో పోలీసులకు తెలిపారు. పోలీసు లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్పీ విజయకుమార్ విరుదంబట్టు పోలీసులను ఆదేశించారు. మణిగండన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏ బాధ మృత్యువై తరిమిందో?!
నరసన్నపేట: అప్పుల బాధలు లేవు.. కుటుంబ సమస్యలు అంతకన్నా లేవు.. మరి ఏ కారణం వారిని మృత్యు సాగరం వైపు తరిమిందో గానీ.. ఒక కుటుంబం సముద్రంలో కలిసిపోవడానికి చేసిన ప్రయత్నంలో అభం శుభం తెలియని ఇద్దరు పసిపిల్లలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన వారు నరసన్నపేటకు చెందిన వారు కావడంతో పట్టణంలో విషాదం అలుముకుంది. నరసన్నపేటకు చెందిన తంగుడు శ్రీనివాసరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద శ్రీనివాస స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు చరణ్‌దేవ్(3), చేతన్‌కుమార్(1) ఉన్నారు. ఈయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నాయి. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన శ్రీనివాసరావు యజమానితో వివాదం ఏర్పడటంతో ఉద్యోగం మానేసి నరసన్నపేట వచ్చేశాడు. అప్పటినుంచి స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నాడు. కాగా చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్‌కు చూపించేందుకు శ్రీకాకుళం వెళుతున్నానని చెప్పి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో శ్రీనివాసరావు భార్యాబిడ్డలతోపాటు ఇంటి నుంచి బయలుదేరాడు. శ్రీకాకుళం చేరుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేస్తామని తన వదినతో చెప్పాడు. భోజన సమయం గడిచిపోయినా వారు రాకపోవడంతో తాను ఫోన్ చేసి వాకబు చేయగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్నామని, తమ గురించి ఎదురుచూడవద్దని శ్రీనివాసరావు చెప్పాడని అతని వదిన వివరించారు. అయితే ఆ తర్వాత సాయంత్రం, రాత్రి ఫోనులో వారితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం ఉదయానికైనా వారు తిరిగి వస్తారనుకుంటే.. వారి మరణ సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. సముద్రంలో దూకి శ్రీనివాసరావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని.. వారిలో వెంకటలక్ష్మిని స్థానికులు రక్షించడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉందని స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం చనిపోయారని తెలుసుకుని ఆ వీధిలోనివారు సైతం కన్నీరు పెట్టారు. తమ కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని కుటుంబ సభ్యులు చెబుతుండగా.. శ్రీనివాసరావు చాలా మంచివాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని మరి ఎందుకు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. కొన ఊపిరితో చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మి కోలుకుంటే గానీ ఈ సంఘటనకు కారణాలు వెల్లడయ్యే అవకాశం లేదు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబం ఆత్మహత్య
విజయవాడ, న్యూస్‌లైన్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇద్దరు పిల్లలుసహా యువదంపతులు సైనేడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం విజయవాడలో చోటుచేసుకుంది. గులాబీతోట నేతాజీ వీధికి చెందిన పిన్నింటి రాము (29) చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు, ఆరేళ్ల కిందట అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన భాగ్యలక్ష్మి(25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు యశ్వంత్(5), కుమార్తె రోషిణి(3) ఉన్నారు. స్థానికంగా బంగారు నగలు కుదువపెట్టుకుని రాము వడ్డీలకు ఇస్తుం టాడు. పలువురి వద్ద నగలు తీసుకుని వారడిగిన దానికంటే అధిక సొమ్ము పొందేందుకు పాతబస్తీలో కుదువపెట్టేవాడు. ఆ విధంగా తీసుకున్న మొత్తాన్ని వ్యాపారంలో వెచ్చించినట్టు చెబుతున్నారు. వ్యాపా రం ఆశించిన విధంగా సాగకపోవడంతో భార్య వాటా ధనం ఇవ్వాలంటూ కొంతకాలంగా అత్తింటివారిపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దానికి వారు నిరాకరించడం.. నగలు కుదువపెట్టిన వారు విడిపించుకుంటామని ఒత్తిడి తీసుకురావడంతో మనస్తాపానికి లోనైన రాముభార్య, ఇద్దరు పిల్లలు సహా శనివారం నగల తయారీలో వినియోగించే సైనేడ్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
రాజమండ్రి: ఇద్దరు చిన్నారులతో తల్లిదండ్రులు మృతి చెందిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సారంగధరమెట్టలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తమ పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు విజయనగరం జిల్లా పాలకొండకు చెందిన కింజెరపునాయుడు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వారు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.